టీడీపీ–బీజేపీ కబంధ హస్తాల్లో పవన్‌కళ్యాణ్
– వైఎస్సార్‌సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి
అనంతపురం అగ్రికల్చర్ : టీడీపీ–బీజేపీ కబంధ హస్తాల నుంచి జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ బయటకు రాలేదని వైఎస్సార్ సీపీ రాప్తాడు నియోజక వర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రకాష్‌రెడ్డి మాట్లాడారు. గురువారం నిర్వహించిన బహిరంగసభలో ప్రత్యేక హోదా, ప్యాకేజీ, 100 టీఎంసీలు నీటి కేటాయింపులు, కరువు పరిస్థితులను ప్రస్తావించడం సంతోషమేనన్నారు. అయితే పవన్‌కళ్యాణ్ మాటతీరుచూస్తే ఎక్కడా డిమాండ్లు చేయడం కాని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై కనీస స్థాయిలో విమర్శలు చేయకపోవడం దారుణమన్నారు.
ప్రతిపక్ష నాయకుడిగా వచ్చారా లేక టీడీపీ–బీజేపీ కూటమి ప్రతినిధిగా జిల్లాకు వచ్చారా అనేది అర్థం కావడం లేదన్నారు. ప్రజా సమస్యలు, ప్రజల సంక్షేమం కోసం అవసరం వచ్చినపుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తానంటూ ఎన్నికల ముందు పదే పదే చెప్పిన ఆయన ఇప్పుడు రెండు ప్రభుత్వాలకు సూచనలు చేసే స్థాయికి చేరుకున్నాడని విమర్శించారు. ప్రశ్నించడం అటుంచి తనను తాను ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. పవన్ కళ్యాణ్ సూచనలు స్వీకరిస్తామంటూ రాజకీయ లబ్ధికోసం టీడీపీ నేతలు పైపైకి ప్రకటనలు చేస్తున్నా ఎప్పుడూ ఆయన మాటలు పట్టించుకున్న దాఖలాలు లేవనే విషయం గత రెండేళ్లుగా తెలుస్తోందన్నారు. సాగునీరు, తాగునీరు, రాజధాని, ప్రత్యేక హోదా విషయంలో ప్రభుత్వాలు దారుణంగా వంచించాయన్నారు. వంచనకు గురైన ప్రజల పక్షాన పోరుబాట సాగించాల్సిన పవన్ ఇంకా వారినే నమ్ముకుని ముందుకు పోవడం శోచనీయమన్నారు.
బహిరంగ సభలో పవన్ వ్యవహారశైలి స్పష్టంగా అర్థమైందన్నారు. ఖాళీగా కూర్చుంటే నాకు కూడా డబ్బులు వస్తాయని చెప్పిన పవన్, ఆ చిట్కా ఏదో జిల్లా ప్రజలకు చెబితే బాగుంటుందని సూచించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి పది పన్నెండు సీట్లు గెలిచి గతంలో అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ మాదిరిగా మారిపోతుందనడంతో సందేహం లేదన్నారు. ఉనికి కోసం పవన్ తాపత్రయపడుతున్నారని విమర్శించారు. ప్రత్యేకహోదాను సొంతం చేసుకుని వివిధ రూపాల్లో అలుపెరుగుని పోరాటం సాగిస్తున్న వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి నడిస్తే బాగుంటుందని సూచించారు. అలా కాకుండా ఇక ముందు కూడా ఇదే పంథా అనుసరిస్తే లీడర్ కాదు కదా రీడర్‌గానో, ఐటంగానో, జోకర్‌గానో మిగిలిపోవడం ఖాయమన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మీసార రంగన్న, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దిరెడ్డి నరేంద్రరెడ్డి, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి యూపీ నాగిరెడ్డి, జిల్లా కార్యదర్శి కేశవనాయుడు, రూరల్ మండలం యూత్ కన్వీనర్ వరప్రసాదరెడ్డి, అనిల్‌కుమార్‌గౌడ్ తదితరులు ఉన్నారు.