ప్రభుత్వ వైఫల్యంతోనే ‘అనంత’ కరువు
– వైఎస్సార్‌సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి
– అఖిలపక్షం ఆధ్వర్యంలో కృష్ణా డెల్టా బస్సుయాత్ర
అనంతపురం సెంట్రల్ : నీటి వినియోగంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య ధోరణితోనే ‘అనంత’లో కరువు కాటకాలు అలుముకుంటున్నాయని వైఎస్సార్‌సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. కృష్ణాడెల్టాలో పిల్లకాల్వల పరిశీలనకు అఖిలపక్షం ఆధ్వర్యంలో బస్సు యాత్ర చేపట్టారు. ఆదివారం సాయంత్రం ఆయన నివాసం వద్ద బస్సుయాత్రను జెండా ఊపి ప్రారంభించారు.
అనంతరం ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ హంద్రీనీవా, హెచ్చెల్సీ ద్వారా జిల్లాకు దాదాపు 30 టీఎంసీల నీళ్లు వచ్చినా ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వకుండా రైతులకు తీరని అన్యాయం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. హంద్రీనీవా ద్వారా 6 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలన్నది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కల అని గుర్తు చేశారు. అలాంటిది సీఎం చంద్రబాబునాయుడు డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థను రద్దు చేస్తూ జీవో నెంబర్ 22ను విడుదల చేసి కుప్పంకు తరలించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రాప్తాడు నియోజకవర్గంలో కరువు విలయతాండవం చేస్తోందన్నారు.
ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందకుండా కక్షలు, కార్పణ్యాలతో జీవిస్తున్నారన్నారు. హంద్రీనీవా ద్వారా వచ్చే ప్రతి నీటిబొట్టును రైతులకు చేరాలంటే డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ పటిష్టంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఏడాది అధికారులు ప్రణాళికాబద్దంగ వ్యవహరించిఉంటే కనీసం 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందన్నారు. హంద్రీనీవా ద్వారా నీటిని తీసుకురావడానికి దాదాపు రూ. 200 కోట్లకు పైగా ఖర్చు చేశారని, ఆ నీటిని ఏం చేశారో లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. 2019 తర్వాత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో హంద్రీనీవా, పీఏబీఆర్ ద్వారా ప్రతి చుక్క నీటినీ రైతుకు అందేలా డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ తయారు చేయడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సీనియర్ పాత్రికేయులు ఇమామ్ మాట్లాడుతూ సాగునీరు లేకపోవడం వల్ల రాప్తాడు నియోజకవర్గంలో 40 ఏళ్లుగా ఫ్యాక‌్షన్ ఉంటోందని అన్నారు. వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తరిమెల శరత్‌చంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు వెంకటచౌదరి,పీసీసీ అధికారప్రతినిధి రమణ మాట్లాడుతూ ఈ ఏడాది జిల్లాకు వచ్చిన నీటి ద్వారా కనీసం 2 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వొచ్చన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాప్తాడు మండల కన్వీనర్లు రామాంజనేయులు, నరసింహారెడ్డి, నాగముని, సర్పంచులు లోకనాథరెడ్డి, వెంకటేష్, శ్రీనివాసులు, ఎంపీటీసీ సభ్యులు శ్రీనివాసులు, సుబ్బారెడ్డి, సదానందరెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.