సునీతమ్మా.. రెయిన్‌గన్ల డ్రామా ఇకచాలు
పంటతడి పేరుతో గతేడాది దోపిడీ
– రూ.కోట్లు ఖర్చు చేశారు.. ఎన్నెకరాలు కాపాడారో శ్వేతపత్రం విడుదల చేయాలి
– వైఎస్సార్‌సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి
అనంతపురం: మంత్రి పరిటాల సునీత రెయిన్‌గన్లతో వేరుశనగ పంటను కాపాడుతామంటూ మళ్లీ కొత్త డ్రామాకు తెర తీశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతేడాది రెయిన్‌గన్లకు సుమారు రూ.300–400 కోట్లు ఖర్చు చేసినా ఫలితం లేకపోయిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వచ్చి రెయిన్‌గన్లు స్విచ్‌ఆన్ చేసిన పొలంలోనే పంట ఎండిపోయిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. మళ్లీ రెయిన్‌గన్ల ద్వారా పంటలకు తడులిస్తామని మంత్రి పరిటాల సునీత చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
రెయిన్‌గన్లతో గతేడాది ఎన్ని ఎకరాల్లో వేరుశనగ పంటను కాపాడారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. రైతులను రాష్ట్ర ప్రభుత్వం బిచ్చగాళ్లను చేస్తోందన్నారు. టీడీపీ నాయకుల ఇళ్ల వద్దకు వెళ్లి ఇన్‌పుట్ సబ్సిడీ రాయండి దొరా అని అడుక్కోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. దివంగత వైఎస్ హంద్రీ–నీవా, పీఏబీఆర్ ద్వారా అనంత జిల్లాను సస్యశ్యామలం చేయాలని భావించారన్నారు. టీడీపీ ప్రభుత్వం.. హంద్రీ–నీవా నుంచి దాదాపు 3.50 లక్షల ఎకరాలు, పీఏబీఆర్ ద్వారా 1.50 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చిఉంటే రైతులకు ఇలాంటి దయనీయ స్థితి వచ్చేది కాదన్నారు. జిల్లాలో 50 శాతం మంది రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ జమకాలేదన్నారు. భూమి లేని టీడీపీ కార్యకర్తలు ఖాతాలు, దొంగ పాసు పుస్తకాలు సృష్టించి ఇన్‌పుట్ సబ్సిడీ దోచుకున్నారన్నారు.
జెడ్పీటీసీ సభ్యుడు బిల్లే ఈశ్వరయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి జిల్లాలో రైతు ఏరువాక ప్రారంభానికి వచ్చిన రెండేళ్లు వర్షాలు కురవలేదనే విషయాన్ని రైతులు ఎప్పటికీ మర్చిపోలేరన్నారు. సమావేశంలో పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి యూపీ నాగిరెడ్డి, పార్టీ నాయకులు ఓబుళపతి, నరసింహారెడ్డి, వాసుదేవరెడ్డి, పవన్, శివారెడ్డి, రాజా, అమర్‌నాథరెడ్డి పాల్గొన్నారు.