హమాలీల పొట్ట కొడుతున్నారు
– మంత్రి పరిటాల సునీతపై తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపాటు
అనంతపురం సెంట్రల్ : కందూకూరు సివిల్‌సప్లై గోదాము ద్వారా పాతికేళ్ల నుంచి లబ్ధి పొందుతూ నేడు హమాలీల పొట్ట కొడుతున్నారని మంత్రి పరిటాల సునీతపై వైఎస్సార్‌సీపీ రాప్తాడు నియోజవకర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం నగరంలో వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో బాధిత హమాలీలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కందుకూరు సివిల్‌సప్లై గోదాములో 350 మంది హమాలీలు ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారన్నారు. పరోక్షంగా 1,000 మంది లబ్ధి పొందుతున్నారన్నారు.
అలాగే గుంతకల్లు మండలం తిమ్మనచేర్లు, ఒంగోలు ఎఫ్‌సీ గోదాముల్లో 600 మంది హామాలీలు రోజువారి వేతనంపై ఆధారపడి పని చేస్తున్నారని తెలిపారు. 20 సంవత్సరాలుగా మంత్రి పరిటాల సునీత బినామీల పేర్లతో ట్రాన్స్‌పోర్టేషన్ పనులను దక్కించుకుంటున్నారన్నారు. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆహార ధాన్యాల సేకరణ బాధ్యత ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకే అప్పగించిందన్నారు. దీంతో సివిల్‌సప్లైశాఖ మంత్రిగా ఉన్న పరిటాల సునీత ఆహార ధాన్యాలను ఎఫ్‌సీఐ గోదాముల్లో కాకుండా ప్రైవేటు గిడ్డంగుల్లో నిల్వ చేస్తూ ఎన్నో ఏళ్లుగా ఆధారపడిన హమాలీల పొట్టకొడుతున్నారని విమర్శించారు. ప్రస్తుతం అన్ని సరుకులు ఒంగోలు నుంచి రవాణా చేస్తున్నారన్నా రు.
మంత్రి పరిటాల సునీత బినామీలు ట్రాన్స్‌పోర్టు నిర్వాహకులు కావడంతో ప్రభుత్వంపై 10 రెట్లు భారం పడినా అక్కడి నుంచే రవాణా చేస్తున్నారని వివరించారు. జిల్లాలో ఇంత జరుగుతున్నా సివిల్‌సప్లై అండ్ ఫుడ్‌గ్రైన్ ప్రొక్యూర్‌మెంట్ కమిటీ చైర్మన్ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, సభ్యుడు ఎంపీ నిమ్మలకిష్టప్ప పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ఎఫ్‌సీఐ గోదాముల ద్వారానే ప్రజాపంపిణీ వస్తువులు సరఫరా అయ్యేలా వైఎస్సార్‌సీపీ ఎంపీల ద్వారా పార్లమెంట్‌లో ఒత్తిడి తెస్తామని వివరించారు. అవసరమైతే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ట్రేడ్‌యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి, రాష్ట్ర నాయకులు మీసాల రంగన్న, ధనుంజయయాధవ్, రూరల్ మండల కన్వీనర్ నాగేశ్వరరెడ్డి, విద్యార్థి విభాగం నాయకులు నరేంద్రరెడ్డి, ఎంపీటీసీలు సుబ్బారెడ్డి, గోవిందరెడ్డి, హమాలీలు పాల్గొన్నారు.