రైతులను యాచకులుగా మారుస్తున్నారు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : జిల్లాకు వరప్రదాయిని అయిన హంద్రీనీవాను ప్రభుత్వం విస్మరించి రైతులను యాచకులుగా మార్చేసిందని వైఎస్సార్‌సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం స్థానిక వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో జిల్లాకు 20వ సారి వస్తున్నారన్నారు. కానీ ప్రజలు సంతోషపడాలో బాధపడాలో అర్థం కాని పరిస్థితి అన్నారు. జిల్లాలో బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ కోసం ఎదురుచూసే పరిస్థితి ఉందన్నారు. గతేడాది సకాలంలో ఇన్‌పుట్ సబ్సిడీ అంది ఉంటే అధిక శాతంలో పంటను సాగు చేసేవారన్నారు. 2014 నుంచి రైతు సంఘాలు, రైతులు చేస్తున్న ఆందోళనలు పట్టించుకోకుండా జిల్లాలో 3.55 లక్షల ఎకరాలకు డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ లేదని, ఫిబ్రవరి 2015లో జీఓ విడుదల చేసి డిస్ట్రిబ్యూటరీని తొలగించడం దారుణమన్నారు.
2014–15, 2015–16, 2016–17 గడిచిన మూడేళ్లలో జిల్లాలో రూ.10వేల కోట్ల మేర పంట నష్టం జరిగిందన్నారు. రూ.500 కోట్లు నిధులు ఖర్చు చేసి ఉంటే హంద్రీనీవాకు 25 టీఎంసీ నీటి ద్వారా 3.55 లక్షల ఎకరాలు సస్యశ్యామలం అయ్యేవన్నారు. రక్షక తడులతో ఇన్‌పుట్‌సబ్సిడీ మిగిల్చామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ బీమాతోపాటు హెక్టారుకు రూ.15వేలు మించి అందిస్తామని చెప్పడం దారుణమన్నారు. రూ.1,033 కోట్ల చెక్కును రాయదుర్గంలో ప్రదర్శించి, అనంతకు కేవలం తేలుకుట్టిన దొంగల్లా ఇన్‌పుట్ సబ్సిడీని అందిస్తున్నారన్నారు. 8.5 హెక్టార్లలో పంట వేసారని వీరిలో 5.90 లక్షల హెక్టార్లకు ఇన్‌పుట్ సబ్సిడీ విస్మరించడం దారుణమన్నారు. రూ. 10 కోట్లతో పేరూరు డ్యాంకు మడకశిర బ్రాంచ్ కాలువ నుంచి తురకలాపట్నం వంక ద్వారా పెన్నానదికి నీరందించాలన్నారు. రూ.100 కోట్లతో బోరంపల్లి నుంచి బీటీపీకి నీరిచ్చేందుకు, రూ.150 కోట్లతో బోరంపల్లి లిఫ్ట్ నుంచి కంబదూరు మండలం ఐపార్సుపల్లి, చెన్నంపల్లి మీదుగా పేరూరు డ్యాం నింపేందుకు పరిశీలించాలని విపక్షాల వాదనను, రైతుల ఆక్రందనను పెడచెవిన పెట్టిందన్నారు. రూ. 800 కోట్లతో 4 లక్షల ఎకరాలకు నీరిచ్చే అంశంపై నిర్లక్ష్యం చేస్తే ప్రజలు ప్రభుత్వాన్ని క్షమించరన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనుంజయ యాదవ్, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు లింగారెడ్డి, మద్దిరెడ్డి నరేంద్ర రెడ్డి, రాప్తాడు యూత్ కన్వీనర్ బొమ్మేపర్తి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.