
ఆర్నెళ్లలో సంపూర్ణ రుణమాఫీ చేయాలి
– 27 టీఎంసీల నీటిలెక్కలు చెప్పు సునీతమ్మా..
– 6న ఆత్మకూరులో రైతు సదస్సు
– హాజరుకానున్న ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎంపీ అనంత, ఎమ్మెల్యేలు విశ్వ, రోజా
– రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి
అనంతపురం : జిల్లా రైతులకు ప్రభుత్వం ఆర్నెళ్లలో సంపూర్ణ రుణమాఫీ చేయాలని రాప్తాడు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నాలుగేళ్లుగా జిల్లా అంతా కరువు ప్రాంతంగా ప్రకటిస్తున్నారని, ఇక్కడి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా సంపూర్ణ రుణమాఫీ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. జిల్లావ్యాప్తంగా 15 లక్షల ఎకరాల్లో వేరుశనగ నష్టపోయారని, అయితే.. ప్రభుత్వం రెయిన్‌గన్ల ద్వారా పంటను కాపాడామని అబద్ధాలు చెబుతూ ఏడు లక్షల ఎకరాలకు మాత్రమే ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.
అలాకాకుండా వేరుశనగ సాగు చేసిన ప్రతి రైతుకూ ఎకరాకు రూ. 15 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వాతావరణ బీమా పోనూ తక్కిన మొత్తాన్ని ఇన్‌పుట్ సబ్సిడీగా ఇస్తామని ప్రభుత్వం చెప్పడం దారుణమన్నారు. హంద్రీ–నీవా డిస్ట్రిబ్యూటరీలు ఆర్నెళ్లలో పూర్తి చేసి ఖరీఫ్ నాటికి నీళ్లివ్వాలని డిమాండ్ చేశారు. రైతులు, ప్రజా సమస్యలపై రాప్తాడు నియోజకవర్గంలోని ప్రతి మండల కేంద్రంలో నెలకో సదస్సు ఏర్పాటు చేస్తామన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 6న సాయంత్రం మూడు గంటలకు ఆత్మకూరులో సదస్సు నిర్వహిస్తామన్నారు. పార్టీ జిల్లా పరిశీలకులు, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, రోజా, పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, జెడ్పీ మాజీ చైర్‌పర్మన్ కవిత తదితరులు హాజరవుతారన్నారు. వామపక్ష పార్టీల మద్దతు కూడా కోరుతున్నట్లు చెప్పారు.
మంత్రి నీటి లెక్కలు చెప్పాలి
జిల్లాకు 27 టీఎంసీల నీళ్లు తెచ్చామని చెబుతున్న మంత్రి పరిటాల సునీత ఆ నీటిని ఎక్కడ వాడారు, ఎన్ని ఎకరాల్లో పంటలు పండించారో శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రకాష్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాప్తాడు నియోజకవర్గానికి 0.7 టీఎంసీ మాత్రమే తెచ్చారని, ఇందుకు మంత్రి సిగ్గుతో తల దించుకోవాలని అన్నారు. నియోజకవర్గంలో పీఏబీఆర్ కుడికాలువ కింద 50 వేల ఎకరాలు, హంద్రీ–నీవా కింద 70 వేల ఎకరాలకు నీళ్లివ్వాల్సి ఉందన్నారు. ఇందుకోసం 12 టీఎంసీలు అవసరమన్నారు.అలాగే హిందూపురం, కదిరి, పెనుకొండ, మడకశిర నియోజకవర్గాల్లో మరో 1.50 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలంటే మొత్తం 20 టీఎంసీలు అవసరమన్నారు. అయితే.. 0.7 టీఎంసీ మాత్రమే తెచ్చి వైఎస్సార్‌సీపీ నాయకులను విమర్శించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు.
పొలాలకు నీళ్లివ్వాలని రైతులు అడుగుతుంటే కాలువ వెంట పోతున్న నీటిలో గంగపూజ చేస్తే ఏం లాభమని ప్రశ్నించారు. సమావేశంలో కనగానపల్లి జెడ్పీటీసీ సభ్యుడు బిల్లే ఈశ్వరయ్య, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు పెన్నోబులేసు, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేంద్రరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు సుబ్బారెడ్డి, ఆత్మకూరు మండల కన్వీనర్ నరసింహారెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు వాసుదేవరెడ్డి, యువజన విభాగం నాయకుడు వరప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.