సివిల్ సప్లయ్ స్టేజ్–1 కాంట్రాక్టర్‌కు మంత్రి బినామీ
- ఎఫ్‌సీఐ కార్మిక వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్ర
- ఆందోళన చేస్తాం: తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి
అనంతపురం : పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ఆశాఖ స్టేజ్–1 కాంట్రాక్ట్‌కు బినామీగా వ్యవహరిస్తున్నారని రాప్తాడు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. శనివారం వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా పౌర సరఫరాల స్టేజ్–1 కాంట్రాక్ట్‌లన్నీ మంత్రి, టీడీపీ నాయకుల చేతుల్లో ఉన్నాయన్నారు. ఎఫ్‌సీఐ గోదాముల నుంచి కాకుండా వేర్‌హౌస్‌ల నుంచి ఎంఎల్‌ఎస్ పాయింట్లకు ఆహారధాన్యాలు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. భారత ఆ హార సంస్థ (ఎఫ్‌సీఐ)కు ప్రతి జిల్లాలోనూ గోదాములు ఉన్నాయన్నారు. జిల్లాలో జంగాలపల్లి, తిమ్మనచెర్లలో ఉన్నాయన్నారు. ప్రస్తుతం కర్నూలు జిల్లా ఆదోని, నంద్యాలలోని వేర్‌హౌస్‌ల నుంచి ఎంఎల్‌ఎస్ పాయింట్లకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు.
మరోవైపు ఎఫ్‌సీఐ గోదాముల్లో పని చేస్తున్న కార్మికులు రోడ్డున పడే పరిస్థితి ఉందన్నారు. కందుకూరులోనే దాదాపు 400 మంది కార్మికులు ఉపాధి కోల్పోతున్నారన్నారు. రామగిరి మండలంలో గనులు మూసివేసి 3 వేల కుటుంబాలు రోడ్డున పడేలా చేసిన చరిత్ర పరిటాల కుటుంబానిదేనన్నారు. ఎస్కేయూలో పని 400 మంది ఫ్రీఫుడ్ కార్మికులను తొలిగించారన్నారు. వేలాది మంది ఆరోగ్యమిత్రలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉపాధి మేట్లు, ఆదర్శరైతులు, ఇతర కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలిగించారన్నారు. ఆత్మకూరు మండలం బి. యాలేరులో చెరువు ఆక్రమణతో 400 వాల్మీకి కుటుంబాలు వీధిన పడ్డాయన్నారు. సమావేశంలో యువజన విభాగం అనంతపురం రూరల్ మండలం అధ్యక్షుడు కట్టకిందపల్లి వరప్రసాద్‌రెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి మద్దిరెడ్డి నరేంద్రరెడ్డి పాల్గొన్నారు.