రైతు చెంతకే విత్తనం
♦ ఏ ఒక్కరూ ఇబ్బంది పడొద్దు
♦ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
♦ త్వరలో వెయ్యి మంది వ్యవసాయ అధికారుల నియామకం
♦ జిల్లాలో బిందు సేద్యానికి రూ.170 కోట్లు కేటాయింపు
♦ వ్యవసాయశాఖ అధికారులతో మంత్రి పోచారం
సంగారెడ్డి జోన్: రైతు చెంతకే విత్తనాలు అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధికారులకు సూచించారు. గురువారం సంగారెడ్డిలోని సమీకృత కలెక్టరేట్ ఆడిటోరియంలో విత్తనాల పంపిణీ పై వ్యవసాయ శాఖ అధికారులు, పీఏసీఎస్ చైర్మన్లు, డెరైక్టర్లు, డీసీఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రి పోచారం మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో సకాలంలో విత్తనాలను అందజేయాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం తగదన్నారు. జిల్లాలో వ్యవసాయ శాఖలో 160 మంది అధికారులు 46 మండలాల పరిధిలో పనిచేస్తున్నారన్నారు.
జిల్లా పనితీరు పై అసంతృప్తి...
జిల్లాలో విత్తనాల పంపిణీ పై తన పేషీ నుంచి ఫోన్ చేస్తే అధికారుల నుంచి సరైన స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో అధికారుల పనితీరు సంతృప్తి కలగించలేదన్నారు. బుధవారం జిల్లాలోని ఐదు మంది వ్యవసాయాధికారులకు ఫోన్ ద్వారా సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నించగా ఆశించిన స్థాయిలో సమాధానం రాలేదన్నారు.
రూ. 5 లక్షల బ్యాంకు గ్యారంటీ...
సహకార సంఘాలకు రూ. 5 లక్షల వరకు బ్యాంకు గ్యారంటీ ఇచ్చి విత్తనాలను సరఫరా చేయడం, ఎరువుల విక్రయానికి లెసైన్స్‌లను జారీ చేయడం జరుగుతుందన్నారు. త్వరలోనే టీఎస్‌పీఎస్‌సీ ద్వారా వెయ్యి మంది వ్యవసాయ విస్తరణ అధికాారుల నియామకాలు జరగనున్నాయని, వీటికి తోడు పట్టు పరిశ్రమ, ఉద్యాన శాఖలను సమ్మిళితం చేయడం వల్ల అందులోని 992 మంది ఉద్యోగుల సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటామన్నారు. ఒక్కో మండలానికి అధికారిని నియమించి పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తామన్నా రు. జిల్లాకు రూ. 170 కోట్లను బిందుసేద్యం సాగు కోసం కేటాయించామని, వీటిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. సహకార సంఘాల ద్వారా రుణాలు ఇస్తే రైతుకు ధీర్ఘకాలంలో 6 శాతం రిబేటు వస్తుందన్నారు.
ప్రిస్క్రిప్షన్ ఆధారంగానే ...
పురుగుల మందుల విక్రయాలను ఇక పై ఇష్టానుసారంగా చేయకుండా క్షేత్రస్థాయిలో ఏఓలు పరిశీలించి వారు సూచించిన మందుల ప్రిస్క్రిప్షన్ ఆధారంగానే పురుగుల మందులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. దుకాణాల యజమానులు అమ్ముడుపోని మందులను రైతులకు విక్రయించడం వల్ల అవి పనిచేయకపోవడంతో పంట నష్టపోయి రైతులు అప్పులపాలవుతున్నారని అన్నారు. అలాంటి వాటిని నియంత్రించడానికి స్టాక్ రీఆర్గనైజ్ చేస్తున్నామన్నారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్, స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఏజేసీ వెంకటేశ్వర్లు, ఆకా ఎండీ సురేందర్, వ్యవసాయ శాఖ జేడీ మాధవి శ్రీలత, డీసీఓ సత్యనారాయణరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు, డెరైక్టర్లు, సీఈఓలు, వ్యవసాయాధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులు, ఏడీఏలు తదితరులు పాల్గొన్నారు.