బంధువుల చెరలో ఆ ముగ్గురు!
♦ రైల్వేకోడూరులో 10న ముగ్గురు పిల్లల అదృశ్యం
♦ తన పెద్ద కూతురును ఇవ్వనన్నందుకే కిడ్నాప్ చేశారంటున్న తండ్రి
♦ డోన్‌లో ఉంటున్న సోదరుడి భార్యపై అనుమానం
♦ ఎస్పీ ఆదేశాలతో కదిలిన పోలీసులు
రైల్వేకోడూరు రూరల్ : రైల్వేకోడూరు పట్టణంలో ఈ నెల 10న అదృశ్యమైన ముగ్గురు పిల్లలు వారి బంధువుల చెరలో ఉన్నట్లు తెలుస్తోంది. ఐదు రోజులుగా కనిపించని తమ పిల్లలను తమ వద్దకు చేర్చి న్యాయం చేయాలని పిల్లల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. తొలుత పెద్దగా పట్టించుకోని పోలీసులు ఎస్పీ ఆదేశాలతో రంగంలోకి దిగారు. వివరాలు.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చంబల్ కాలనీ అంబమొరానా ప్రాంతానికి చెందిన షేక్ నజీర్ తన రెండవ భార్య సఖినా బేగంతో కలిసి రైల్వేకోడూరులోని శాంతినగర్‌లో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నాడు. వృత్తిరీత్యా డ్రైవర్ అయిన నజీర్ లారీలో ఇతర ప్రాంతాలకు వెళితే రెండు మూడు రోజుల తర్వాత వచ్చేవాడు. వీరికి కూతరు హజ్రిన్ హుస్సేన్(8), కుమారులు హజరత్ హుస్సేన్(6), జమీర్ హుస్సేన్(3) ఉన్నారు. వీరు ఈ నెల 10వ తేదీన సాయంత్రం 4 గంటలకు ఇంటి వెనుక ఆడుకుంటూ అదృశ్యమయ్యారు. ఆ రోజంతా అన్ని ప్రాంతాల్లో వెతికామని, బంధువులకు కూడా ఫోన్లు చేసి విచారించామని.. అయినా వారి ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు 11వ తేదీన ఫిర్యాదు చేశామని తల్లిదండ్రులు సోమవారం ‘సాక్షి’కి
తెలిపారు. ఎక్కడైనా ఆడుకోవడానికి వెళ్లి ఉంటారని, వెతకాలని పోలీసులు చెప్పారన్నారు. మీ పిల్లలు మహారాష్ట్రలో ఉన్నారంటూ అదే రోజు గుర్తు తెలియని వ్యక్తుల వద్ద నుంచి (+917709855612) ఫోన్ వచ్చిందన్నారు. షేక్ నజీర్ మొదటి భార్య కూతురు నజరానా(18)ను డోన్‌లో ఉన్న గణేష్‌కు ఇచ్చి పెళ్లి చేస్తే సమస్య పరిష్కారమవుతుందని, లేదంటే చంపుతామని బెదిరించారన్నారు. దీంతో తాము జిల్లా ఎస్పీని కలిసి ఆదుకోవాలని కోరామన్నారు. ఆయన ఆదేశాలతో కోడూరు పోలీసుస్టేషనులో కేసు నమోదు చేశారన్నారు.
నా సోదరుని భార్య షమీనా బేగం పనే ఇది..
భాధితులు మాట్లాడుతూ తమ పిల్లలను తీసుకెళ్లింది కర్నూలు జిల్లా డోన్‌లో ఉంటున్న తన సోదరుడు జాకీర్ హుస్సేన్ భార్య షమీనా బేగం అని అనుమానంగా ఉందని షేక్ నజీర్ చెప్పారు. వారి ఇంటికి పారిశుద్ధ్య కార్మికుడైన బినోద్ అగర్వాల్ అనే వ్యక్తి వచ్చి వెళ్తుండే వాడన్నారు. ఇదివరకు తాము వారి ఇంటికి వెళ్లినప్పుడు అతను తన కుమార్తె నజరానాను చూశాడని, అతని బావమరిది గణేష్‌కు ఇచ్చి పెళ్లి చేయాలని కోరాడన్నారు. ఇందుకు తాము తిరస్కరించడంతో కక్ష గట్టిన బినోద్ అగర్వార్ తన సోదరుడి నలుగురు కుమారులను కిడ్నాప్ చేసినట్లు బంధువుల ద్వారా తెలిసిందన్నారు.
నజరానాను తీసుకువస్తే వారి పిల్లలను వదిలేస్తానని బెదిరించడం వల్లే.. షమీనా తమ పిల్లలను ఎత్తుకెళ్లిందని అనుమానం వ్యక్తం చేశారు. షమీనా ఈ నెల 10న కోడూరుకు వచ్చి.. తన గురించి అడగ్గా, తాను లారీపై వెళ్లానని తన భార్య చెప్పిందన్నారు. ఇదే అదునుగా ఇంటి వెనుక ఆడుకుంటున్న పిల్లలను తీసుకెళ్లిందన్నారు. సోమవారం రాత్రి పోలీసులుతో కలిసి డోన్‌కు వెళుతున్నామని ఆయన తెలిపారు. తన మొదటి భార్య పప్పీ బేగం 11 ఏళ్ల క్రితం చనిపోయిందని, నజరానాను తన రెండవ భార్య సఖినా బేగం సొంత తల్లిలా చూసుకుంటోందన్నారు. మంచి అయ్య చేతిలో పెట్టాలని భావించడంతోనే తాము ఆ సంబంధాన్ని తిరస్కరించామని చెప్పారు.