
హత్య కేసులో ముగ్గురి అరెస్ట్
తుంగతుర్తి
తుంగతుర్తి మండలం గుమ్మడవెళ్లికి చెందిన గాడ్దుల సోంమల్లు హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్టు సీఐ దండి లక్ష్మణ్ తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నింది తుల వివరాలు వెల్లడించారు. ఇదే గ్రామానికి చెందిన గాడ్దుల వెంకన్న తల్లి రాములమ్మ నాలుగు సంవత్సరాల క్రితం మృతి చెందింది. ఆమెను గాడ్దుల సోంమల్లు మంత్రాలు చేసి చంపాడని వెంకన్న కక్ష పెంచుకున్నాడు. సోంమల్లు భయంతో తన అత్తగారి గ్రామమైన మరిపెడ మండలం గుండెపూరి వెళ్లి జీవనం సాగిస్తున్నాడు. గాడ్దుల సోంమల్లు 7 రోజుల క్రితం గ్రామానికి వచ్చాడు.
ఈ నెల 13న గాడ్దుల సోం మల్లు తన వ్యవసాయ పొలంలో పనులు చేసుకుంటున్న సమయంలో నిందితుడు గాడ్దుల వెంకన్న, ఆయనతో పాటు తోట శ్రీను, బద్ది అనిల్‌లు కలిసి బైక్‌పై వెళ్లారు. ముత్యాలమ్మ గుడి వద్ద దాదాపు నాలుగు గంటల సమయంలో బైక్‌ను అక్కడ పెట్టి సోంమల్లు దగ్గరకు వెళ్లి ఘర్షణ పడ్డారు. అనంతరం సోంమల్లును కింద పడవేసి గాడ్దుల వెంకన్న బండరాయితో తలమీద బలంగా ఎత్తివేయడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలిపారు. నిందితులు వెంకన్న, శ్రీను, అనిల్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. సమావేశంలో ఎస్సై యాదేందర్, ట్రైనీ ఎస్సై ప్రవీణ్ కుమార్, పోలీస్ సిబ్బంది ఇబ్రహీం, తానీష, జానకీ రాములు, శ్రీనివాస్ పాల్గొన్నారు.