
‘ఐసిస్ త్రయం’ అరెస్టు
సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాద సంస్థ ఐసిస్‌లో చేరేందుకు వెళ్తూ నాగ్‌పూర్ విమానాశ్రయంలో శనివారం చిక్కిన ముగ్గురు హైదరాబాదీలు అబ్దుల్లా బాసిత్, సయ్యద్ ఒమర్ ఫారూఖ్ హుస్సేనీ, మాజ్ హసన్ ఫారూఖ్‌లను ఆదివా రం అరెస్టు చేసినట్లు సీసీఎస్ సంయుక్త పోలీసు కమిషనర్ ప్రభాకర్‌రావు సోమవారం ప్రకటించారు. వీరిపై ఐపీసీ, ఐటీ యాక్ట్‌తో పాటు అన్ లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్(యూఎల్‌ఏపీఏ) కింద కేసు నమోదు చేశారు. సోదరుల వరుసయ్యే ఈ ముగ్గురూ నిషిద్ధ సిమీ జాతీయ మాజీ అధ్యక్షుడు సలావుద్దీన్ సమీప బంధువులు. నాగ్‌పూర్ మీదుగా శ్రీనగర్ వెళ్లి దుక్త్రాన్-ఎ-మిల్లత్ సంస్థ నిర్వాహకురాలు ఆసియాన్ అంద్రబీని కలవాలని వీరు నిర్ణయించుకున్నారు. ప్రయాణ ఖర్చుల కోసం బాసిత్ తన ఇంట్లో రూ.90 వేలు చోరీ చేసి తీసుకువెళ్లాడు.
సలావుద్దీన్ పేరు వినియోగించుకుని అంద్రబీ సాయం పొందాలని ముగ్గురు భావించారు. ఆమె సహకరించని పక్షంలో పాకిస్థాన్‌కు చేరుకుని ఐఎస్‌ఐ సహకారంతో లేదా అఫ్ఘనిస్తాన్ వెళ్లి అల్‌ఖైదాలో చేరడం ద్వారా ‘జిహాద్’ చేయాలని ఈ త్రయం కుట్ర పన్నిం ది. ఏదో ఒక రకంగా ఇరాక్, సిరియా, పాలస్తీనాలకూ వెళ్లి ఐసిస్ తరఫున పోరాడాలన్నది వీరి అంతిమ లక్ష్యంగా పోలీసులు గుర్తించారు. ఈ విధంగా రాడికలైజ్ కావడానికి ఇంటర్‌నెట్‌ను వినియోగించుకోవడంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌తో పాటు కుట్ర, యూఎల్‌ఏపీఏ చట్టం కింద వీరిపై కేసు నమోదు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు చేస్తుందని అధికారులు వెల్లడించారు. ఈ ముగ్గురినీ తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ సిట్ అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయనున్నారు. కాగా వీరి వైఖరిలో స్పష్టత లేదని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ‘ఓపక్క ఐసిస్ సంస్థ ఇస్లాం చట్టానికి (షరియత్)కు వ్యతిరేకంగా పని చేస్తోందని వారే చెప్తున్నారు. దాని పనితీరులో ఎన్నో లోపాలున్నాయనీ అంటున్నారు. మరోపక్క ఐసిస్‌లో చేరి యుద్ధం చేయాలని భావిస్తున్నామనీ వాంగ్మూలం ఇస్తున్నారు’ అని ఆయన చెప్పారు. పోలీసు కస్టడీకి తీసుకుని విచారించిన తరవాత ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఈ ముగ్గురు నుంచి స్వాధీనం చేసుకున్న ట్యాబ్, ఫోన్లను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపాలని నిర్ణయించుకున్నారు.
నాగ్‌పూర్‌కు బైకులపై బయలుదేరారు...
శ్రీనగర్ లక్ష్యంగా బయలుదేరిన ‘ఐసిస్ త్రయం’ నగరం నుంచి బైకుల పైనే నేరుగా నాగ్‌పూర్ చేరుకోవాలని భావించారు. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలకు రెండు బైకులపై అబ్దుల్లా బాసిత్, సయ్యద్ ఒమర్ ఫారూఖ్ హుస్సేనీ, మాజ్ హసన్ ఫారూఖ్ హైదరాబాద్ నుంచి బయలుదేరారు. అదిలాబాద్ వరకు వెళ్లేసరికి ఈ ముగ్గురూ చలిని తట్టుకోలేక, క్యాబ్ బుక్ చేసుకుని శుక్రవారం మధ్యాహ్నానికి నాగ్‌పూర్ చేరుకున్నారు. అక్కడి గురుముఖ్ ట్రావెల్స్‌లో శ్రీనగర్ వెళ్లేందుకు విమాన టిక్కెట్లు కొన్నారు. శనివారం నాగ్‌పూర్ నుంచి బయలుదేరే ఇండిగో విమానంలో ప్రయాణించడానికి రూ.36 వేలకు మూడు టిక్కెట్లు ఖరీదు చేశారు.
శుక్రవారం నాగ్‌పూర్‌లోనే సంచరించిన ఈ త్రయం రూ.3 వేలు వెచ్చించి షాపింగ్ చేయడంతో పాటు ‘దిల్‌వాలే’, ‘స్టార్‌వార్స్’ సినిమాలూ చూశారు. ఇంటి నుంచి బయటకు వస్తూ బాసిత్ ఓ లేఖ రాసి పెట్టాడు. అందులో తనను క్షమించాలని, తాను జిహాద్ చెయ్యడానికి వెళ్లిపోతున్నానని, తిరిగి జన్నత్(స్వర్గం)లో కలుద్దామంటూ పేర్కొన్నాడు. ఈ లేఖను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురినీ నగర పోలీసులు సోమవారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు.
ఇదీ వారి చరిత్ర...
అబ్దుల్లా బాసిత్ (20)
చంద్రాయణగుట్టలోని నసీబ్‌నగర్‌కు చెం దిన ఇతడు డెక్కన్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ (సీఎస్‌ఈ) రెండో సంవత్సరం వరకు చదివాడు. గత ఏడాది సెప్టెంబర్‌లో కోల్‌కతాలో పట్టుబడటంతో యాజమాన్యం కళాశాల నుం చి పంపించేసింది. హిమాయత్‌నగర్‌లో ని ఓ సంస్థలో ఆరు నెలల పాటు ఇంటీరియల్ డిజైనింగ్ కోర్సులో చేరినా తల్లిదండ్రుల ఒత్తిడితో మానేశాడు. సిట్ పోలీసులు ఇతడి నుంచి డెల్‌ట్యాబ్, నాగ్‌పూర్ టు శ్రీనగర్ విమాన టిక్కెట్లు, రూ.20 వేల నగదు (చోరీ చేసిన రూ.90 వేలు లోనివే) స్వాధీనం చేసుకున్నారు. ఐసిస్‌లో చేరేందుకు వెళ్లిపోతున్నానంటూ రాసి ఇంట్లో ఉంచిన ఓ లేఖ సైతం పోలీసులకు చిక్కింది.
మాజ్ హసన్ (22)
హుమాయూన్‌నగర్‌లోని అజీజియా మసీదు సమీపంలో నివసించే ఇతడు ఓ కళాశాలలో ఇన్‌స్ట్రుమెంటల్ కోర్సులో బీఈ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అనేక బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి. ఇతడి నుంచి ఓ మొబైల్ ఫోన్, రూ.10,500 నగదు (చోరీ చేసిన రూ.90 వేలు లోనివే) స్వాధీనం చేసుకున్నారు.
ఒమర్ ఫారూఖ్ (22)
చంద్రాయణగుట్టలోని గుల్షన్ ఇక్బాల్ కాలనీకి చెందిన ఇతడు బర్కత్‌పురలోని ఓ కళాశాలలో బీఎస్సీ మైక్రోబయాలజీ పూర్తి చేశాడు. ఇతడికీ బ్యాక్‌లాగ్స్ చాలా ఉన్నాయి. పోలీసులు ఇతడి నుంచి ఐఫోన్, రూ.11,300 నగదు (చోరీ చేసిన రూ.90 వేలు లోనివే) స్వాధీనం చేసుకున్నారు.
కౌన్సెలింగ్ ప్రక్రియను కొనసాగిస్తాం: మహేందర్‌రెడ్డి
ఐసిస్ సహా ఇతర ఉగ్రవాద సంస్థల వైపు మొగ్గు చూపుతున్న యువతను గుర్తించి, వారికి కౌన్సెలింగ్ ఇచ్చే ప్రక్రియను కొనసాగిస్తామని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ కౌం టర్ ఇంటెలిజెన్స్ సహకారంతో ఇప్పటి వర కు హైదరాబాద్‌కు చెందిన 17 మంది రాడికలైజ్ అయిన వారిని గుర్తించామని, వీరికి స్పెషల్ బ్రాంచ్ ఆధీనంలోని డీ-రాడికలైజేషన్ కౌన్సెలింగ్ సెంటర్‌లో కౌన్సెలింగ్ ఇచ్చామని ఆయన తెలిపారు. సోమవారం జరిగిన వార్షిక విలేకరుల సమావేశంలో ‘ఐసిస్ త్రయం’లో ఇద్దరికి గతంలో కౌన్సెలింగ్ ఇవ్వడం, అయినా వారిప్పుడు మళ్లీ ఐసిస్‌లో చేరేందుకు ప్రయత్నించడాన్ని విలేకరులు ప్రస్తావించగా... పైవిధంగా స్పందించారు.
‘ఆ ముగ్గురి’పై కఠినంగా ఉండండి: కేంద్ర హోంశాఖ
న్యూఢిల్లీ: ఐసిస్‌లో చేరడానికి వెళుతూ నాగ్‌పూర్‌లో పట్టుబడిన మగ్గురు హైదరాబాదీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కఠిన వైఖరి అవలంభించాలని కేంద్ర హోం శాఖ ఆదేశించింది. గతంలోనూ ఉగ్రవాద సంస్థలో చేరడానికి వెళుతూ సెప్టెంబర్ 2014లోనూ వీరు చిక్కారు. అప్పుడు వీరిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు, అరెస్టు కూడా చేయలేదు. అయితే ప్రస్తుతం వీరిపై కఠిన నిర్ణయం తీసుకోవాలని.. లేదంటే ఇదే తప్పు మళ్లీ పునరావృతం అయ్యే అవకాశం ఉందని కేంద్రం.. రాష్ట్రానికి సూచించింది.