Isis organization
-
‘దేశద్రోహానికి’ నల్లగొండలో కుట్ర!
-
‘దేశద్రోహానికి’ నల్లగొండలో కుట్ర!
♦ అక్కడి ఫంక్షన్లోనే శ్రీనగర్ పారిపోవాలని స్కెచ్ ♦ ఆ మరుసటి రోజే ఉడాయించిన ‘ఐసిస్ త్రయం’ ♦ ఓ డాక్యుమెంటరీ ఎక్కువగా ప్రేరణ ఇచ్చింది: బాసిత్ ♦ మిగిలిన ఇరువురినీ ప్రేరేపించింది ఇతగాడే సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐసిస్)లో చేరేందుకు ఇళ్లు వదిలి వెళ్లిపోవాలనే పథకానికి ‘ఐసిస్ త్రయం’ నల్లగొండలో అంకురార్పణ చేసింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ విమానాశ్రయంలో చిక్కిన అబ్దుల్ బాసిత్, మాజ్ హసన్ ఫారూఖ్, ఫారూఖ్ హుస్సేనీలపై దేశద్రోహం, కుట్ర తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసిన విషయం విదితమే. బాసిత్, హసన్‌లు మొదటిసారి కోల్‌కతాలో పట్టుబడినప్పుడు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ చేసిన పోలీసులు కేసు లేకుండా అప్పగించారు. అయినప్పటికీ ఐసిస్‌లో చేరే బలమైన కోరిక ఉండటంతో బాసిత్ మిగిలిన ఇద్దరినీ తన దారిలోని వచ్చేలా ప్రేరేపించాడు. నల్లగొండ ఫంక్షన్లో నిర్ణయం... ఈ నెల 24న నల్లగొండలో జరిగిన ఓ ఫంక్షన్‌కు కుటుంబీకులతో ఈ ముగ్గురూ హాజరయ్యారు. అక్కడే శ్రీనగర్ వెళ్లిపోవాలని కుట్ర పన్నారు. నిందితుల నుంచి ట్యాబ్‌ను రికవరీ చేసిన పోలీసులు అందులో చాలా సమాచారం డెలిట్ అయినట్లు గుర్తించారు. బాసిత్ సైతం ఇదే విషయాన్ని వెల్లడించాడు. ఆ సమాచారాన్ని కూడా రిట్రీవ్ చేసి, పూర్తి స్థాయిలో విశ్లేషిస్తే వీరితో సంబంధాలు కొనసాగించిన, ప్రేరేపించిన వారికి సంబంధించిన పూర్తి సమాచారం లభిస్తుందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. దీనికోసం వాటిని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపాలని నిర్ణయించారు. మరోపక్క ఆదిలాబాద్‌లో వదిలి వెళ్లిన రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. ఇంటికి పంపి మళ్లీ పిలిపించారు... రాష్ట్ర పోలీసుల వెంట ఉన్న సిట్ పోలీసులు అదే రోజు రాత్రి 11.30 గంటలకు ముగ్గురినీ హైదరాబాద్‌కు తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. మరుసటి రోజు ఉదయం (27వ తేదీ) సిట్ కార్యాలయానికి పిలిపించి అరెస్టు చేశారు. ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాం డ్లో ఉన్న ఈ ముగ్గురు నిందితుల్ని 15 రోజుల కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ సిట్ అధికారులు మంగళవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నాగ్‌పూర్‌లో విమానాశ్రయంలో ఈ ముగ్గురినీ అదుపులోకి తీసుకున్న సమయంలో మహారాష్ట్ర ఏటీఎస్ అధికారులూ విచారించారు. ఈ నేపథ్యంలోనే ఐసిస్‌కు సంబంధించి ఆన్లైన్లో అనేక రకాలైన వీడియోలు, ఫొటోలు తమను ఆకర్షించాయని ఈ త్రయం వెల్లడించింది. అన్నింటినీ మించి యూ ట్యూబ్‌లో అందుబాటులో ఉన్న ‘...కశ్మీ రీ’ డాక్యుమెంటరీ తమపై తీవ్ర ప్రభావాన్ని చూపి, ప్రోద్బలాన్ని ఇచ్చిందని బయటపెట్టారు. జిహాదీలుగా మారి ప్రపంచ వ్యాప్తంగా ఇస్లాం రాజ్య స్థాపనకు కృషి చేయడమే తమ ఆలోచన అని, అందుకోసం ఐసిస్ ద్వారా పోరాడుతున్న ఆ సంస్థ అధినేత అబు బకర్ అల్ బాగ్దాదీని కలవాలన్నది అంతిమ లక్ష్యమని వీరు బయటపెట్టారని తెలిసింది. ఇలా చిక్కారు... నగరం నుంచి బయలుదేరి 25వ తేదీ ఉదయం 9 గంటలకు అదిలాబాద్ చేరుకున్న ఈ ముగ్గురూ అక్కడ రూ.3,500 బాడుగకు ఓ ట్యాక్సీ మాట్లాడుకున్నారు. అదేరోజు మధ్యాహ్నానికి నాగ్‌పూర్ చేరుకున్నారు. ఎక్కడా బస చేయకుండా తిరుగుతూ గడిపి తెల్లవారుజాము 3 గంటలకు నాగ్‌పూర్ విమానాశ్రయానికి చేరుకుని... విమాన సమయం వరకు విశ్రాంతి తీసుకోవడానికి లోపలకు అనుమతించమంటూ సెక్యూరిటీ సిబ్బందిని కోరుతున్న సందర్భంలోనే ఏటీఎస్, రాష్ట్ర పోలీసు సంయుక్త బృందానికి చిక్కారు. -
‘ఐసిస్ త్రయం’ అరెస్టు
సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాద సంస్థ ఐసిస్‌లో చేరేందుకు వెళ్తూ నాగ్‌పూర్ విమానాశ్రయంలో శనివారం చిక్కిన ముగ్గురు హైదరాబాదీలు అబ్దుల్లా బాసిత్, సయ్యద్ ఒమర్ ఫారూఖ్ హుస్సేనీ, మాజ్ హసన్ ఫారూఖ్‌లను ఆదివా రం అరెస్టు చేసినట్లు సీసీఎస్ సంయుక్త పోలీసు కమిషనర్ ప్రభాకర్‌రావు సోమవారం ప్రకటించారు. వీరిపై ఐపీసీ, ఐటీ యాక్ట్‌తో పాటు అన్ లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్(యూఎల్ఏపీఏ) కింద కేసు నమోదు చేశారు. సోదరుల వరుసయ్యే ఈ ముగ్గురూ నిషిద్ధ సిమీ జాతీయ మాజీ అధ్యక్షుడు సలావుద్దీన్ సమీప బంధువులు. నాగ్‌పూర్ మీదుగా శ్రీనగర్ వెళ్లి దుక్త్రాన్-ఎ-మిల్లత్ సంస్థ నిర్వాహకురాలు ఆసియాన్ అంద్రబీని కలవాలని వీరు నిర్ణయించుకున్నారు. ప్రయాణ ఖర్చుల కోసం బాసిత్ తన ఇంట్లో రూ.90 వేలు చోరీ చేసి తీసుకువెళ్లాడు. సలావుద్దీన్ పేరు వినియోగించుకుని అంద్రబీ సాయం పొందాలని ముగ్గురు భావించారు. ఆమె సహకరించని పక్షంలో పాకిస్థాన్‌కు చేరుకుని ఐఎస్ఐ సహకారంతో లేదా అఫ్ఘనిస్తాన్ వెళ్లి అల్‌ఖైదాలో చేరడం ద్వారా ‘జిహాద్’ చేయాలని ఈ త్రయం కుట్ర పన్నిం ది. ఏదో ఒక రకంగా ఇరాక్, సిరియా, పాలస్తీనాలకూ వెళ్లి ఐసిస్ తరఫున పోరాడాలన్నది వీరి అంతిమ లక్ష్యంగా పోలీసులు గుర్తించారు. ఈ విధంగా రాడికలైజ్ కావడానికి ఇంటర్నెట్ను వినియోగించుకోవడంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌తో పాటు కుట్ర, యూఎల్ఏపీఏ చట్టం కింద వీరిపై కేసు నమోదు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు చేస్తుందని అధికారులు వెల్లడించారు. ఈ ముగ్గురినీ తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ సిట్ అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయనున్నారు. కాగా వీరి వైఖరిలో స్పష్టత లేదని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ‘ఓపక్క ఐసిస్ సంస్థ ఇస్లాం చట్టానికి (షరియత్)కు వ్యతిరేకంగా పని చేస్తోందని వారే చెప్తున్నారు. దాని పనితీరులో ఎన్నో లోపాలున్నాయనీ అంటున్నారు. మరోపక్క ఐసిస్‌లో చేరి యుద్ధం చేయాలని భావిస్తున్నామనీ వాంగ్మూలం ఇస్తున్నారు’ అని ఆయన చెప్పారు. పోలీసు కస్టడీకి తీసుకుని విచారించిన తరవాత ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఈ ముగ్గురు నుంచి స్వాధీనం చేసుకున్న ట్యాబ్, ఫోన్లను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపాలని నిర్ణయించుకున్నారు. నాగ్‌పూర్‌కు బైకులపై బయలుదేరారు... శ్రీనగర్ లక్ష్యంగా బయలుదేరిన ‘ఐసిస్ త్రయం’ నగరం నుంచి బైకుల పైనే నేరుగా నాగ్‌పూర్ చేరుకోవాలని భావించారు. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలకు రెండు బైకులపై అబ్దుల్లా బాసిత్, సయ్యద్ ఒమర్ ఫారూఖ్ హుస్సేనీ, మాజ్ హసన్ ఫారూఖ్ హైదరాబాద్ నుంచి బయలుదేరారు. అదిలాబాద్ వరకు వెళ్లేసరికి ఈ ముగ్గురూ చలిని తట్టుకోలేక, క్యాబ్ బుక్ చేసుకుని శుక్రవారం మధ్యాహ్నానికి నాగ్‌పూర్ చేరుకున్నారు. అక్కడి గురుముఖ్ ట్రావెల్స్‌లో శ్రీనగర్ వెళ్లేందుకు విమాన టిక్కెట్లు కొన్నారు. శనివారం నాగ్‌పూర్ నుంచి బయలుదేరే ఇండిగో విమానంలో ప్రయాణించడానికి రూ.36 వేలకు మూడు టిక్కెట్లు ఖరీదు చేశారు. శుక్రవారం నాగ్‌పూర్‌లోనే సంచరించిన ఈ త్రయం రూ.3 వేలు వెచ్చించి షాపింగ్ చేయడంతో పాటు ‘దిల్వాలే’, ‘స్టార్‌వార్స్’ సినిమాలూ చూశారు. ఇంటి నుంచి బయటకు వస్తూ బాసిత్ ఓ లేఖ రాసి పెట్టాడు. అందులో తనను క్షమించాలని, తాను జిహాద్ చెయ్యడానికి వెళ్లిపోతున్నానని, తిరిగి జన్నత్(స్వర్గం)లో కలుద్దామంటూ పేర్కొన్నాడు. ఈ లేఖను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురినీ నగర పోలీసులు సోమవారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇదీ వారి చరిత్ర... అబ్దుల్లా బాసిత్ (20) చంద్రాయణగుట్టలోని నసీబ్నగర్కు చెం దిన ఇతడు డెక్కన్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ (సీఎస్ఈ) రెండో సంవత్సరం వరకు చదివాడు. గత ఏడాది సెప్టెంబర్‌లో కోల్‌కతాలో పట్టుబడటంతో యాజమాన్యం కళాశాల నుం చి పంపించేసింది. హిమాయత్‌నగర్‌లో ని ఓ సంస్థలో ఆరు నెలల పాటు ఇంటీరియల్ డిజైనింగ్ కోర్సులో చేరినా తల్లిదండ్రుల ఒత్తిడితో మానేశాడు. సిట్ పోలీసులు ఇతడి నుంచి డెల్ట్యాబ్, నాగ్‌పూర్ టు శ్రీనగర్ విమాన టిక్కెట్లు, రూ.20 వేల నగదు (చోరీ చేసిన రూ.90 వేలు లోనివే) స్వాధీనం చేసుకున్నారు. ఐసిస్‌లో చేరేందుకు వెళ్లిపోతున్నానంటూ రాసి ఇంట్లో ఉంచిన ఓ లేఖ సైతం పోలీసులకు చిక్కింది. మాజ్ హసన్ (22) హుమాయూన్‌నగర్‌లోని అజీజియా మసీదు సమీపంలో నివసించే ఇతడు ఓ కళాశాలలో ఇన్స్ట్రుమెంటల్ కోర్సులో బీఈ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అనేక బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి. ఇతడి నుంచి ఓ మొబైల్ ఫోన్, రూ.10,500 నగదు (చోరీ చేసిన రూ.90 వేలు లోనివే) స్వాధీనం చేసుకున్నారు. ఒమర్ ఫారూఖ్ (22) చంద్రాయణగుట్టలోని గుల్షన్ ఇక్బాల్ కాలనీకి చెందిన ఇతడు బర్కత్‌పురలోని ఓ కళాశాలలో బీఎస్సీ మైక్రోబయాలజీ పూర్తి చేశాడు. ఇతడికీ బ్యాక్‌లాగ్స్ చాలా ఉన్నాయి. పోలీసులు ఇతడి నుంచి ఐఫోన్, రూ.11,300 నగదు (చోరీ చేసిన రూ.90 వేలు లోనివే) స్వాధీనం చేసుకున్నారు. కౌన్సెలింగ్ ప్రక్రియను కొనసాగిస్తాం: మహేందర్‌రెడ్డి ఐసిస్ సహా ఇతర ఉగ్రవాద సంస్థల వైపు మొగ్గు చూపుతున్న యువతను గుర్తించి, వారికి కౌన్సెలింగ్ ఇచ్చే ప్రక్రియను కొనసాగిస్తామని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ కౌం టర్ ఇంటెలిజెన్స్ సహకారంతో ఇప్పటి వర కు హైదరాబాద్‌కు చెందిన 17 మంది రాడికలైజ్ అయిన వారిని గుర్తించామని, వీరికి స్పెషల్ బ్రాంచ్ ఆధీనంలోని డీ-రాడికలైజేషన్ కౌన్సెలింగ్ సెంటర్లో కౌన్సెలింగ్ ఇచ్చామని ఆయన తెలిపారు. సోమవారం జరిగిన వార్షిక విలేకరుల సమావేశంలో ‘ఐసిస్ త్రయం’లో ఇద్దరికి గతంలో కౌన్సెలింగ్ ఇవ్వడం, అయినా వారిప్పుడు మళ్లీ ఐసిస్‌లో చేరేందుకు ప్రయత్నించడాన్ని విలేకరులు ప్రస్తావించగా... పైవిధంగా స్పందించారు. ‘ఆ ముగ్గురి’పై కఠినంగా ఉండండి: కేంద్ర హోంశాఖ న్యూఢిల్లీ: ఐసిస్‌లో చేరడానికి వెళుతూ నాగ్‌పూర్‌లో పట్టుబడిన మగ్గురు హైదరాబాదీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కఠిన వైఖరి అవలంభించాలని కేంద్ర హోం శాఖ ఆదేశించింది. గతంలోనూ ఉగ్రవాద సంస్థలో చేరడానికి వెళుతూ సెప్టెంబర్ 2014లోనూ వీరు చిక్కారు. అప్పుడు వీరిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు, అరెస్టు కూడా చేయలేదు. అయితే ప్రస్తుతం వీరిపై కఠిన నిర్ణయం తీసుకోవాలని.. లేదంటే ఇదే తప్పు మళ్లీ పునరావృతం అయ్యే అవకాశం ఉందని కేంద్రం.. రాష్ట్రానికి సూచించింది. -
ఐసిస్‌ను నాశనం చేసి తీరుతాం
-
సిరియాలో ఏపీ వాసి మృతి
- ఐఎస్ఐఎస్ లో చేరినట్లు నిఘా వర్గాల వెల్లడి - రేపల్లెకు చెందిన తుల్ఫిజుర్ రెహ్మాన్ మరణంపై అనేక అనుమానాలు సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు తెలంగాణకే పరిమితమైన అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ (ఐసిస్) ఛాయలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కూ విస్తరించాయా..? కువైట్‌లో ఉద్యోగం చేస్తున్న మచిలీపట్నం వాసి ఐసిస్‌లో చేరి సిరియాలో జరిగిన దాడుల్లో మరణించినట్లు వెలుగులోకి రావడంతో కేంద్ర, రాష్ట్రాల నిఘా వర్గాలు ఇదే కోణంలో దర్యాప్తు చేస్తున్నాయి. అతడు ఆన్లైన్ ద్వారా ఐసిస్‌కు ఆకర్షితుడైనట్లు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ప్రాథమిక ఆధారాలు సేకరించాయి. ఇతడి సంబంధీకులు హైదరాబాద్‌లో ఉంటున్న నేపథ్యంలో పూర్తి వివరాలు సేకరించడానికి కేంద్ర నిఘా వర్గాలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నిఘా వర్గాలు రంగంలోకి దిగాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం... గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన తుల్ఫిజుర్ రెహ్మాన్ మచిలీపట్నంలో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. కొన్నేళ్ళ కిందట ఉద్యోగ నిమిత్తం కువైట్ వెళ్ళగా... ఇతడి కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. దాదాపు ఏడాది కాలంగా అతనికి కుటుంబంతో సంబంధాలు తెగిపోయినట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా ఐసిస్ కార్యకలాపాలు విస్తరిస్తుండటంతో కేంద్ర నిఘా వర్గాలు నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్టీఆర్వో) సహకారంతో ఆన్‌లైన్‌పై నిఘా ఉంచుతోంది. భారత్‌లో ఉంటున్న ప్రవాస భారతీయుల్లో అనుమానాస్పదమైన వారి ఆన్లైన్, సోషల్ మీడియా కార్యకలాపాలపై నిఘా ఉంచుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొన్నాళ్ళ క్రితం కువైట్‌లో ఉంటున్న రెహ్మాన్ ఆన్లైన్లో ఐసిస్‌కు సంబంధించిన వెబ్సైట్లు వీక్షిస్తున్నట్లు, ఫేస్బుక్ ద్వారానూ సంప్రదింపులు జరుపుతున్నట్లు గుర్తించాయి. కొన్నాళ్ళ కిందట కువైట్‌లో ఉద్యోగం మానేసి సిరియా వెళ్ళిపోయిన రెహ్మాన్ ఐసిస్‌లో చేరినట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించాయి. ఈ కోణంలో ఆరా తీస్తుండగానే సిరియాలో జరిగిన దాడుల్లో రెహ్మాన్ చనిపోయినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో ఏపీ, తెలంగాణ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను అప్రమత్తం చేశాయి. రెహ్మాన్ వ్యవహారంపై లోతుగా ఆరా తీస్తున్న వర్గాలు ఈ ఉదంతం నేపథ్యంలో మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ, ఏలూరుల్లో ఐసిస్ కార్యకలాపాలపై డేగకన్ను వేశాయి. ‘రెహ్మాన్ ఉదంతం నిరుడే జరిగినట్లు తెలుస్తోంది. గుర్తించడంలో మాత్రం ఆలస్యమైంది’ అని నిఘా విభాగ అధికారి ‘సాక్షి’తో చెప్పారు. ఇప్పటికే తెలంగాణలో ఆదిలాబాద్‌కు చెందిన ఆతిఫ్ ఐసిస్‌లో చేరి సిరియాలో చనిపోయిన విషయం తెలిసిందే. -
ఐసిస్‌ను నాశనం చేసి తీరుతాం
- అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రతిన - ప్రజల మనసులను ఉగ్రవాదులు కలుషితం చేస్తున్నారని మండిపాటు వాషింగ్టన్: ఐఎస్ఐఎస్(ఐసిస్) ఉగ్రవాద సంస్థను నాశనం చేసి తీరుతామని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించారు. అమెరికాలోను, ప్రపంచవ్యాప్తంగా ప్రజల మనస్సులను కలుషితం చేస్తున్న కొత్త దశ ఉగ్రవాదాన్ని దీటుగా ఎదుర్కొంటామన్నారు. అయితే సిరియా, ఇరాక్‌లకు భారీగా బలగాలను పంపి దాడులు చేస్తామన్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. సోమవారం వైట్‌హౌస్ నుంచి ఆ దేశ ప్రజలను ఉద్దేశించి ఒబామా ప్రసంగించారు. కాలిఫోర్నియా దుర్ఘటన నేపథ్యంలో భయవిహ్వలులైన అమెరికన్లకు ధైర్యం చెప్పారు. ఉగ్రవాద భూతాన్ని తరిమికొడతామని వ్యాఖ్యానించారు. ‘ఐసిస్ అయినా మరే ఉగ్రవాద సంస్థ అయినా మనకు ప్రమాదం కలిగించే వాటిని నాశనం చేస్తాం. బెదిరించడంపైనో, విలువలను వదిలేయడంపైనో, భయపెట్టడంపైనో మన విజయం ఆధారపడదు. మనం దృఢంగా, తెలివిగా, నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలి..’ అని పేర్కొన్నారు. ఆయన చెప్పిన మరిన్ని ముఖ్యమైన అంశాలు.. ► ఇరాక్, సిరియాల్లో చేసినట్లుగా సుదీర్ఘంగా సాగే, ఎంతో వ్యయభరితమైన భూతల దాడుల వంటివి మరోసారి అనవసరం. మనను ఓడించలేమని తెలిసినా.. ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థలు అలా జరగాలని కోరుకుంటాయి. ఎందుకంటే మనం విదేశీ ప్రాంతాలను ఆక్రమిస్తే.. వారు ఏళ్ల తరబడి తిరుగుబాట్లు చేసేందుకు, మన వేలాది మంది సైనికులను చంపేందుకు, మన వనరులు ఖర్చయ్యేందుకు అవకాశముంటుందని వారికి తెలుసు. మనను బూచిగా చూపి, రిక్రూట్మెంట్లు చేసుకుంటారు. అందువల్లే వ్యూహాత్మకంగా స్థానిక బలగాల సాయంతో వైమానిక దాడులు చేస్తున్నాం. ఉగ్రవాదులను నిర్మూలించడం కోసం అవసరమైతే ఏ దేశంలోనైనా అమెరికా మిలటరీ దాడులు చేస్తుంది. ► గత కొన్నేళ్లుగా ఉగ్రవాదం నూతన దశలోకి ప్రవేశించింది. ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థలు బలంగా ఎదిగాయి. దేశాల మధ్య సరిహద్దులను ఇంటర్నెట్ చెరిపేసింది. ప్రజల మనసులో ఐసిస్ వంటి సంస్థలు విషం నింపుతున్నాయి. అలాంటి తీవ్రవాద ప్రభావిత (రాడికలైజ్డ్) జంట కాలిఫోర్నియాలో 14 మందిని బలితీసుకుంది. ► పారిస్‌లో ఉగ్రదాడులతో ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ తదితర మన మిత్రదేశాలు ఉగ్రవాదంపై పోరును ఉధృతం చేశాయి.ఐసిస్‌పై పోరాడుతున్న ఇరాక్, సిరియా బలగాలకు శిక్షణ, ఆయుధాల సహకారం కొనసాగిస్తాం. దీనికితోడు ఐసిస్‌కు ఆర్థిక, ఇతర సహాయమేదీ అందకుండా చేస్తాం. ► ఐసిస్‌తో అమెరికా యుద్ధం చేస్తోందని రిపబ్లికన్ల మెజారిటీ ఉన్న కాంగ్రెస్ (ప్రతినిధుల సభ) నమ్మితే... ఆ ఉగ్రవాదులపై మిలటరీ దాడులు కొనసాగించేందుకు అనుమతించేలా ఓటు చేయాలి. తద్వారా అమెరికన్లంతా ఒక్కటిగా ఉన్నారని చాటాలి. ► ఐసిస్ సంస్థ ఇస్లాం కోసమేమీ మాట్లాడదు. వారు దొంగలు, హంతకులు. ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది ముస్లింలు, దేశభక్తులైన అమెరికన్ ముస్లింలలో వారు ఒక అణువంత మాత్రమే. అయితే కొన్ని వర్గాల ముస్లింలలో తీవ్రవాద భావజాలం వ్యాపించిందన్న వాస్తవాన్ని నేను కాదనడం లేదు. ఇలాంటి ఉగ్రవాద సంస్థలు, వాటి సిద్ధాంతాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం నేతలు ఖండించాలి. కేవలం ముస్లిం అనే పేరిట ఎవరిపైనైనా వివక్ష చూపొద్దు. వారితో వేరుగా ప్రవర్తించవద్దు. ► కాగా తీవ్రవాద ఇస్లాం అతిపెద్ద ముప్పుగా పరిగణించిందని ఒబామా తన ప్రసంగంలో పేర్కొని ఉండాల్సిందని రిపబ్లికన్ పార్టీ నేతలు విమర్శించారు. ప్రసంగాన్ని ఆఫ్రికా ముస్లిం కమ్యూనిటీ స్వాగతించింది. ఇస్లాం వ్యతిరేక భావాలను ఆయన తప్పుబట్టడంపై హర్షం వ్యక్తం చేసింది. ముస్లింలందరినీ అనుమానించే ధోరణిని తప్పుబట్టి, జాతీయ ఐక్యతను ఒబామా నొక్కి చెప్పారని కౌన్సిల్ ఆన్ అమెరికన్ ఇస్లామిక్ రిలేషన్స్ పేర్కొంది.