సిరియాలో ఏపీ వాసి మృతి | AP person killed in Syria | Sakshi
Sakshi News home page

సిరియాలో ఏపీ వాసి మృతి

Published Tue, Dec 8 2015 5:35 AM | Last Updated on Wed, Aug 15 2018 7:18 PM

సిరియాలో ఏపీ వాసి మృతి - Sakshi

సిరియాలో ఏపీ వాసి మృతి

- ఐఎస్ఐఎస్ లో చేరినట్లు నిఘా వర్గాల వెల్లడి

- రేపల్లెకు చెందిన తుల్ఫిజుర్ రెహ్మాన్ మరణంపై అనేక అనుమానాలు

సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు తెలంగాణకే పరిమితమైన అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ (ఐసిస్) ఛాయలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కూ విస్తరించాయా..? కువైట్‌లో ఉద్యోగం చేస్తున్న మచిలీపట్నం వాసి ఐసిస్‌లో చేరి సిరియాలో జరిగిన దాడుల్లో మరణించినట్లు వెలుగులోకి రావడంతో కేంద్ర, రాష్ట్రాల నిఘా వర్గాలు ఇదే కోణంలో దర్యాప్తు చేస్తున్నాయి. అతడు ఆన్‌లైన్ ద్వారా ఐసిస్‌కు ఆకర్షితుడైనట్లు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ప్రాథమిక ఆధారాలు సేకరించాయి. ఇతడి సంబంధీకులు హైదరాబాద్‌లో ఉంటున్న నేపథ్యంలో పూర్తి వివరాలు సేకరించడానికి కేంద్ర నిఘా వర్గాలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నిఘా వర్గాలు రంగంలోకి దిగాయి.

విశ్వసనీయ సమాచారం ప్రకారం... గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన తుల్ఫిజుర్ రెహ్మాన్ మచిలీపట్నంలో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. కొన్నేళ్ళ కిందట ఉద్యోగ నిమిత్తం కువైట్ వెళ్ళగా... ఇతడి కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. దాదాపు ఏడాది కాలంగా అతనికి కుటుంబంతో సంబంధాలు తెగిపోయినట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా ఐసిస్ కార్యకలాపాలు విస్తరిస్తుండటంతో కేంద్ర నిఘా వర్గాలు నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్టీఆర్వో) సహకారంతో ఆన్‌లైన్‌పై నిఘా ఉంచుతోంది. భారత్‌లో ఉంటున్న ప్రవాస భారతీయుల్లో అనుమానాస్పదమైన వారి ఆన్‌లైన్, సోషల్ మీడియా కార్యకలాపాలపై నిఘా ఉంచుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే కొన్నాళ్ళ క్రితం కువైట్‌లో ఉంటున్న రెహ్మాన్ ఆన్‌లైన్‌లో ఐసిస్‌కు సంబంధించిన వెబ్‌సైట్లు వీక్షిస్తున్నట్లు, ఫేస్‌బుక్ ద్వారానూ సంప్రదింపులు జరుపుతున్నట్లు గుర్తించాయి. కొన్నాళ్ళ కిందట కువైట్‌లో ఉద్యోగం మానేసి సిరియా వెళ్ళిపోయిన రెహ్మాన్ ఐసిస్‌లో చేరినట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించాయి. ఈ కోణంలో ఆరా తీస్తుండగానే సిరియాలో జరిగిన దాడుల్లో రెహ్మాన్ చనిపోయినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో ఏపీ, తెలంగాణ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను అప్రమత్తం చేశాయి. రెహ్మాన్ వ్యవహారంపై లోతుగా ఆరా తీస్తున్న వర్గాలు ఈ ఉదంతం నేపథ్యంలో మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ, ఏలూరుల్లో ఐసిస్ కార్యకలాపాలపై డేగకన్ను వేశాయి. ‘రెహ్మాన్ ఉదంతం నిరుడే జరిగినట్లు తెలుస్తోంది. గుర్తించడంలో మాత్రం ఆలస్యమైంది’ అని నిఘా విభాగ అధికారి ‘సాక్షి’తో చెప్పారు. ఇప్పటికే తెలంగాణలో ఆదిలాబాద్‌కు చెందిన ఆతిఫ్ ఐసిస్‌లో చేరి సిరియాలో చనిపోయిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement