
‘దేశద్రోహానికి’ నల్లగొండలో కుట్ర!
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐసిస్)లో చేరేందుకు ఇళ్లు వదిలి వెళ్లిపోవాలనే పథకానికి ‘ఐసిస్ త్రయం’ నల్లగొండలో అంకురార్పణ చేసింది.
♦ అక్కడి ఫంక్షన్‌లోనే శ్రీనగర్ పారిపోవాలని స్కెచ్
♦ ఆ మరుసటి రోజే ఉడాయించిన ‘ఐసిస్ త్రయం’
♦ ఓ డాక్యుమెంటరీ ఎక్కువగా ప్రేరణ ఇచ్చింది: బాసిత్
♦ మిగిలిన ఇరువురినీ ప్రేరేపించింది ఇతగాడే
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐసిస్)లో చేరేందుకు ఇళ్లు వదిలి వెళ్లిపోవాలనే పథకానికి ‘ఐసిస్ త్రయం’ నల్లగొండలో అంకురార్పణ చేసింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ విమానాశ్రయంలో చిక్కిన అబ్దుల్ బాసిత్, మాజ్ హసన్ ఫారూఖ్, ఫారూఖ్ హుస్సేనీలపై దేశద్రోహం, కుట్ర తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసిన విషయం విదితమే. బాసిత్, హసన్‌లు మొదటిసారి కోల్‌కతాలో పట్టుబడినప్పుడు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ చేసిన పోలీసులు కేసు లేకుండా అప్పగించారు. అయినప్పటికీ ఐసిస్‌లో చేరే బలమైన కోరిక ఉండటంతో బాసిత్ మిగిలిన ఇద్దరినీ తన దారిలోని వచ్చేలా ప్రేరేపించాడు.
నల్లగొండ ఫంక్షన్‌లో నిర్ణయం...
ఈ నెల 24న నల్లగొండలో జరిగిన ఓ ఫంక్షన్‌కు కుటుంబీకులతో ఈ ముగ్గురూ హాజరయ్యారు. అక్కడే శ్రీనగర్ వెళ్లిపోవాలని కుట్ర పన్నారు. నిందితుల నుంచి ట్యాబ్‌ను రికవరీ చేసిన పోలీసులు అందులో చాలా సమాచారం డెలిట్ అయినట్లు గుర్తించారు. బాసిత్ సైతం ఇదే విషయాన్ని వెల్లడించాడు. ఆ సమాచారాన్ని కూడా రిట్రీవ్ చేసి, పూర్తి స్థాయిలో విశ్లేషిస్తే వీరితో సంబంధాలు కొనసాగించిన, ప్రేరేపించిన వారికి సంబంధించిన పూర్తి సమాచారం లభిస్తుందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. దీనికోసం వాటిని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపాలని నిర్ణయించారు. మరోపక్క ఆదిలాబాద్‌లో వదిలి వెళ్లిన రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోవాలని పోలీసులు నిర్ణయించారు.
ఇంటికి పంపి మళ్లీ పిలిపించారు...
రాష్ట్ర పోలీసుల వెంట ఉన్న సిట్ పోలీసులు అదే రోజు రాత్రి 11.30 గంటలకు ముగ్గురినీ హైదరాబాద్‌కు తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. మరుసటి రోజు ఉదయం (27వ తేదీ) సిట్ కార్యాలయానికి పిలిపించి అరెస్టు చేశారు. ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాం డ్‌లో ఉన్న ఈ ముగ్గురు నిందితుల్ని 15 రోజుల కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ సిట్ అధికారులు మంగళవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నాగ్‌పూర్‌లో విమానాశ్రయంలో ఈ ముగ్గురినీ అదుపులోకి తీసుకున్న సమయంలో మహారాష్ట్ర ఏటీఎస్ అధికారులూ విచారించారు. ఈ నేపథ్యంలోనే ఐసిస్‌కు సంబంధించి ఆన్‌లైన్‌లో అనేక రకాలైన వీడియోలు, ఫొటోలు తమను ఆకర్షించాయని ఈ త్రయం వెల్లడించింది. అన్నింటినీ మించి యూ ట్యూబ్‌లో అందుబాటులో ఉన్న ‘...కశ్మీ రీ’ డాక్యుమెంటరీ తమపై తీవ్ర ప్రభావాన్ని చూపి, ప్రోద్బలాన్ని ఇచ్చిందని బయటపెట్టారు. జిహాదీలుగా మారి ప్రపంచ వ్యాప్తంగా ఇస్లాం రాజ్య స్థాపనకు కృషి చేయడమే తమ ఆలోచన అని, అందుకోసం ఐసిస్ ద్వారా పోరాడుతున్న ఆ సంస్థ అధినేత అబు బకర్ అల్ బాగ్దాదీని కలవాలన్నది అంతిమ లక్ష్యమని వీరు బయటపెట్టారని తెలిసింది.
ఇలా చిక్కారు...
నగరం నుంచి బయలుదేరి 25వ తేదీ ఉదయం 9 గంటలకు అదిలాబాద్ చేరుకున్న ఈ ముగ్గురూ అక్కడ రూ.3,500 బాడుగకు ఓ ట్యాక్సీ మాట్లాడుకున్నారు. అదేరోజు మధ్యాహ్నానికి నాగ్‌పూర్ చేరుకున్నారు. ఎక్కడా బస చేయకుండా తిరుగుతూ గడిపి తెల్లవారుజాము 3 గంటలకు నాగ్‌పూర్ విమానాశ్రయానికి చేరుకుని... విమాన సమయం వరకు విశ్రాంతి తీసుకోవడానికి లోపలకు అనుమతించమంటూ సెక్యూరిటీ సిబ్బందిని కోరుతున్న సందర్భంలోనే ఏటీఎస్, రాష్ట్ర పోలీసు సంయుక్త బృందానికి చిక్కారు.