సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంపై కేంద్ర హోంశాఖ నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో బుధవారం సాయంత్రం ఢిల్లీలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఎస్‌కే జోషి, ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా సమస్యలపై అధికారులు రెండున్నర గంటలపాటు సుధీర్ఘంగా చర్చించారు. షెడ్యూల్ 9,10లలోని సంస్థల విభజనపై ప్రధానంగా చర్చ జరిగింది.
అలాగే సింగరేణి కాలరీస్, ఆర్టీసీ, సివిల్ సప్లై కార్పొరేషన్ బకాయిలు, పలు కార్పొరేషన్ల విభజన అంశాలపై అధికారులు చర్చించారు. అయితే ఈ సమావేశంలో ఏపీ భవన్ విభజనపై చర్చ జరగలేదు. ప్రస్తుతం ఏపీ భవన్‌ను రెండు రాష్ట్రాలు వినియోగించుకుంటున్నాయని అధికారులు హోంశాఖకు తెలిపారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాలు లెవనెత్తిన అంశాలపై కేంద్ర హోంశాఖ వివరణ కోరింది. అయితే ఈ సమావేశం ఫలప్రదంగా సాగిందని ఇరు రాష్ట్రాల సీఎస్‌లు తెలిపారు. సమావేశం ముగిసిన తర్వాత నార్త్ బ్లాక్ వద్ద ఇరు రాష్ట్రాల సీఎస్‌లు నార్త్ బ్లాక్ వద్ద కరచాలనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment