కృష్ణా జలాలపై ఏకాభిప్రాయం కరువు
పాజెక్టులను బోర్డు పరిధిలో తేవొద్దన్న తెలంగాణ... తేవాల్సిందేనన్న ఆంధ్రప్రదేశ్
పోలవరం ద్వారా మళ్లించే నీటిలో 45 టీఎంసీలు ఇవ్వాలన్న తెలంగాణ
సయోధ్య కుదర్చలేక చేతులెత్తేసిన కేంద్ర జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి
ఇరు రాష్ట్రాలు చర్చించుకుని ఏకాభిప్రాయానికి రావాలన్న మంత్రి ఉమాభారతి
నెల రోజుల వరకూ పాత విధానాన్నే అమలు చేయాలని కేఆర్‌ఎంబీ నిర్ణయం!
బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఇప్పటి వరకూ నోటిఫై కాలేదు. కోర్టు విచారణలో ఉంది. నీటి కేటాయింపులపై కేంద్రానికే హక్కు లేదు. ట్రిబ్యునల్ నీటి కేటాయింపులను నియంత్రించే అధికారం మాత్రమే కృష్ణా బోర్డుకు ఉంది. బోర్డు తన పరిధి దాటి రూపొందించిన ముసాయిదా నోటిఫికేషన్‌ను పరిగణనలోకి తీసుకోవద్దు.
- తెలంగాణ వాదన ఇదీ
పునర్విభజన చట్టంలో సెక్షన్ 87(1) ప్రకారం కృష్ణా బోర్డు పరిధి, విధివిధానాలను కేంద్రం తక్షణమే నోటిఫై చేయాలి. బోర్డుకు అధికారాలు కట్టబెట్టాలి. దిగువ కృష్ణా బేసిన్‌లో ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకి తేవాలి. కృష్ణా బోర్డు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసినా.. నీటి విడుదలలో తెలంగాణ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. అనుమతి లేకుండా ప్రాజెక్టులు నిర్మిస్తోంది. - ఇదీ ఆంధ్రప్రదేశ్ వాదన
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: కృష్ణా జలాల వినియోగం.. ప్రాజెక్టుల నిర్వహణపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ప్రాజెక్టులన్నీ కృష్ణా బోర్డు పరిధిలోకి తేవాల్సిందేనన్న ఏపీ డిమాండ్‌ను తెలంగాణ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. అటు పోలవరం ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల్లో 45 టీఎంసీలు తమకు కేటాయించాల్సిందేనన్న తెలంగాణ డిమాండ్‌ను ఏపీ తోసిపుచ్చింది. కృష్ణా జలాల వినియోగంపై, ప్రాజెక్టుల నిర్వహణపై ఇరు రాష్ట్రాల అధికార బృందాలతో కేంద్ర జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి అమర్జీత్ సింగ్ ఢిల్లీలో రెండు రోజులు సుదీర్ఘంగా చర్చించినా సయోధ్య కుదర్చలేకపోయారు. జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ) సమావేశంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి ఇదే అంశంపై తెలంగాణ, ఏపీ మంత్రులు హరీశ్‌రావు, దేవినేని ఉమాలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘నెల రోజుల్లోగా రెండు రాష్ట్రాల బృందాలు చర్చించుకుని ఏకాభిప్రాయానికి రండి.
ఆ తర్వాత మీ ఇద్దరితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటాం. అప్పటి వరకూ గతేడాది అనుసరించిన విధానాన్నే అమలు చేస్తాం’ అని స్పష్టం చేశారు. కృష్ణా జలాల వినియోగం, ప్రాజెక్టుల నిర్వహణపై మంగళవారం రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో.. చర్చలు బుధవారం నాటికి వాయిదా పడిన విషయం విదితమే. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ కేంద్ర జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి అమర్జీత్ సింగ్ సమక్షంలో కృష్ణా బోర్డు ఇన్‌చార్జి చైర్మన్ రాంశరాణ్, సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తా, తెలంగాణ, ఏపీ నీటిపారుదల శాఖ కమిషనర్లు, ఈఎన్‌సీలు ఎస్‌కే జోషి, శశిభూషణ్ కుమార్, మురళీధర్, వెంకటేశ్వరరావు, అంతర్‌రాష్ట్ర జలవనరుల విభాగం చీఫ్ ఇంజనీర్లు నరసింహారావు, రామకృష్ణ, కోటేశ్వరరావు తదితరులతో సుదీర్ఘంగా చర్చలు కొనసాగాయి. కానీ ఇరు రాష్ట్రాలు తొలి రోజు చేసిన వాదనలనే పునరుద్ఘాటించడంతో సమావేశం మరింత వేడెక్కింది.
బోర్డు పరిధిలో వద్దు.. లేదు తేవాల్సిందే
బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు నోటిఫై చేయని నేపథ్యంలో.. ఆ అవార్డు కోర్టు విచారణలో ఉన్నందున కృష్ణా బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులను తేవడానికి అంగీకరించమని తెలంగాణ తెగేసి చెప్పింది. ఏపీ మాత్రం విభజన చట్టంలో పేర్కొన్న మేరకు కృష్ణా బోర్డు పరిధి, విధి విధానాలను తక్షణమే నోటిఫై చేయాలని పట్టుబట్టింది. దిగువ కృష్ణా బేసిన్‌లో ఇరు రాష్ట్రాల పరిధిలోని ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకి తేవాలని వాదించింది. బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులను తేలేని పక్షంలో నాగార్జునసాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌పై తమకే పూర్తి అజమాయిషీ అప్పగించాలని.. రెండు రాష్ట్రాల పరిధిలోని రెగ్యులేటర్‌లపై ఆయా రాష్ట్రాలకే అధికారం ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇందుకు తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇదే సమయంలో గతేడాది కేటాయించిన నీటి కన్నా 13 టీఎంసీలు ఏపీ అధికంగా వినియోగించుకున్న నేపథ్యంలో బోర్డుకు అధికారాలు ఇవ్వాల్సిన అవసరం ఏముందంటూ తెలంగాణ నిలదీసింది.
తేలని పంచాయతీ..
కృష్ణా జలాలను గత నీటి సంవత్సరం తరహాలోనే తెలంగాణ 299, ఆంధ్రప్రదేశ్ 512 టీఎంసీలు వినియోగించుకోవాలని, 811 టీఎంసీల కన్నా అధికంగా నీటి లభ్యత ఉంటే ఇదే నిష్పత్తిలో పంచుకోవాలని అమర్జీత్ సింగ్ ఇరు రాష్ట్రాలకూ సూచించారు. కానీ.. ఈ ప్రతిపాదనను ఏపీ వ్యతిరేకించింది. ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకి తెచ్చిన తర్వాతే నీటి వినియోగంపై నిర్ణయం తీసుకోవాలంది. అందుకు తెలంగాణ అభ్యంతరం తెలిపింది. ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదరకపోవంతో అమర్జీత్ సింగ్ ఈ అంశాన్ని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం ఆమె ఎన్‌డబ్ల్యూడీఏ నేతృత్వంలో నదుల అనుసంధానంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల మంత్రులు హరీశ్, దేవినేని హాజరయ్యారు. ఇద్దరు మంత్రులతోనూ ప్రత్యేకంగా సమావేశమైన ఉమాభారతి.. ఇరు రాష్ట్రాల బృందాలు చర్చించుకుని నెల రోజుల్లోగా ఏకాభిప్రాయానికి రావాలని సూచించారు. ఆ తర్వాత మీతో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని.. అప్పటి వరకూ గతేడాది అమలు చేసిన విధానాన్నే అనుసరించాలని ఆదేశించారు.
45 టీఎంసీలు మాకివ్వాల్సిందే: తెలంగాణ
పోలవరం ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాకు తరలించే 80 టీఎంసీల్లో బచావత్ ట్రిబ్యునల్ కర్ణాటక, మహారాష్ట్రలకు 35 టీఎంసీలు.. నాగార్జునసాగర్‌కు ఎగువన 45 టీఎంసీలు వినియోగించుకునేలా తీర్పు ఇచ్చిందని, ఆ నీటిపై తమకే హక్కు ఉందని తెలంగాణ స్పష్టంచేసింది. ఆ 45 టీఎంసీలను తమకే కేటాయించాలని పేర్కొంది. ఇందుకు ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఆ 45 టీఎంసీలపై నిర్ణయం తీసుకుంటుందని, ఆ నీటిలో రాయలసీమకూ హక్కు ఉంటుందని పేర్కొంది. తెలంగాణ చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులను అడ్డుకోవాలని ఏపీ డిమాండ్ చేయగా.. పట్టిసీమ, వెలిగొండ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులను ఏ అనుమతులతో చేపట్టారని తెలంగాణ ప్రశ్నించింది.
కుదరని లెక్క
Published Thu, Jun 23 2016 3:13 AM | Last Updated on Sat, Aug 18 2018 9:00 PM
Advertisement
Advertisement