ఐసిస్‌ను నాశనం చేసి తీరుతాం
- అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రతిన
- ప్రజల మనసులను ఉగ్రవాదులు కలుషితం చేస్తున్నారని మండిపాటు
వాషింగ్టన్: ఐఎస్‌ఐఎస్(ఐసిస్) ఉగ్రవాద సంస్థను నాశనం చేసి తీరుతామని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించారు. అమెరికాలోను, ప్రపంచవ్యాప్తంగా ప్రజల మనస్సులను కలుషితం చేస్తున్న కొత్త దశ ఉగ్రవాదాన్ని దీటుగా ఎదుర్కొంటామన్నారు. అయితే సిరియా, ఇరాక్‌లకు భారీగా బలగాలను పంపి దాడులు చేస్తామన్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. సోమవారం వైట్‌హౌస్ నుంచి ఆ దేశ ప్రజలను ఉద్దేశించి ఒబామా ప్రసంగించారు.
కాలిఫోర్నియా దుర్ఘటన నేపథ్యంలో భయవిహ్వలులైన అమెరికన్లకు ధైర్యం చెప్పారు. ఉగ్రవాద భూతాన్ని తరిమికొడతామని వ్యాఖ్యానించారు. ‘ఐసిస్ అయినా మరే ఉగ్రవాద సంస్థ అయినా మనకు ప్రమాదం కలిగించే వాటిని నాశనం చేస్తాం. బెదిరించడంపైనో, విలువలను వదిలేయడంపైనో, భయపెట్టడంపైనో మన విజయం ఆధారపడదు. మనం దృఢంగా, తెలివిగా, నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలి..’ అని పేర్కొన్నారు. ఆయన చెప్పిన మరిన్ని ముఖ్యమైన అంశాలు..
► ఇరాక్, సిరియాల్లో చేసినట్లుగా సుదీర్ఘంగా సాగే, ఎంతో వ్యయభరితమైన భూతల దాడుల వంటివి మరోసారి అనవసరం. మనను ఓడించలేమని తెలిసినా.. ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థలు అలా జరగాలని కోరుకుంటాయి. ఎందుకంటే మనం విదేశీ ప్రాంతాలను ఆక్రమిస్తే.. వారు ఏళ్ల తరబడి తిరుగుబాట్లు చేసేందుకు, మన వేలాది మంది సైనికులను చంపేందుకు, మన వనరులు ఖర్చయ్యేందుకు అవకాశముంటుందని వారికి తెలుసు. మనను బూచిగా చూపి, రిక్రూట్‌మెంట్లు చేసుకుంటారు. అందువల్లే వ్యూహాత్మకంగా స్థానిక బలగాల సాయంతో వైమానిక దాడులు చేస్తున్నాం. ఉగ్రవాదులను నిర్మూలించడం కోసం అవసరమైతే ఏ దేశంలోనైనా అమెరికా మిలటరీ దాడులు చేస్తుంది.
► గత కొన్నేళ్లుగా ఉగ్రవాదం నూతన దశలోకి ప్రవేశించింది. ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థలు బలంగా ఎదిగాయి. దేశాల మధ్య సరిహద్దులను ఇంటర్నెట్ చెరిపేసింది. ప్రజల మనసులో ఐసిస్ వంటి సంస్థలు విషం నింపుతున్నాయి. అలాంటి తీవ్రవాద ప్రభావిత (రాడికలైజ్డ్) జంట కాలిఫోర్నియాలో 14 మందిని బలితీసుకుంది.
► పారిస్‌లో ఉగ్రదాడులతో ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ తదితర మన మిత్రదేశాలు ఉగ్రవాదంపై పోరును ఉధృతం చేశాయి.ఐసిస్‌పై పోరాడుతున్న ఇరాక్, సిరియా బలగాలకు శిక్షణ, ఆయుధాల సహకారం కొనసాగిస్తాం. దీనికితోడు ఐసిస్‌కు ఆర్థిక, ఇతర సహాయమేదీ అందకుండా చేస్తాం.
► ఐసిస్‌తో అమెరికా యుద్ధం చేస్తోందని రిపబ్లికన్ల మెజారిటీ ఉన్న కాంగ్రెస్ (ప్రతినిధుల సభ) నమ్మితే... ఆ ఉగ్రవాదులపై మిలటరీ దాడులు కొనసాగించేందుకు అనుమతించేలా ఓటు చేయాలి. తద్వారా అమెరికన్లంతా ఒక్కటిగా ఉన్నారని చాటాలి.
► ఐసిస్ సంస్థ ఇస్లాం కోసమేమీ మాట్లాడదు. వారు దొంగలు, హంతకులు. ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది ముస్లింలు, దేశభక్తులైన అమెరికన్ ముస్లింలలో వారు ఒక అణువంత మాత్రమే. అయితే కొన్ని వర్గాల ముస్లింలలో తీవ్రవాద భావజాలం వ్యాపించిందన్న వాస్తవాన్ని నేను కాదనడం లేదు. ఇలాంటి ఉగ్రవాద సంస్థలు, వాటి సిద్ధాంతాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం నేతలు ఖండించాలి. కేవలం ముస్లిం అనే పేరిట ఎవరిపైనైనా వివక్ష చూపొద్దు. వారితో వేరుగా ప్రవర్తించవద్దు.
► కాగా తీవ్రవాద ఇస్లాం అతిపెద్ద ముప్పుగా పరిగణించిందని ఒబామా తన ప్రసంగంలో పేర్కొని ఉండాల్సిందని రిపబ్లికన్ పార్టీ నేతలు విమర్శించారు. ప్రసంగాన్ని ఆఫ్రికా ముస్లిం కమ్యూనిటీ స్వాగతించింది. ఇస్లాం వ్యతిరేక భావాలను ఆయన తప్పుబట్టడంపై హర్షం వ్యక్తం చేసింది. ముస్లింలందరినీ అనుమానించే ధోరణిని తప్పుబట్టి, జాతీయ ఐక్యతను ఒబామా నొక్కి చెప్పారని కౌన్సిల్ ఆన్ అమెరికన్ ఇస్లామిక్ రిలేషన్స్ పేర్కొంది.