‘75 శాతం టెర్రరిస్టులను నిర్మూలించాం’
వాషింగ్టన్: ఇరాక్, సిరియా దేశాల్లో విస్తరించిన ఐఎస్‌ఐఎస్ టెర్రరిస్టుల్లో ఇప్పటి వరకు 75 శాతం మందిని వైమానిక దాడుల్లో హతమార్చామని అమెరికా సైనిక వర్గాలు ప్రకటించాయి. 2014లో ప్రారంభించిన వైమానిక దాడుల్లో ఇంతవరకు 50 వేల మంది టెర్రరిస్టులు మరణించారని, వారిలో 12 వేల నుంచి 15వేల వరకు శిక్షణ పొందిన టెర్రరిస్టు నాయకులు ఉన్నారని ఆ వర్గాలు చెప్పాయి.
అమెరికా అధ్యక్ష పదవి నుంచి మరో నెల రోజుల్లో దిగిపోనున్న బరాక్ ఒబామా ఇటీవల తన వైట్‌హౌజ్ కార్యాలయంలో ఇరాక్, సిరియా దేశాల్లో టెర్రరిస్టులపై చేపట్టిన దాడులను సమీక్షించారు. ఈ సమావేశాల్లో టెర్రరిస్టులపై దాడుల్లో సహకరిస్తున్న సంకీర్ణ దేశాలకు ప్రత్యేక దౌత్యవేత్తగా పనిచేస్తున్న బ్రెట్ మ్యాక్‌గుర్క్ కూడా పాల్గొన్నారు. ఇరాక్, సిరియా దేశాల్లో ఇప్పటి వరకు టెర్రరిస్టు శిబిరాలపై 17 వేల వైమానిక దాడులు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. వీటిలో ఎక్కువ దాడులను అమెరికా సైనికులే జరపగా, కేవలం 4,500 దాడులను మాత్రమే సంకీర్ణ దళాలు జరపాయని ఆయన వివరించారు.
ఇదివరకు ఎన్నడు లేనంతగా టెర్రరిస్టు నాయకులు చనిపోయారని, మళ్లీ ఆ స్థాయి నాయకులు వచ్చే అవకాశం కూడా లేదని ఆయన చెప్పారు. విదేశాల నుంచి టెర్రరిస్టులు రాకుండా సరిహద్దులను కట్టుదిట్టం చేయడం కూడా ఇరాక్, సిరియా దేశాల్లో తాము నిర్వహిస్తున్న దాడులకు ఎంతో ఉపయోగపడిందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఇరాక్‌లోని మోసుల్ నగరంలో టెర్రరిస్టులకు, అమెరికా సైనికులకు మధ్య దాడులు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. గతేడాది పారిస్, బ్రస్సెల్స్‌లలో బాంబు దాడులకు సూత్రధారులైన టెర్రరిస్టు నాయకులను రక్కాలో మట్టుబెట్టామని ఆయన తెలిపారు.
బరాక్ ఒబామా స్పష్టమైన ఆదేశాల మేరకు ఇరాక్, సిరియా దేశాల్లో ఐసిస్ టెర్రరిస్టులను నిర్మూలించేందుకు సాధ్యమైనంత మేరకు అమెరికా సంయుక్త దళాలు కషి చేస్తున్నాయని, ఈ రెండేళ్లకాలంలో 75 శాతం టెర్రరిస్టులను నిర్మూలించామని బ్రెట్ తెలిపారు. మిగతా 25 శాతం టెర్ర రిస్టులను నిర్మూలించాల్సిన బాధ్యత ఒబామా స్థానంలో జనవరి నెలలో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్న డోనాల్డ్ ట్రంప్‌దేనని ఆయన వ్యాఖ్యానించారు.