బద్ధ శత్రువుల భేటీ! | Barak obama to visit Quba after 25 years | Sakshi
Sakshi News home page

బద్ధ శత్రువుల భేటీ!

Published Fri, Mar 25 2016 1:06 AM | Last Updated on Sun, Sep 3 2017 8:29 PM

బద్ధ శత్రువుల భేటీ!

బద్ధ శత్రువుల భేటీ!

బ్రస్సెల్స్‌లో ఉగ్రవాదులు సృష్టించిన బీభత్సంపై మీడియా అంతా దృష్టి కేంద్రీకరించడంవల్ల అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా క్యూబా పర్యటనపై విశ్లేషకుల దృష్టి పెద్దగా పడలేదు. ఒబామా అక్కడకు వెళ్లేముందూ, ఆ దేశంలో అడుగుపెట్టాకా ఆ పర్యటనకు సంబంధించిన వార్తలు హోరెత్తాయి. ఇంతలోనే బ్రస్సెల్స్ ఉదంతం సంభవించి వాటిని వెనక్కు నెట్టేసింది. అమెరికా అధ్యక్షుడొకరు క్యూబాలో అడుగుపెట్టడం దాదాపు తొమ్మిది దశాబ్దాల తర్వాత ఇదే ప్రథమం. ప్రచ్ఛన్న యుద్ధ శకం ముగిసి పాతికేళ్లు దాటుతున్నా దాని తాలూకు అవశేషం అమెరికా-క్యూబా సంబంధాల రూపంలో మిగిలిపోయింది. ఇరు దేశాలూ కారాలు, మిరియాలూ నూరుకోవడం...పరస్పరం సవాళ్లు విసురుకోవడం కాస్త యినా తగ్గలేదు. సోవియెట్ యూనియన్ విచ్ఛిన్నమయ్యాక మిగిలిన దేశాల్లాగే క్యూబా సైతం లొంగక తప్పదనుకున్న అమెరికాకు ఈ ధోరణి మింగుడు పడలేదు.

ఇలాంటి దశలో క్యూబాతో దౌత్య సంబంధాలు ఏర్పర్చుకోవాలని నిర్ణయించినట్టు ఏడాదిన్నరక్రితం ఒబామా, క్యూబా అధ్యక్షుడు రౌల్ కాస్ట్రో వేర్వేరు ప్రకటనలు చేసినప్పుడు ప్రపంచం ఆశ్చర్యపోయింది. పోప్ బెనెడిక్ట్ చొరవతో, మెక్సికో చేయూతతో దాదాపు రెండేళ్లపాటు తెరవెనక సాగిన మంతనాలు ఓ కొలిక్కి వచ్చిన పర్యవసానంగా 2014 డిసెంబర్‌లో ఇరు దేశాలూ దౌత్య సంబంధాలకు సుముఖత వ్యక్తం చేశాయి. అమెరికా అధ్యక్షుడొకరు హవానా వీధుల్లో తన కుటుంబ సభ్యులతో కలిసి నడుస్తారని నాలుగైదేళ్లక్రితం ఎవరూ ఊహించి ఉండరు. ఒబామా ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. అమెరికా మద్దతుతో క్యూబాను చెరబట్టిన నియంత బాటిస్టాను 1959లో కమ్యూనిస్టు విప్లవకారులు ఫైడల్ కాస్ట్రో నేతృత్వంలో కూలదోసినప్పుడు అంకురించిన విద్వేషాలు ఒబామా పర్యటనతో ఉపశమించాయనుకోవచ్చు.
 
అయితే అంతమాత్రం చేత ఈ రెండు దేశాలూ గతాన్ని పూర్తిగా మరిచి కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాయని భావించడం అత్యాశే అవుతుంది. పరస్పర అభినందనలు, ఇరు దేశాల జాతీయగీతాలాపనలు, విప్లవ వీరుడు చే గువేరా, క్యూబా స్వాతంత్య్రోద్యమ సారథి జోస్ మార్టి విగ్రహాల వద్ద ఒబామా నివాళుల ర్పించడం వంటి దౌత్యపరమైన లాంఛనాల మాటెలా ఉన్నా అయిదున్నర దశా బ్దాల బద్ధ శత్రుత్వానికి సంబంధించిన చేదు జ్ఞాపకాలు అంత తొందరగా మాసి పోవని రుజువైంది. ఇరు దేశాధినేతలూ పాల్గొన్న సంయుక్త విలేకరుల సమా వేశంలో అందుకు సంబంధించిన జాడలు స్పష్టంగా కనబడ్డాయి.
 
మానవ హక్కుల విషయంలో క్యూబా ఇంకా మెరుగుపడాలని ఒబామా ఇచ్చిన సలహాకు ఏ మాత్రం తొట్రుపాటు పడకుండా ‘ద్వంద్వ ప్రమాణాలను’ అనుసరించడం మానుకోవాలని రౌల్ కాస్ట్రో  జవాబిచ్చారు. కాస్ట్రోపై ప్రశంసల జల్లు కురిపిస్తూనే అన్ని విషయాలూ కుండబద్దలు కొట్టాలనుకున్న ఒబామాకు ఇది ఊహించని పరిణామం కావొచ్చు. అయినా ఆయన తేరుకుని ఇరు దేశాల విభేదాలనూ ఇలా ‘బహిరంగంగా’ చర్చించడాన్ని స్వాగతించారు. కాస్ట్రో ఎక్కడా తగ్గలేదు. హక్కుల అమలులో క్యూబా వెనకబడి ఉండటం ఇరు దేశాల సంబంధాల్లోనూ పెను అవరోధంగా ఉంటుందని ఒబామా అంటే...అమెరికా విధించిన ఆంక్షలు తమ ఆర్ధికాభివృద్ధికి ప్రధాన ఆటంకంగా మారాయని కాస్ట్రో అన్నారు. ప్రస్తుతం అమెరికా అధీనంలోని గ్వాంటనామో బే ను తమకు అప్పగించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.
 
ఒబామా పర్యటనపై క్యూబా యువతరంలో ఆసక్తి, ఉత్సాహం కనబడగా... వృద్ధ తరం మాత్రం పూర్తి నిరాసక్తంగా ఉన్నదని మీడియా కథనాలు చెబుతు న్నాయి. ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రం ఆవల ఉన్న అమెరికాలో కళ్లు చెదిరే ‘అత్యాధునికత’ ఉండగా తాము ఇలా వెనకబడటమేమిటని యువతరం అసహ నం వ్యక్తం చేస్తున్నదని ఆ కథనాలు అంటున్నాయి. వృద్ధతరం సంగతి వేరు. తమ దేశాన్ని లొంగదీసుకునేందుకు సహస్ర బాహువులతో అమెరికా చేసిన ప్రయత్నాల న్నిటికీ వారు ప్రత్యక్ష సాక్షులు. సోవియెట్ యూనియన్ అన్నివిధాలా ఆదుకో నట్టయితే క్యూబాను అమెరికా ఎప్పుడో పాదాక్రాంతం చేసుకునేదని వారి నమ్మకం. నియంత బాటిస్టా ద్వారా దేశాన్ని పీల్చిపిప్పి చేయడమే కాక...విప్లవం విజయవంతమయ్యాక సైతం తన గూఢచార సంస్థ సీఐఏ ద్వారా ఎన్నో కుట్రలకు దిగిందని ఆ తరం చెబుతుంది. ఫైడల్ కాస్ట్రోను హతమార్చడానికి సీఐఏ వేసిన ఎత్తుగడలపై ఆ సంస్థకు చెందిన రిటైర్డ్ అధికారులే అనేక గ్రంథాలు రాశారు.
 
ఇప్పుడు ఒబామా జరిపిన పర్యటనకు ఎన్నో పరిణామాలు దోహదపడ్డాయి. అమెరికా పారిశ్రామికవేత్తలకు కొత్త మార్కెట్‌ల అవసరం పడింది. అందుకనే కావొచ్చు...ప్రతి విషయంలోనూ విపరీత భావాలను వ్యక్తం చేస్తూ ప్రపంచాన్ని విస్మయపరుస్తున్న డోనాల్డ్ ట్రంప్ సైతం క్యూబా విషయంలో ఒబామా విధానా లతో ఏకీభవించారు. తాను అధికారంలోకొస్తే క్యూబాతో మరింత సాన్నిహిత్యానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. మొత్తానికి క్యూబాతో దశాబ్దాలుగా ఉన్న నిరర్ధక వైరానికి స్వస్తి పలకడం మంచిదని అమెరికా నిర్ణయానికొచ్చిందన్నది వాస్తవం. అటు క్యూబా కూడా చేయూతనందించే మిత్రులు లేక ఇబ్బందుల్ని ఎదుర్కొం టున్నది. సోవియెట్ విచ్ఛిన్నం అయ్యాక అండగా నిలిచిన వెనిజులా సైతం ఆ దేశ అధినేత చావెజ్ మరణానంతరం అంతంతమాత్రంగానే ఉంది.
 
దీనికితోడు అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరల పతనం కారణంగా ఆ దేశ ఆర్ధిక వ్యవస్థ దెబ్బతింది. ఏతావాతా సగటు క్యూబా పౌరుడి నెలసరి ఆదాయం 20 డాలర్లు మించడం లేదు. లాటిన్ అమెరికా దేశాలతో పోలిస్తే క్యూబా అన్నివిధాలా తీసి కట్టుగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక మెట్టు దిగడం మంచిదని కాస్ట్రో కూడా భావించారు. ఒబామా పర్యటన తక్షణం సాధించేదేమీ లేకపోయినా రాగల కాలంలో ఇరు దేశాలమధ్యా జరిగే చర్చల పరంపర సత్ఫలితాలను అందించగలదనడంలో సందేహం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement