brussels attacks
-
బద్ధ శత్రువుల భేటీ!
బ్రస్సెల్స్‌లో ఉగ్రవాదులు సృష్టించిన బీభత్సంపై మీడియా అంతా దృష్టి కేంద్రీకరించడంవల్ల అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా క్యూబా పర్యటనపై విశ్లేషకుల దృష్టి పెద్దగా పడలేదు. ఒబామా అక్కడకు వెళ్లేముందూ, ఆ దేశంలో అడుగుపెట్టాకా ఆ పర్యటనకు సంబంధించిన వార్తలు హోరెత్తాయి. ఇంతలోనే బ్రస్సెల్స్ ఉదంతం సంభవించి వాటిని వెనక్కు నెట్టేసింది. అమెరికా అధ్యక్షుడొకరు క్యూబాలో అడుగుపెట్టడం దాదాపు తొమ్మిది దశాబ్దాల తర్వాత ఇదే ప్రథమం. ప్రచ్ఛన్న యుద్ధ శకం ముగిసి పాతికేళ్లు దాటుతున్నా దాని తాలూకు అవశేషం అమెరికా-క్యూబా సంబంధాల రూపంలో మిగిలిపోయింది. ఇరు దేశాలూ కారాలు, మిరియాలూ నూరుకోవడం...పరస్పరం సవాళ్లు విసురుకోవడం కాస్త యినా తగ్గలేదు. సోవియెట్ యూనియన్ విచ్ఛిన్నమయ్యాక మిగిలిన దేశాల్లాగే క్యూబా సైతం లొంగక తప్పదనుకున్న అమెరికాకు ఈ ధోరణి మింగుడు పడలేదు. ఇలాంటి దశలో క్యూబాతో దౌత్య సంబంధాలు ఏర్పర్చుకోవాలని నిర్ణయించినట్టు ఏడాదిన్నరక్రితం ఒబామా, క్యూబా అధ్యక్షుడు రౌల్ కాస్ట్రో వేర్వేరు ప్రకటనలు చేసినప్పుడు ప్రపంచం ఆశ్చర్యపోయింది. పోప్ బెనెడిక్ట్ చొరవతో, మెక్సికో చేయూతతో దాదాపు రెండేళ్లపాటు తెరవెనక సాగిన మంతనాలు ఓ కొలిక్కి వచ్చిన పర్యవసానంగా 2014 డిసెంబర్లో ఇరు దేశాలూ దౌత్య సంబంధాలకు సుముఖత వ్యక్తం చేశాయి. అమెరికా అధ్యక్షుడొకరు హవానా వీధుల్లో తన కుటుంబ సభ్యులతో కలిసి నడుస్తారని నాలుగైదేళ్లక్రితం ఎవరూ ఊహించి ఉండరు. ఒబామా ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. అమెరికా మద్దతుతో క్యూబాను చెరబట్టిన నియంత బాటిస్టాను 1959లో కమ్యూనిస్టు విప్లవకారులు ఫైడల్ కాస్ట్రో నేతృత్వంలో కూలదోసినప్పుడు అంకురించిన విద్వేషాలు ఒబామా పర్యటనతో ఉపశమించాయనుకోవచ్చు. అయితే అంతమాత్రం చేత ఈ రెండు దేశాలూ గతాన్ని పూర్తిగా మరిచి కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాయని భావించడం అత్యాశే అవుతుంది. పరస్పర అభినందనలు, ఇరు దేశాల జాతీయగీతాలాపనలు, విప్లవ వీరుడు చే గువేరా, క్యూబా స్వాతంత్య్రోద్యమ సారథి జోస్ మార్టి విగ్రహాల వద్ద ఒబామా నివాళుల ర్పించడం వంటి దౌత్యపరమైన లాంఛనాల మాటెలా ఉన్నా అయిదున్నర దశా బ్దాల బద్ధ శత్రుత్వానికి సంబంధించిన చేదు జ్ఞాపకాలు అంత తొందరగా మాసి పోవని రుజువైంది. ఇరు దేశాధినేతలూ పాల్గొన్న సంయుక్త విలేకరుల సమా వేశంలో అందుకు సంబంధించిన జాడలు స్పష్టంగా కనబడ్డాయి. మానవ హక్కుల విషయంలో క్యూబా ఇంకా మెరుగుపడాలని ఒబామా ఇచ్చిన సలహాకు ఏ మాత్రం తొట్రుపాటు పడకుండా ‘ద్వంద్వ ప్రమాణాలను’ అనుసరించడం మానుకోవాలని రౌల్ కాస్ట్రో జవాబిచ్చారు. కాస్ట్రోపై ప్రశంసల జల్లు కురిపిస్తూనే అన్ని విషయాలూ కుండబద్దలు కొట్టాలనుకున్న ఒబామాకు ఇది ఊహించని పరిణామం కావొచ్చు. అయినా ఆయన తేరుకుని ఇరు దేశాల విభేదాలనూ ఇలా ‘బహిరంగంగా’ చర్చించడాన్ని స్వాగతించారు. కాస్ట్రో ఎక్కడా తగ్గలేదు. హక్కుల అమలులో క్యూబా వెనకబడి ఉండటం ఇరు దేశాల సంబంధాల్లోనూ పెను అవరోధంగా ఉంటుందని ఒబామా అంటే...అమెరికా విధించిన ఆంక్షలు తమ ఆర్ధికాభివృద్ధికి ప్రధాన ఆటంకంగా మారాయని కాస్ట్రో అన్నారు. ప్రస్తుతం అమెరికా అధీనంలోని గ్వాంటనామో బే ను తమకు అప్పగించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఒబామా పర్యటనపై క్యూబా యువతరంలో ఆసక్తి, ఉత్సాహం కనబడగా... వృద్ధ తరం మాత్రం పూర్తి నిరాసక్తంగా ఉన్నదని మీడియా కథనాలు చెబుతు న్నాయి. ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రం ఆవల ఉన్న అమెరికాలో కళ్లు చెదిరే ‘అత్యాధునికత’ ఉండగా తాము ఇలా వెనకబడటమేమిటని యువతరం అసహ నం వ్యక్తం చేస్తున్నదని ఆ కథనాలు అంటున్నాయి. వృద్ధతరం సంగతి వేరు. తమ దేశాన్ని లొంగదీసుకునేందుకు సహస్ర బాహువులతో అమెరికా చేసిన ప్రయత్నాల న్నిటికీ వారు ప్రత్యక్ష సాక్షులు. సోవియెట్ యూనియన్ అన్నివిధాలా ఆదుకో నట్టయితే క్యూబాను అమెరికా ఎప్పుడో పాదాక్రాంతం చేసుకునేదని వారి నమ్మకం. నియంత బాటిస్టా ద్వారా దేశాన్ని పీల్చిపిప్పి చేయడమే కాక...విప్లవం విజయవంతమయ్యాక సైతం తన గూఢచార సంస్థ సీఐఏ ద్వారా ఎన్నో కుట్రలకు దిగిందని ఆ తరం చెబుతుంది. ఫైడల్ కాస్ట్రోను హతమార్చడానికి సీఐఏ వేసిన ఎత్తుగడలపై ఆ సంస్థకు చెందిన రిటైర్డ్ అధికారులే అనేక గ్రంథాలు రాశారు. ఇప్పుడు ఒబామా జరిపిన పర్యటనకు ఎన్నో పరిణామాలు దోహదపడ్డాయి. అమెరికా పారిశ్రామికవేత్తలకు కొత్త మార్కెట్ల అవసరం పడింది. అందుకనే కావొచ్చు...ప్రతి విషయంలోనూ విపరీత భావాలను వ్యక్తం చేస్తూ ప్రపంచాన్ని విస్మయపరుస్తున్న డోనాల్డ్ ట్రంప్ సైతం క్యూబా విషయంలో ఒబామా విధానా లతో ఏకీభవించారు. తాను అధికారంలోకొస్తే క్యూబాతో మరింత సాన్నిహిత్యానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. మొత్తానికి క్యూబాతో దశాబ్దాలుగా ఉన్న నిరర్ధక వైరానికి స్వస్తి పలకడం మంచిదని అమెరికా నిర్ణయానికొచ్చిందన్నది వాస్తవం. అటు క్యూబా కూడా చేయూతనందించే మిత్రులు లేక ఇబ్బందుల్ని ఎదుర్కొం టున్నది. సోవియెట్ విచ్ఛిన్నం అయ్యాక అండగా నిలిచిన వెనిజులా సైతం ఆ దేశ అధినేత చావెజ్ మరణానంతరం అంతంతమాత్రంగానే ఉంది. దీనికితోడు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల పతనం కారణంగా ఆ దేశ ఆర్ధిక వ్యవస్థ దెబ్బతింది. ఏతావాతా సగటు క్యూబా పౌరుడి నెలసరి ఆదాయం 20 డాలర్లు మించడం లేదు. లాటిన్ అమెరికా దేశాలతో పోలిస్తే క్యూబా అన్నివిధాలా తీసి కట్టుగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక మెట్టు దిగడం మంచిదని కాస్ట్రో కూడా భావించారు. ఒబామా పర్యటన తక్షణం సాధించేదేమీ లేకపోయినా రాగల కాలంలో ఇరు దేశాలమధ్యా జరిగే చర్చల పరంపర సత్ఫలితాలను అందించగలదనడంలో సందేహం లేదు. -
ఇన్ఫోసిస్ ఉద్యోగి ఎలా గల్లంతయ్యారు?
న్యూఢిల్లీ: బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ పేలుళ్లలో ఇన్ఫోసిస్ ఉద్యోగి రాఘవేంద్రన్ గణేశ్ మెట్రోలో ప్రయాణిస్తూ అదృశ్యమైనట్టు తెలుస్తోంది. ముందు అనుకున్నట్టుగా ఎయిర్ పోర్ట్ లో కాకుండా గణేశ్ మెట్రో ట్రైన్లో ప్రయాణిస్తూ గల్లంతు అయినట్లు తెలుస్తోంది. బెంగళూరుకు చెందిన గణేష్ పేలుళ్ల సమయంలో మెట్రో రైలులో ప్రయాణించారని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ గురువారం ఉదయం ట్విట్ చేశారు. అటు ముంబైకి చెందిన జెట్ఎయిర్ వేస్ మహిళా ఉద్యోగినులు నిధి, అమిత్, ఇద్దరు ఆసుపత్రిలో కోలుకుంటున్నారని సుష్మ తెలిపారు. ఇద్దరి క్షేమ సమాచారాన్ని మంజీవ్ పూరిని అడిగి తెలుసుకుంటున్నానన్నారు. అలాగే మంజీవ్ పూరి నాయకత్వంలోని భారత ఎంబసీ బృందం చేస్తున్న కృషిని ఆమె అభినందించారు. రాఘవేంద్రన్ గణేశన్ గత నాలుగేళ్లుగా బ్రస్సెల్స్‌లో పనిచేస్తున్నారు. గణేష్ సోదరుడు ఇప్పటికే బ్రస్సెల్స్ చేరుకున్నారు. గణేష్ ఆచూకీని గుర్తించడంలో అక్కడి బెల్జియంలోని భారత దౌత్యకార్యాలయం అతనికి సహకరిస్తోంది. విమానాశ్రయంలో కంటే.. మెట్రో స్టేషన్ లో జరిగిన పేలుళ్ల తీవ్రత అధికంగా ఉండటంతో ప్రాణనష్టం కూడా అక్కడే ఎక్కువ జరిగింది. ఈ నేపథ్యంలో గణేష్ ఆచూకీ గల్లంతు కావడం ఆందోళన కలిగిస్తోంది. కాగా బ్రస్సెల్స్‌లో మంగళవారం ఎయిర్‌పోర్ట్‌లో, మెట్రో స్టేషన్ వద్ద జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 31 మంది మృత్యువాత పడగా, మరో 200 మంది గాయపడిన సంగతి తెలిసిందే. Raghavendran Ganesh - We have tracked his last call in Brussels. He was travelling in the metro rail. @SanjeevKandakur @IndEmbassyBru — Sushma Swaraj (@SushmaSwaraj) March 24, 2016 -
బెల్జియం ఫుట్‌బాల్ మ్యాచ్ రద్దు
బ్రస్సెల్స్: బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో బాంబు పేలుళ్ల ఘటన ప్రభావం ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడింది. వచ్చే మంగళవారం బెల్జియం, పోర్చుగల్ మధ్య ఇక్కడ జరగాల్సిన ఫ్రెండ్లీ ఇంటర్నేషనల్ మ్యాచ్‌ను రద్దు చేశారు. బెల్జియం ఫుట్‌బాల్ సంఘం అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. భద్రత కారణాల రీత్యా ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. మ్యాచ్‌ను రద్దు చేయాల్సిందిగా బ్రస్సెల్స్ సిటీ హాల్ నిర్వాహకులు తమను కోరారని చెప్పారు. బ్రస్సెల్స్‌లో మంగళవారం ఎయిర్‌పోర్ట్‌లో, మెట్రో స్టేషన్ వద్ద జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 34 మంది మరణించగా, మరో 200 మంది గాయపడిన సంగతి తెలిసిందే. -
బ్రస్సెల్స్‌లో ఇన్ఫోసిస్ ఉద్యోగి అదృశ్యం
న్యూఢిల్లీ: బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో మంగళవారం బాంబు పేలుళ్లు జరిగిన తర్వాత భారత్‌కు చెందిన రాఘవేంద్ర గణేశన్ ఆచూకీ తెలియడం లేదు. బ్రస్సెల్స్ నగరంలో రాఘవేంద్ర ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్నాడు. రాఘవేంద్ర ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, అయితే అతని జాఢ ఇంకా తెలియరాలేదని బ్రెజిల్లో భారత రాయబారి మంజీవ్ పూరి చెప్పారు. రాఘవేంద్రను సంప్రదించేందుకు అతని స్నేహితులు కూడా ప్రయత్నిస్తున్నారని తెలిపారు. రాఘవేంద్ర ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు. రాఘవేంద్ర అదృశ్యం కావడానికి గంట ముందు తల్లితో ఫోన్లో మాట్లాడినట్టు చెప్పారు. బెల్జియంలోని భారతీయులకు అన్న విధాలా సాయం చేస్తామని హామీ ఇచ్చారు. బాంబు పేలుళ్లలో గాయపడిన జెట్ ఎయిర్ వేస్ సిబ్బంది ఇద్దరు కోలుకుంటున్నారని సుష్మా వెల్లడించారు. బ్రస్సెల్స్‌లో మంగళవారం ఎయిర్‌పోర్ట్‌లో, మెట్రో స్టేషన్ వద్ద జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 34 మంది మరణించగా, మరో 200 మంది గాయపడిన సంగతి తెలిసిందే. -
బ్రస్సెల్స్ లో మా ఆయన క్షేమం: హీరోయిన్
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్ విమానం కెప్టెన్ అయిన తన భర్త బ్రస్సెల్స్ లో క్షేమంగా ఉన్నాడని బాలీవుడ్ హీరోయిన్ గుల్ పనాగ్ తెలిపింది. జెట్ ఎయిర్ వేస్ విమానం బెల్జియం రాజధాని బ్రసెల్స్ విమానాశ్రయంలో ల్యాండైన కొద్దిసేపటికే ఆత్మాహుతి దాడులు కుదిపేశాయి. విమానాశ్రయంలో హాహాకారాలు, ఆర్తనాదాలతో భీతావహ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో బ్రసెల్స్ లో దిగిన జెట్ ఎయిర్వేస్ సిబ్బంది, ప్రయాణికులు ప్రస్తుతం క్షేమంగా ఉన్నారని గుల్ పనాగ్ ట్విట్టర్ లో తెలిపింది. తన భర్త, జెట్ ఎయిర్వేస్ కెప్టెన్ జీఎస్ అట్టారీ విమానంలో ఉన్నారని ఆమె వెల్లడించింది. 'బ్రస్సెల్స్ విమానాశ్రయంలో ప్రస్తుతం ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతున్నది. భద్రతా సిబ్బంది ఇప్పటికీ బాంబులను కనుగొంటున్నారు. మా ఆయన, విమాన సిబ్బంది, ప్రయాణికులు ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారు. అక్కడి వివరాలను ఎప్పటికప్పుడు మా ఆయన ద్వారా తెలుసుకొని ట్విట్టర్ లో షేర్ చేస్తున్నాను. దీనివల్ల విమానం సిబ్బంది, ప్రయాణికుల కుటుంబసభ్యులకు తమ వారి భద్రత గురించి తెలుసుకుంటారు' అని ఆమె మీడియాతో పేర్కొంది. 'ప్రయాణికులు, సిబ్బంది అంతా విమానంలోనే ఉన్నారు. వారి విమానం సురక్షిత ప్రదేశంలో ఉంది. ప్రతి గంటకు మా ఆయన తాజా సమాచారం అందిస్తున్నారు' అని ఆమె తాజాగా ట్వీట్ చేశారు. న్యూఢిల్లీ నుంచి బ్రస్సెల్స్ వెళ్లిన జెట్ ఎయిర్వేస్ సిబ్బందిని, ప్రయాణికులను విమానం నుంచి ప్రస్తుతం దింపి.. పంపించివేశారని మరో ట్వీట్ లో వెల్లడించారు. -
పేలుళ్లు జరిగినా వెనుకడుగేయని మోదీ!
న్యూఢిల్లీ: ఆత్మాహుతి బాంబు దాడులతో బెల్జియం దద్దరిల్లినప్పటికీ ఆ దేశ పర్యటన విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముందుకే సాగనున్నారు. ఈ నెల 30న ప్రధాని మోదీ బెల్జియం రాజధాని బ్రసెల్స్ లో జరుగనున్న భారత్-యూరోపియన్ యూనియన్ సదస్సులో పాల్గొననున్నారు. బ్రసెల్స్ లో ఆత్మాహుతి దాడులు జరిగి 21 మంది చనిపోయిన నేపథ్యంలో ప్రధాని మోదీ తలపెట్టిన ఈ పర్యటనపై పలు సందేహాలు తలెత్తాయి. యూరప్ లో భారత్ రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని, ఈ పర్యటన యథాతథంగా కొనసాగుతుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. బెల్జియం పర్యటన ముగించుకొని అటు నుంచి అమెరికాలోని వాషింగ్టన్ లో పర్యటిస్తారని, అక్కడ మార్చి 31-ఏప్రిల్ ఒకటో తేదీల్లో జరిగే అణుభద్రత సదస్సులో ఆయన పాల్గొంటారని చెప్పారు. అనంతరం సౌది అరేబియాలోని రియాద్ కు వెళుతారని స్వరూప్ వెల్లడించారు. బ్రసెల్స్ పేలుళ్లలో జెట్ ఎయిర్ వేస్ కు చెందిన ఇద్దరు ఉద్యోగులు గాయపడినట్టు వార్తలు వస్తుండగా.. అందులో ఒకరు క్షతగాత్రులైనట్టు తమకు కూడా సమాచారముందని ఆయన తెలిపారు. -
మాపై గుడ్డిగా దాడి చేశారు!
బ్రస్సెల్స్: తాము భయపడినట్టే జరిగిందని, తమపై గుడ్డిగా దాడి చేశారని బెల్జియం ప్రధానమంత్రి చార్లెస్ మైఖేల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి ఇది చీకటి గడియ అని, ఈ సమయంలో సంయమనంతో, ఐక్యతతో ఉండాల్సిన అవసరముందని ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి పేర్కొన్నారు. పిరికిపందల్లా తమపై దాడికి దిగారని ఉగ్రవాదులను ఉద్దేశించి ఆయన అన్నారు. ప్రస్తుతం ఆర్మీ పూర్తిస్తాయిలో రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నదని చెప్పారు. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లో మంగళవారం జరిగిన వరుస ఆత్మాహుతి దాడుల్లో 21మందికిపైగా చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 55 మంది గాయపడ్డారు. బ్రసెల్స్ లోని విమానాశ్రయంతోపాటు ఓ మెట్రో స్టేషన్ వద్ద కూడా పేలుళ్లు జరిగాయి. పారిస్ నరమేధం నిందితుడిని బెల్జియంలో ఇటీవల అరెస్టు చేసిన నేపథ్యంలో జరిగిన ఈ ఉగ్రవాద దాడితో బ్రసెల్స్ చిగురుటాకులా వణికిపోయింది. బెల్జియం దిగ్భ్రాంతపోయింది. ఈ నేపథ్యంలో పేలుళ్లలో చనిపోయినవారి కుటుంబాలకు బెల్జియం ప్రధాని చార్లెస్ మైఖేల్ సంతాపం తెలిపారు. ఈ పేలుళ్లలో పలువురు చనిపోయినట్టు, పెద్దసంఖ్యలో ప్రజలు క్షతగాత్రులైనట్టు తెలుస్తున్నదని ఆయన పేర్కొన్నారు.