పేలుళ్లు జరిగినా వెనుకడుగేయని మోదీ!
న్యూఢిల్లీ: ఆత్మాహుతి బాంబు దాడులతో బెల్జియం దద్దరిల్లినప్పటికీ ఆ దేశ పర్యటన విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముందుకే సాగనున్నారు. ఈ నెల 30న ప్రధాని మోదీ బెల్జియం రాజధాని బ్రసెల్స్ లో జరుగనున్న భారత్-యూరోపియన్ యూనియన్ సదస్సులో పాల్గొననున్నారు. బ్రసెల్స్ లో ఆత్మాహుతి దాడులు జరిగి 21 మంది చనిపోయిన నేపథ్యంలో ప్రధాని మోదీ తలపెట్టిన ఈ పర్యటనపై పలు సందేహాలు తలెత్తాయి.
యూరప్ లో భారత్ రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని, ఈ పర్యటన యథాతథంగా కొనసాగుతుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. బెల్జియం పర్యటన ముగించుకొని అటు నుంచి అమెరికాలోని వాషింగ్టన్ లో పర్యటిస్తారని, అక్కడ మార్చి 31-ఏప్రిల్ ఒకటో తేదీల్లో జరిగే అణుభద్రత సదస్సులో ఆయన పాల్గొంటారని చెప్పారు. అనంతరం సౌది అరేబియాలోని రియాద్ కు వెళుతారని స్వరూప్ వెల్లడించారు. బ్రసెల్స్ పేలుళ్లలో జెట్ ఎయిర్ వేస్ కు చెందిన ఇద్దరు ఉద్యోగులు గాయపడినట్టు వార్తలు వస్తుండగా.. అందులో ఒకరు క్షతగాత్రులైనట్టు తమకు కూడా సమాచారముందని ఆయన తెలిపారు.