దెబ్బకు దెబ్బ..! | PM Modi tells forces after Pulwama attack | Sakshi
Sakshi News home page

దెబ్బకు దెబ్బ..!

Published Sat, Feb 16 2019 4:36 AM | Last Updated on Sat, Feb 16 2019 5:26 AM

PM Modi tells forces after Pulwama attack - Sakshi

ఎయిర్‌పోర్టులో అమర జవాన్లకు నివాళులర్పిస్తున్న ప్రధాని మోదీ, బుద్గామ్‌లో జవాను భౌతికకాయాన్ని మోస్తున్న రాజ్‌నాథ్‌

భరతమాత కన్నీరు పెడుతోంది. కోట్లాది భారతీయుల గుండెలకు లోతైన గాయమైంది.  మనల్ని నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేని కొందరు పిరికిపందలు చాటుమాటున నక్కి చేసిన దాడితో దేశానికి రక్షణగా నిలిచే వీరాధివీరులే నిర్జీవంగా నేలకొరిగిన దృశ్యాలు చూసి మనసు చలించిపోతోంది. కుట్ర కుతంత్రాలతో తన నీచ బుద్ధిని ఎప్పటికప్పుడు బయటపెట్టుకునే జిత్తులమారి దాయాది దేశానికి బుద్ధి చెప్పాలనే ఆరాటం, పగ , ప్రతీకారంతో భారతీయుల గుండెలు రగిలిపోతున్నాయి. ఇలాంటి  సమయాల్లోనే కంటికి కన్ను, పంటికి పన్ను సిద్ధాంతమే సరైనదే అనిపిస్తుంది.. అలాగంటే అదేదో యుద్ధోన్మాదం కాదు. అమరులైన వీర జవాన్లకు న్యాయం జరగాలి. భారతీయులు ఇప్పుడు కోరుకుంటున్నదదే. ఇక మీదట త్యాగాలకు విలువ లేదు. వాటికెప్పుడో కాలం చెల్లిపోయింది.

మన దేశ సైనిక సత్తా, ఆర్థిక బలానికి కూడా కాలం చెల్లిపోయిందా ? పచ్చటి పచ్చికలపై పారే ఎర్రటి నెత్తురు మరకలు చూస్తుంటే మరిగిపోయిన రక్తం చప్పున చల్లారిపోతుందా? ఇంత నరకయాతనని కొద్ది రోజుల్లోనే మనం మర్చిపోతామా?  కొన్ని వారాల్లోనే మళ్లీ సాధారణ మనుషులమైపోతామా?  ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికల్లో గెలిచి, ప్రజాప్రతినిధుల వేషాల్లో ఉన్నవారే ఉగ్రవాదులకు కొమ్ము కాస్తూ, బయటకి కల్లబొల్లి ఏడ్పులు ఏడుస్తూ ఉంటే, శాంతి నెలకొనాలన్న భారత్‌ ఆశయాలకు తూట్లు పొడుస్తూ ఉంటే, కేంద్రం అడుగులు ఎటువైపు వేయాలి? ఇప్పుడు కశ్మీర్‌ భూతల స్వర్గం కాదు. మండుతున్న మంచుగోళం. శవాల దిబ్బల్ని చూసే ఓపిక లేదు. ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడుతూ కూర్చుంటే సహించే పరిస్థితి లేదు. దాడి చూసాకైనా కేంద్రం సత్వర చర్యలు చేపట్టాలి. జాతి యావత్తూ అందుకోసమే ఎదురుచూస్తోంది.

న్యూఢిల్లీ: ‘భారతీయుల రక్తం మరుగుతోంది. రోజూ వారీ ఖర్చులు వెళ్లదీయడానికి ఇతర దేశాల ముందు బిచ్చమెత్తుకుంటూ మన పొరుగుదేశం ఎంతో దిగజారింది. ఆ నిరాశ, నిస్పృహల ఫలితంగానే పుల్వామాలో దాడికి తెగబడింది. ఉగ్రవాదులపై ఎప్పుడు, ఎలా ప్రతీకారం తీర్చుకోవాలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. ఇదొక కొత్త సంప్రదాయం’ అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఉగ్రచర్యలతో భారత్‌ను పాకిస్తాన్‌ బలహీనపరచలేదని, పుల్వామా దాడికి బాధ్యులైన వారు భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. మరోవైపు, పాకిస్తాన్‌కు ఇచ్చిన అత్యంత అనుకూల దేశం(మోస్ట్‌ ఫేవర్డ్‌ నేషన్‌–ఎంఎఫ్‌ఎన్‌) హోదాను భారత్‌ వెనక్కి తీసుకుంది. భారత్‌లో పాకిస్తాన్‌ హైకమిషనర్‌ సొహైల్‌ మహమూద్‌ను పిలిపించుకుని విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్‌ గోఖలే నిరసన వ్యక్తం చేశారు.  

పెద్ద తప్పు చేశారు..మూల్యం తప్పదు
ఢిల్లీలో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు జెండా ఊపాక మోదీ మాట్లాడారు.‘ ఉగ్ర సంస్థలు, ఉగ్రవాదులకు మద్దతునిస్తూ, వారిని ప్రేరేపిస్తున్న వారికి ఒకటే మాట చెప్పాలనుకుంటున్నా. వారు చాలా పెద్ద తప్పు చేశారు. ఈ దుశ్చర్యకు వారు భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు. పుల్వామా దాడికి పాల్పడిన, ఈ కుట్ర వెనక ఉన్న వారందరినీ కఠినంగా శిక్షిస్తామని దేశానికి హామీ ఇస్తున్నా. ఇప్పటికే అంతర్జాతీయంగా ఏకాకి అయిన మన పొరుగుదేశం ఉగ్రదాడులతో మన దేశంలో అస్థిరత సృష్టించాలని కుట్రలు పన్నుతోంది. కానీ వాళ్ల ప్రణాళికలు సఫలం కావు. ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకోవడానికి మన బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం’ అని అన్నారు. అనంతరం ఝాన్సీలో జరిగిన మరో సభలో ప్రసంగిస్తూ..పుల్వామా ఘటనలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల త్యాగం వృథాగా పోదని పేర్కొన్నారు. ‘ ఉగ్రమూకల ఆటకట్టించేందుకు ఎప్పుడు, ఎక్కడ, ఎలాంటి వ్యూహం రచించాలో ఆ బాధ్యతను సైన్యానికే వదిలిపెట్టాం. ఇదే మన దేశ కొత్త విధానం, సంప్రదాయం’ అని పేర్కొన్నారు.   

అమరులకు మోదీ, రాహుల్‌ నివాళి
పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల మృతదేహాలను వైమానిక దళ విమానం శుక్రవారం శ్రీనగర్‌ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చింది. హోం మంత్రి రాజ్‌నాథ్‌ ఇందిరా గాంధీ ఎయిర్‌పోర్ట్‌లో అమరవీరుల భౌతికకాయాలను స్వీకరించారు. 40 శవపేటికలను పక్కపక్కన ఉంచారు. ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ తదితరులు పుష్పగుచ్ఛాలను ఉంచి నివాళులర్పించారు.  

ప్రభుత్వానికి, జవాన్లకు అండగా ఉంటాం: రాహుల్‌
భద్రతా బలగాలపై జరిగిన ఉగ్రదాడిని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ దేశ ఆత్మపై జరిగిన దాడిగా పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వానికి తమ పూర్తి స్థాయి మద్దతునిస్తామని తెలిపారు. ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వానికి, జవాన్లకు అండగా ఉంటాయని స్పష్టం చేశారు. ‘దేశాన్ని రెండు ముక్కలుగా చేయాలన్న టెర్రరిస్టుల ఆశయం ఎన్నటికీ నెరవేరదు. మరో రెండు రోజులపాటు ఇతర విషయాలేవీ మాట్లాడదలచుకోలేదు’ అని తర్వాత మీడియా సమావేశంలో అన్నారు. ‘జవాన్ల కుటుంబాలకు అండగా నిలవడమే మన మొదటి కర్తవ్యం. ఉగ్రవాదులను ఎదుర్కొనే విషయంలో ఎలాంటి రాజీపడే ప్రసక్తే లేదు. టెర్రరిజంపై ఐక్యంగా పోరాడాలి’ అని మన్మోహన్‌ సింగ్‌ స్పష్టం చేశారు.

అత్యంత అనుకూల దేశం హోదా రద్దు
దాడి నేపథ్యంలో పాకిస్తాన్‌కు ఇచ్చిన ‘అత్యంత అనుకూల దేశం’(ఎంఎఫ్‌ఎన్‌) హోదాను భారత్‌ రద్దుచేసింది. ప్రధాని నేతృత్వంలో భేటీ అయిన కేబినెట్‌ భద్రతా కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో పాక్‌ నుంచి దిగుమతి అయ్యే పలు వస్తువులపై భారత్‌ కస్టమ్స్‌ సుంకాలు పెంచే చాన్సుంది. సుమారు 49కోట్ల డాలర్ల పాక్‌ ఉత్పత్తులపై ప్రభావం పడొచ్చు. పాక్‌కు అత్యంత అనుకూల దేశం హోదాను భారత్‌ 1996లో ఇవ్వగా, ఇంకా భారత్‌కు పాక్‌ ఆ హోదాను ఇవ్వలేదు. పాక్‌  నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువుల్లో ప్రధానంగా ముడిపత్తి, నూలు, రసాయనాలు, ప్లాస్టిక్, రంగులు తదితరాలున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో) సభ్యదేశాలు తమలో తాము వివక్షాపూరిత వాణిజ్య విధానాలు అవలంబించకుండా ఉండేందుకు ఎంఎఫ్‌ఎన్‌ హోదాను ఇచ్చిపుచ్చుకుంటాయి. ఈ హోదా కలిగిన దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులు, ఉత్పత్తులపై పన్నులు తక్కువగా ఉంటాయి.



 నివాళి కార్యక్రమంలో రాజ్‌నాథ్, నిర్మల, కేజ్రీవాల్, రాహుల్, సైన్యాధికారులు        


జమ్మూలో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న ప్రజలు       


  ఢిల్లీలోని ఇండియా గేట్‌ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement