ఆగ్రాలో రోదిస్తున్న జవాన్ కౌషల్ రావత్ కుటుంబసభ్యులు
న్యూఢిల్లీ: భారత ఆర్మీకి యువ సైనికులను అందించిన హమీర్‌పూర్ నుంచి కర్ణాటకలోని గుడిగెరె వరకు ఎన్నో గ్రామాల్లో శుక్రవారం విషాదం అలుముకుంది. ‘మా కొడుకు ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేయడం పట్ల గర్వంగా ఉంది. కానీ దాడికి పాల్పడిన వారిని ప్రభుత్వం ఉపేక్షించొద్దు’ అని బాధిత కుటుంబాలు కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాయి. పలు గ్రామాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చి పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ప్రతీకారం తీర్చుకోవాలని డిమాండ్ చేశారు.
పాక్‌ను విడిచిపెట్టొద్దు..
‘మేం కొడుకును కోల్పోయాం. పాకిస్తాన్‌ను విడిచిపెట్టొద్దు. ఇలాంటి దాడులకు దిగకుండా ఆ దేశానికి గట్టిగా బుద్ధి చెప్పాలి’ అని పుల్వామా ఉగ్రదాడిలో అమరుడైన, హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లా జవాలికి చెందిన సీఆర్‌పీఎఫ్ జవాన్ తిలక్‌రాజ్ తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు. 30 ఏళ్ల తిలక్‌రాజ్ మూడ్రోజుల క్రితమే ఇంటికి వచ్చి వెళ్లి సైన్యంలో చేరారు. ఇంతలోపే ఈ దారుణం ఆ కుటుంబాన్ని కుంగదీసింది. తిలక్‌రాజ్ కుటుంబానికి సీఎం జయరామ్ ఠాకూర్ రూ.20 లక్షల పరిహారం ప్రకటించారు.
11నే ఇంటి నుంచి వెళ్లాడు..
‘శ్రీనగర్ 115వ బెటాలియన్‌లో కొత్త పోస్టింగ్‌లో చేరడానికి ఈ నెల 11నే నా తమ్ముడు నాగ్‌పూర్ నుంచి వెళ్లాడు. గురువారం ఉదయం 9.30 గంటల సమయంలో ఫోన్ చేసి మాట్లాడాను. కొత్త పోస్టింగ్‌లో చేరేందుకు తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో జమ్మూ నుంచి బయల్దేరినట్లు చెప్పాడు. మధ్యాహ్నంలోపే అంతా జరిగిపోయింది’ అని అమర జవాన్ సంజయ్ రాజ్‌పుత్ సోదరుడు రాజేశ్ వాపోయారు. మహారాష్ట్ర బుల్డానా జిల్లాలోని మాల్కాపూర్‌కు చెందిన సంజయ్(45) నాలుగేళ్లుగా నాగ్‌పూర్‌లోని సీఆర్‌పీఎఫ్ 213వ బెటాలియన్‌లో పనిచేస్తున్నారు.
వెళ్లిన మూడ్రోజులకే నిర్జీవంగా..
పుల్వామా దాడిలో అసువులు బాసిన వారిలో ఉత్తర ప్రదేశ్‌లోని మహరాజ్‌గంజ్ హర్పూర్ గ్రామానికి చెందిన పంకజ్ త్రిపాఠి ఒకరు. 2 నెలల సెలవుల్ని తమ కుటుంబంతో సరదాగా గడిపిన పంకజ్ మూడ్రోజుల క్రితమే తిరిగి విధుల్లోకి చేరేందుకు కశ్మీర్‌కు వెళ్లాడు. ఇంతలోనే ఆ కుటుంబం అతడి మరణ వార్తను వినాల్సి వచ్చింది. ‘అధికారులు మాకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పారు. మాతృభూమి కోసం నా కొడుకు ప్రాణాలర్పించడం చాలా గర్వంగా ఉంది. అయితే ఉగ్రవాదులకు ప్రభుత్వం కచ్చితంగా గుణపాఠం చెప్పాల్సిందే’నని పంకజ్ త్రిపాఠి తండ్రి ఓం ప్రకాశ్ త్రిపాఠి అన్నారు.
చెట్టంత కొడుకే పోయాక ఏముంది?
బిహార్‌కు చెందిన జవాన్లు సంజయ్‌కుమార్ సిన్హా, రతన్‌ఠాకూర్ సిన్హా ఇళ్ల వద్ద కుటుంబ సభ్యులు, బంధువుల వేదన వర్ణనాతీతంగా ఉంది. చెట్టంత కొడుకును పోగొట్టుకున్నాక ఇక తమకు దిక్కెవరంటూ విషణ్ణ వదనుడైన సంజయ్‌కుమార్ సిన్హా తండ్రి మహేంద్ర ప్రసాద్ సిన్హా రోదిస్తున్నారు. సంజయ్‌కుమార్‌కు పెళ్లీడొచ్చిన ఇద్దరు కుమార్తెలున్నారు. బాగల్పూర్‌కు చెందిన రతన్‌ఠాకూర్‌కు నాలుగేళ్ల కుమారుడు ఉండగా, ప్రస్తుతం అతని భార్య గర్భిణి. దియోరాలోని 30 ఏళ్ల విజయ్ కుమార్ మౌర్య ఇంటిలో రోదనలు మిన్నంటాయి. ఏడాదిన్నర కొడుకు, భార్యతో సంతోషంగా స్వగ్రామంలో గడిపిన మౌర్య ఫిబ్రవరి 9నే జమ్మూకు తిరిగి వెళ్లారు. పశ్చిమ బెంగాల్‌లోని చక్కాసి రాజ్‌బంగ్షీపుర గ్రామానికి చెందిన జవాను బబ్లూ సాంత్రా కుటుంబ సభ్యుల ఆవేదన అక్కడున్నవారందరినీ కంటతడి పెట్టించింది.
ఆధార్, పాన్ కార్డులతో మృతుల గుర్తింపు
న్యూఢిల్లీ: పుల్వామా దాడిలో చనిపోయిన జవాన్ల మృతదేహాలు ముక్కలై చెల్లాచెదురుగా పడటంతో మృతులను గుర్తించడం కష్టమైంది. దీంతో సిబ్బంది బ్యాగులు, వారి దుస్తులకున్న జేబుల్లోని ఆధార్, పాన్ కార్డులు, సీఆర్‌పీఎఫ్ గుర్తింపు కార్డులు, సెలవు దరఖాస్తు పత్రాలతోనే గుర్తించారు. మరికొందరిని వారు ధరించిన చేతి గడియారాలు, వారి పర్సులు తదితరాల ద్వారా సహోద్యోగులు గుర్తించారు. మరికొంతమంది చివరి నిమిషంలో ప్రయాణం రద్దు చేసుకుని ఈ దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారని ఓ అధికారి చెప్పారు. మరోవైపు ఆ సమయంలో కాన్వాయ్‌లో వెళ్తున్న జవాన్లందరి ఇళ్లకు అధికారులు ఫోన్లు చేసి.. జవాన్లలో ఎవ్వరూ గల్లంతు కాలేదనీ, చనిపోయినట్లుగా ప్రకటించిన జాబితా కచ్చితమైనదేనని చెప్పి, బతికున్న వారి కుటుంబాల్లో ధైర్యం నింపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment