
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని సరిహద్దు జిల్లా రాజౌరిలో మైనారిటీ వర్గం లక్ష్యంగా ఉగ్రవాదులు దారుణానికి ఒడిగట్టారు. రాజౌరికి 8 కిలోమీటర్ల దూరంలోని అప్పర్ డాంగ్రి గ్రామంలో ఆదివారం ఇళ్లల్లోకి చొరబడి కాల్పులు జరిపిన సంఘటన నుంచి తేరుకోకముందే మరోమారు దాడి చేశారు. బాధితుల ఇంటి సమీపంలోనే సోమవారం భారీ పేలుడు జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం నాటి కాల్పుల్లో మొత్తం నలుగురు మృతి చెందగా.. సోమవారం నాటి బాంబు దాడిలో ఓ నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
‘మొదటి కాల్పుల ఘటన జరిగిన ప్రాంతంలోనే పేలుడు జరిగింది. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర గాయాలతో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పాత్రికేయులు అప్రమత్తంగా ఉండాలి. ఈ ప్రాంతంలోనే మరో ఐఈడీని స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశాం.’అని స్థానిక పోలీసులు తెలిపారు. ఆదివారం నాటి ఘటన బాధ్యుల కోసం గాలింపు చర్యలు చేపట్టిన క్రమంలోనే ఈ భారీ పేలుడు జరగటం తీవ్ర కలకలం రేపింది.
రూ.10లక్ష పరిహారం, ప్రభుత్వం ఉద్యోగం..
ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10లక్షల చొప్పున నష్టపరిహారం, ఇంట్లో అర్హులైన వారికి ప్రభుత్వం ఉద్యోగం ప్రకటించారు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. గాయపడిన వారికి రూ.1 లక్ష సాయం అందిస్తామని తెలిపారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని, కారకులను చట్టంముందు నిలబెడతామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.
ఆందోళనలు..
మైనారిటీలే లక్ష్యంగా ఉగ్రదాడులు జరగటంపై రాజౌరీలో ఆదివారం పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు స్థానికులు. తమ ప్రాణాలు రక్షించటంలో ప్రభుత్వం విఫలమైందని నినాదాలు చేశారు. నిరసనకారులను కలిసేందుకు వెళ్లిన క్రమంలో జమ్ముకశ్మీర్ బీజేపీ చీఫ్ రవిందర్ రైనాను అడ్డుకున్నారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లా యంత్రాంగం పూర్తిగా విఫలమైందని, లెఫ్టినెంట్ గవర్నర్ తమ వద్దకు వచ్చి డిమాండ్లు వినాలని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: కశ్మీర్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ముగ్గురు పౌరులు మృతి
Comments
Please login to add a commentAdd a comment