రైలుకింద పడి అక్కా చెల్లెళ్ల మృతి
తండ్రి మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్య.. మరో సోదరి పరిస్థితి విషమం
విజయవాడ (భవానీపురం): తండ్రి మరణాన్ని తట్టుకోలేని ముగ్గురు అక్కా చెల్లెళ్లు ఆత్మహత్యాయత్నం చేశారు. ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మరో సోదరి పరిస్థితి విషమంగా ఉంది. విజయవాడ రూరల్ మండలం రాయనపాడు రైల్వే ట్రాక్‌పై శుక్రవారం జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు, బాధితుల బంధువులు తెలిపిన వివరాలు.. మృతురాళ్ల తండ్రి అబ్దుల్ రఫీ లారీ డ్రైవర్. రాయనపాడులోని ఒక బిస్కెట్ కంపెనీ గోడౌన్ నుంచి సరుకు చేరవేస్తుంటాడు. ఆయన భార్య షాకిరా సుల్తానా అనారోగ్యంతో ఉండటంతో గురువారం విజయవాడ ఆస్పత్రిలో ఉన్న ఆమెను చూసి ఇంటికి వస్తున్నానని పోరంకిలోని తన బావమరిదికి ఫోన్ చేసి చెప్పాడు.
కాగా, గురువారం ఉదయం పోరంకి ఎస్‌బీఐ ఏటీఎం దగ్గర రఫీ చనిపోయి ఉన్నట్లు అతని బావమరిదికి సమాచారం వచ్చింది. ఈ విషయం హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీలో ఉంటున్న రఫీ కుమార్తెలు రుకియా సుల్తానా, షాహిన్, పర్వీన్‌లకు తెలిసింది. విజయవాడ వచ్చిన వారు తండ్రి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. సాయంత్రం 6 గంటల సమయంలో రాయనపాడు వచ్చారు. ఏమనుకున్నారో ఏమో రైలుకింద పడి చనిపోవడానికి నిర్ణయించుకున్న వారు అర్ధరాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. షాహిన్ (21), పర్వీన్(19) అక్కడికక్కడే మృతి చెందారు. ఆత్మహత్యకు పాల్పడిన ప్రదేశం పక్కనే ఉన్న చిన్న గుంతలో రుకియా సుల్తానా(22) పడిపోవడంతో తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు ఆమెను గొల్లపూడిలోని ఆంధ్రా హాస్పిటల్‌లో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. రుకియా సుల్తానాకు నెల కిందటే వివాహమైంది. ఆమె భర్త అమెరికాలో ఉన్నారు.