కాలయాపన వద్దు
కాలయాపన వద్దు
Published Tue, Oct 18 2016 11:21 PM | Last Updated on Wed, Oct 3 2018 7:31 PM
• ఎన్‌డీఎస్‌ఎల్‌ను తక్షణమే పునరుద్ధరించాలి
• చెరుకు సాగుకు ప్రభుత్వం భరోసానివ్వాలి
• మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి డిమాండ్
• రేపటి నుంచి కాంగ్రెస్ రైతు పాదయాత్ర
బోధన్:
నిజాం షుగర్ ఫ్యాక్టరీ భవితను తేల్చడంలో ఇంకా కాలయాపన వద్దని, నెలలోపు ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి డిమాండ్ చేశారు. అధికారంలోకి రాగానే వంద రోజుల్లో ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుని పూర్వవైభవం తెస్తామన్న టీఆర్‌ఎస్.. రెండున్నరేళ్లు గడిచినా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. మంగళవారం బోధన్‌లోని నీటిపారుదల శాఖ గెస్ట్‌హౌస్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. లేఆఫ్ ప్రకటించి ఫ్యాక్టరీని మూసివేయడంతో కార్మికులు ఉపాధి కోల్పోయారని, వారికి ఉద్యోగ భద్రతపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. బోధన్ ప్రాంతం చెరుకు పంట సాగుకు అనుకూలమని, చెరుకుకు బదులు ఇతర పంటలు సాగు చేసిన రైతులు వాతావరణ పరిస్థితుల వల్ల తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఫ్యాక్టరీ భవితతో పాటు చెరుకు పంట సాగుపై రైతులకు భరోసా ఇవ్వాలన్నారు. గతేడాది ప్రైవేట్ చక్కెర ఫ్యాక్టరీకి చెరుకు తరలించిన రైతులకు రావాల్సిన రవాణా చార్జీలను వెంటనే చెల్లించాలని కోరారు.
నాలుగు రోజుల పాటు పాదయాత్ర
ఫ్యాక్టరీని పునరుద్ధరణ, చెరుకు సాగుపై రైతులకు భరోసా, కార్మికుల ఉద్యోగ భద్రత, బకాయి వేతనాలు చెల్లించాలనే ప్రధాన డిమాండ్లతో అఖిలపక్షం ఆధ్వర్యంలో గురువారం నుంచి నాలుగు రోజుల పాటు రైతు పాదయాత్ర నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి చెప్పారు. కోటగిరి మండలంలోని కొల్లూరులో ప్రారంభమయ్యే పాదయాత్ర బోధన్, రెంజల్, ఎడపల్లి మండలాల మీదుగా బోధన్‌కు చేరుకుంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టివిక్రమార్క, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పాదయాత్రలో పాల్గొంటారన్నారు. ఎంపీపీలు గంగాశంకర్, మోబిన్‌ఖాన్, రెంజల్ జెడ్పీటీసీ సభ్యుడు నాగభూషణంరెడ్డి, నేతలు రాంమోహన్, రమేశ్, గుణప్రసాద్, ఎల్లయ్య యాదవ్, అశోక్, ఎంపీటీసీలు శంకర్, సురేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement