టిప్పర్ల దూకుడు..
- ధ్వంసమవుతున్న విద్యుత్ స్తంభాలు
- తెగిపోతున్న తీగలు, కరెంట్ బంద్
- అన్నదాతల బెంబేలు
- తరచూ ఇలాంటి ఘటనలే..
వర్గల్: టిప్పర్ల దూకుడుతో అన్నదాతలు బెంబేలెత్తుతున్నారు. ఎప్పుడు ఏ విద్యుత్ స్తంభం నేలకూలుతుందోనని ఆందోళన చెందుతుందన్నారు. రోడ్డుకు ఓవైపు నుంచి రెండో వైపు వెల్తున్న కరెంట్ తీగలను (క్రాస్ లైన్) పట్టించుకోకుండా టిప్పర్ డ్రైవర్లు నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతున్నారు. దీంతో తీగలు తెగి, స్తంభాలు విరిగిపోతున్నాయి. వర్గల్ మండలంలో తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతుండడంతో, విద్యుత్ సరఫరా నిలిచిపోయి రైతులు తీవ్ర వేదనకు గురవుతున్నారు. కొంత కాలం నుంచి ఆర్‌అండ్‌బీ శాఖ పర్యవేక్షణలో మజీద్‌పల్లి–శాకారం రోడ్డు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ రోడ్డు మీద కంకర మిక్స్, మట్టి, మెటల్ తదితర సామగ్రి సరఫరా కోసం నిత్యం పెద్ద సంఖ్యలో టిప్పర్లు తిరుగుతున్నాయి.
ఈ రోడ్డు మార్గంలో అనేక చోట్ల విద్యుత్ లైన్ క్రాస్ అవుతుంది. అభివృద్ధి పనుల కారణంగా రోడ్డు ఎత్తు క్రమంగా పెరుగుతున్నది. దీంతో కరెంట్ తీగల ఎత్తు తగ్గుతున్నది. టిప్పర్లు, జేసీబీలు కానీ హెడ్రాలిక్‌తో ట్రాలీని పైకి లేపకుండా జాగ్రత్తగా వెలితే కరెంట్ తీగలు వాహనానికి తగిలే పరిస్థితి ఉండదు. 15 రోజుల క్రితం గిర్మాపూర్ సమీపంలో టిప్పర్ ఇలాంటి పరిస్థితిలోనే విద్యుత్ తీగలను తాకింది. తీగలు తెగిపోవడంతోపాటు ఎనిమిది విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. ట్రాన్స్‌ఫార్మర్ నేలకూలింది. ఈ ఘటన వల్ల ట్రాన్స్‌కోకు అనవసర నష్టం వాటిల్లడంతోపాటు, రెండు రోజులు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రైతుల బాధ పడలేక ట్రాన్స్‌కో అధికారులు యుద్ధప్రాతిపదికన స్తంభాలు పాతించారు. కరెంట్ తీగలు బిగించి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. ఈ ఘటన మరవక ముందే తాజాగా బుధవారం ఉదయం మరోసారి ఇలాంటి ఘటనే పునరావృతమైంది. మాదారం సమీపంలో వాహనం తాకిడికి కరెంట్ తీగలు తెగిపోగా, 11 విద్యుత్ స్తంభాలు ధ్వంసమయ్యాయి. మాదారం, గిర్మాపూర్ గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
నాట్లు ఆగిపోయాయి..
టిప్పర్ల కారణంగా విద్యుత్ స్తంభాలు విరిగిపోతున్నాయి. బుధవారం విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. కరెంట్ పోయింది. గురువారం దాకా రాదని అధికారులు చెబుతున్నారు. కరెంట్ లేకపోతె నీళ్లు రావు. దీంతో నాట్లు ఆగిపోయాయి.
– అంకని స్వామి, మాదారం, రైతు
నిర్లక్ష్యంగా నడపడం వల్లే..
రోడ్డు పనులు జరుగుతున్నప్పుడు ఎత్తులో తేడాలు వస్తాయి. రోడ్డు ఎత్తు పెరగడం వల్ల క్రాసింగ్ విద్యుత్ లైన్లు కిందికి దిగుతాయి. టిప్పర్లు, జేసీబీలు మామూలుగా వెళ్తే కరెంట్ తీగలు తగలవు. హైడ్రాలిక్‌తో ట్రాలీని పైకి లేపి ముందుకెళ్లిన సందర్భాల్లో తీగలు తాకి, స్తంభాలు విరిగిపోతాయి. పక్షం రోజుల్లో రెండుసార్లు 19 వరకు విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. తీగలు చూసుకోకుండా నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్లే ఇలా జరుగుతుంది.
– రామ్‌నర్సయ్య, ట్రాన్స్‌కో, లైన్‌ఇన్‌స్పెక్టర్