
తిరుమల ఘాట్‌లో చైన్ లింక్ కంచె నిర్మాణం
సాక్షి, తిరుమల: తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ రోడ్డులో రాళ్లు కూలే ప్రాంతం పరిస్థితులపై టీటీడీ దృష్టి సారించింది. ఇందులో భాగంగా బ్రహ్మోత్సవాలు, ప్రధాని పర్యటన ముగిసిన మరుసటి రోజే ఆయా ప్రాంతాల్లో కొత్తగా చైన్‌లింక్ కంచె నిర్మాణం పనులు చేపట్టింది. ఇక్కడి 16వ కిలోమీటరు ప్రాంతంలో శిథిలావస్థకు చేరిన ఇనుప కంచెను టీటీడీ ఇంజినీరింగ్ అధికారులు తొలగించారు. కొత్త చైన్‌లింక్ కంచె నిర్మించే పనులు శనివారం చేపట్టారు. ఇదే తరహాలోనే పలు ప్రాంతాల్లో శిథిలావస్థకు చేరిన పాత కంచెల్ని తొలగించి కొత్తవి నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.