లక్ష్యాన్ని చేరుకోవాలి
లక్ష్యాన్ని చేరుకోవాలి
Published Tue, Jul 26 2016 12:19 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
రాంనగర్: తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాకు కేటాయించిన లక్ష్యాన్ని చేరుకోవాలని ఇన్‌చార్జి జిల్లా కలెక్టర్ డాక్టర్ యన్.సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ఉన్నందున జిల్లాలో ఇప్పటి వరకు హరితహారం కింద నాటిన మొక్కల పూర్తి వివరాలతో హాజరుకావాలని అధికారులకు సూచించారు. నాటిన ప్రతి మొక్క వివరాలను పూర్తిస్థాయిలో క్రోడీకరించి సేకరించాలని నియోజకవర్గ ఇన్‌చార్జి అధికారులను కోరారు. 65వ జాతీయ రహదారి వెంట నాటిన ప్రతి మొక్కకు 30 ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి మొక్కలను సంరక్షిస్తున్నట్లు వివరించారు. వర్షాలుపడని చోటట్యాంకర్లను ఉపయోగించి నీటిని సరఫరా చేసి మొక్కలను కాపాడాలని సూచించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి హరితహారం కార్యక్రమ అమలు జరుగుతున్న విధానంపై ఆకస్మిక తనిఖీలు చేస్తారని తెలిపారు. అధికారులు అప్రమత్తతో పనిచేసి జిల్లాకు కేటాయించిన లక్ష్యాన్ని పూర్తి చేయడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కొన్ని శాఖల్లో ఇంకా మందకొడిగా పనులు నడుస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినందున వెంటనే సంబంధిత శాఖల అధికారులు పనులు వేగవంతంగా చేయడానికి కృషి చేయాలని సూచించారు. ఇప్పటివరకు నాటిన ప్రతి మొక్కను సంరంక్షించడానికి ఫెన్సింగ్ 15 శాతం మాత్రం జరిగిందని, మిగతా పనులు వేగవంతం చేసి ఫెన్సింగ్‌ను ప్రతి మొక్కకు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో ఏజేసీ వెంకట్రావు, డీఆర్వో రవి, పులిచింతల స్పెషల్ కలెక్టర్ నిరంజన్, డ్వామా పీ.డీ. దామోదర్‌రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement