ఆసరా కు పెద్ద దెబ్బ! | To cancel the effect of the notes was on the social pension beneficiaries. | Sakshi
Sakshi News home page

ఆసరా కు పెద్ద దెబ్బ!

Published Thu, Dec 29 2016 1:40 AM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM

ఆసరా కు పెద్ద దెబ్బ! - Sakshi

ఆసరా కు పెద్ద దెబ్బ!

డబ్బులు  మంజూరైనా చేతికందని పరిస్థితి
రెండు నెలలుగా   అవస్థలు
ఆందోళనలు, ధర్నాలు,  రాస్తారోకో చేస్తున్న వృద్ధులు, వికలాంగులు


ఇందూరు :కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రూ.1000, రూ.500 నోట్ల రద్దు  ప్రభావం సామాజిక పింఛన్‌(ఆసరా) లబ్ధిదారులపై పడింది. కొత్త నోట్లు తగినన్ని ముద్రించక పోవడంతో నగదు కొరత ఏర్పడింది. దీంతో జిల్లాలోని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఎయిడ్స్‌ బాధితులు, చేనేత, కల్లు గీత కార్మికులతోపాటు బీడీ కార్మికులు రెండు నెలలుగా పింఛన్‌ రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ప్రతినెల మంజూరు చేసే పెన్షన్‌ డబ్బులు నవంబర్, డిసెంబర్‌ నెలలకు సంబంధించి మంజూరు చేసింది. ఈ డబ్బులు ఆన్‌లైన్‌లో రావడంతో బ్యాంకు అధికారులు వాటిని    నగదు రూపంలోకి మార్చి పట్టణ ప్రాంతాల్లోని బ్యాంకుల్లోకి, గ్రామీణ  ప్రాంతాల్లోని పోస్టాఫీసులకు పంపాలి. కానీ.. నగదు లభ్యత లేకపోవడంతో బ్యాంకులకు డబ్బులు పంపలేదు.

నగదు కొరత.. చేతులెత్తేసిన అధికారులు
జిల్లాలో సామాజిక భద్రత పింఛన్‌దారులు 2,27,568 మంది ఉన్నారు. ఇందులో వృద్ధులు 63,256, వితంతులు 66,429, వికలాంగులు 18,974, చేనేత 206, గీత కార్మికులు 1005 మంది. వీరితో పాటు 1,773 మంది ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులు, 77,428 మంది బీడీ కార్మికులు ఉన్నారు. వీరికి ప్రభుత్వం ప్రతినెలాS 18 నుంచి 26 వరకు గ్రామీణ ప్రాంతాల వారికి పోస్టాఫీసుల్లో, పట్టణ ప్రాంతాల వారికి బ్యాంకుల ద్వారా డబ్బు అందించాలి. కానీ, నగదు కొరతతో ఈసారి సమస్య వచ్చింది. అక్టోబర్‌లో కొందరు పింఛన్‌లు పొంద గా.. ఇంకా రూ.12 కోట్లు పంపిణీ చేయాల్సి ఉంది. ఈ రూ.12 కోట్లు,  డిసెంబర్‌ నెలలో రావాల్సిన పింఛన్‌ డబ్బులు కలుపుకుని రూ.36.41 కోట్లను సర్కారు ఈ నెల 17న  మంజూరు చేసింది. వీటిని గ్రామీణ ప్రాంతాల్లోని 1,90,842 మంది లబ్ధిదారులకు రూ.32.53 కోట్లను పోస్టాఫీసుల ద్వారా పంపిణీ చేయాలి. పట్టణ ప్రాంతాల్లోని 36,726 మంది లబ్ధిదారులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయాలి. కానీ.. ఆర్మూర్, నిజామాబాద్‌ ఎస్‌బీహెచ్‌ వారు పోస్టాఫీసులకు సరిపడా డబ్బులు పంపడం లేదు. పట్టణ ప్రాంత లబ్ధిదారులు కూడా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.

వృద్ధులు, వికలాంగులు గంటల తరబడి నిలబడి పెన్షన్‌ డబ్బులు పొందుతున్నారు. జిల్లాకు రూ.36.41 కోట్ల పెన్షన్‌ డబ్బులు నగదు రూపంలో బ్యాంకర్లు ఇవ్వాల్సి ఉండగా.. కేవలం రూ.4 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నాయి. దీనిపై కలెక్టర్‌ యోగితారాణా, జేసీ రవీందర్‌రెడ్డి, డీఆర్‌డీవో వెంకటేశ్వర్లు కలిసి బ్యాంకు అధికారులను సంప్రదించగా, ఆర్‌బీఐ నుంచి సరిపడా నగదు రాలేదని, అందుకే డబ్బులు ఇవ్వలేకపోతున్నామని స్పష్టం చేశారు. దీంతో జిల్లా ఉన్నతాధికారులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు.

పెరుగుతున్న ఆందోళనలు..
పోస్టాఫీసుల్లో, బ్యాంకుల్లో నగదు కొరతతో లబ్ధిదారులకు డబ్బులు అందక పోవడంతో ఆందోళనకు దిగుతున్నారు. డబ్బుల కోసం నిరీక్షించి, సహనం నశించి రాస్తారోకోలు చేస్తున్నారు. బ్యాంకు, పోస్టాఫీసు అధికారులను నిలదీస్తున్నారు. వారం రోజులుగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. బీడీ కార్మికులు తమకు నగదు రూపంలోనే బీడీ పెన్షన్‌ ఇవ్వాలని ధర్నాలు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం డిచ్‌పల్లి, ఎడపల్లి, నిజాంసాగర్‌ ఎంపీడీవో కార్యాలయాల ఎదుట వృద్ధులు, వికలాంగులు ఆందోళన చేపట్టారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఆందోళనలు అధికమయ్యే అవకాశం ఉంది. సర్కారు ప్రత్యామ్నాయం చూపాల్సిన అవసరం ఉంది.

వేరే ఆధారం లేదు..
రెండు నెలలుగా పెన్షన్‌ రావట్లేదు. పోస్టాఫీసు వద్దకు వెళ్లి అడిగితే.. బ్యాంకుS నుంచి డబ్బులు రాలేదని చెప్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్‌ డబ్బులే నా కుటుంబానికి ఆసరా. సరుకులు కొనుక్కోవడానికి డబ్బు లేక ఉద్దెర తెచ్చుకుంటున్నా.
– సాయిలు, వికలాంగుడు, నందిపేట్‌

ఇంటికి సగం ఆసరా..
ఇంటికి పెద్ద దిక్కు అయిన భర్త లేకపోవడంతో కుటుంబ పరిస్థితి ఆర్థికంగా ఇబ్బందిగా మారింది. అయితే ప్రభుత్వం ఇచ్చే వితంతు పెన్షన్‌ ఇంటిని సగం ఆసరాగా ఉండేది. ప్రస్తుతం రెండు నెలలుగా పోస్టాఫీసు వద్ద డబ్బులు లేవని పెన్షన్‌ ఇవ్వడం లేదు. నిత్యవసర సరుకులు కొనుక్కోలేక ఉన్నంతలో సర్దుకుంటున్నాం.    – సువర్ణ, వింతంతువు, నందిపేట్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement