చావుకు కారణం... చదువు కాకూడదు
జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం
కార్పొరేట్ విద్యలో మార్పురావాలి
సిద్దిపేట జోన్: చావుకు చదువు కారణం కాకూడదని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరాం అన్నారు. గురువారం మెదక్ జిల్లా సిద్దిపేటలో మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సీసీసీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘బాల ప్రతిభ మేళా-2015’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో చదువు లక్ష్యంగా ఆత్మహత్యలు జరగడం బాధాకరమన్నారు. విద్యార్థులు అర్ధంతరంగా చదువును మానేసే కారణాలపై ప్రభుత్వాలు దృష్టి సారించాలన్నారు. ప్రైవేట్ విద్యావ్యవస్థలో విపరీతమైన ఫీజలు ఉన్నాయని, వాటి భయంతో చాలామంది చదువుకు దూరమవుతున్నారని పేర్కొన్నారు. ఆర్థికస్థోమత లేక మరికొందరు చదువును వదులుకోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో బాలోత్సవ్ పేరిట ఉత్సవాలు జరపడం పరోక్షంగా బాలలకు ప్రోత్సాహం అందించినట్టు అయిందని పేర్కొన్నారు. కార్పొరేట్ సంస్థల్లో విద్యార్థులకు ఆటపాటలు కూడా అందించాలని సూచించారు. జాతీయ ఆహార భద్రత సలహదారురాలు ప్రొఫెసర్ రమా మెల్కొటే మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆకాం క్షించారు. నంది అవార్డు గ్రహీత నందిని సిధారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులో దాగి ఉన్న నైపుణ్యా న్ని ప్రోత్సహించాలన్నారు. డాక్టర్ పాపయ్య మాట్లాడుతూ బాల ప్రతిభమేళా ఏటా సిద్దిపేటలో నిర్వహించి బాలలను ప్రోత్సహించడం అభినందనీయమని పేర్కొన్నారు.