Professor kodhandram
-
అభివృద్ధి జరగాలంటే పోరాటాలుండాల్సిందే
రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొ. కోదండరాం మెదక్ టౌన్: రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పోరాటాలు జరగాల్సిందేనని రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ‘తెలంగాణ పునర్నిర్మాణం - ఉపాధ్యాయుల పాత్ర’ అనే అంశంపై ఆదివారం మెదక్ పట్టణంలోని క్రిస్టల్ గార్డెన్స్‌లో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సామాజిక న్యాయంతో కూడిన అభివృద్ధి జరగాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వివక్షకు, దోపిడీకి గురికావడం వల్లే తెలంగాణ ఉద్యమం జరిగిందన్నారు. ప్రజాసంఘాల వేదికగానే ఉద్యమం జరిగిందని, తెలంగాణ పునర్నిర్మాణంలోనూ ప్రజా సంఘాల ఐక్యత అవసరమని పేర్కొన్నారు. సామాజిక బాధ్యతను తెలిపే సదస్సులను టీచర్లు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యా, వైద్య, వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రజలకు కనీస వసతులు అందేలా అందరూ కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడేందుకు చిన్న పరిశ్రమలు పెద్దఎత్తున రావాల్సిన అవసరం ఉందన్నారు. సదస్సులో టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కొండల్‌రెడ్డి, మనోహర్ రాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు తిరుపతిరెడ్డి, కార్యదర్శి అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
చావుకు కారణం... చదువు కాకూడదు
జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కార్పొరేట్ విద్యలో మార్పురావాలి సిద్దిపేట జోన్: చావుకు చదువు కారణం కాకూడదని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరాం అన్నారు. గురువారం మెదక్ జిల్లా సిద్దిపేటలో మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సీసీసీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘బాల ప్రతిభ మేళా-2015’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో చదువు లక్ష్యంగా ఆత్మహత్యలు జరగడం బాధాకరమన్నారు. విద్యార్థులు అర్ధంతరంగా చదువును మానేసే కారణాలపై ప్రభుత్వాలు దృష్టి సారించాలన్నారు. ప్రైవేట్ విద్యావ్యవస్థలో విపరీతమైన ఫీజలు ఉన్నాయని, వాటి భయంతో చాలామంది చదువుకు దూరమవుతున్నారని పేర్కొన్నారు. ఆర్థికస్థోమత లేక మరికొందరు చదువును వదులుకోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో బాలోత్సవ్ పేరిట ఉత్సవాలు జరపడం పరోక్షంగా బాలలకు ప్రోత్సాహం అందించినట్టు అయిందని పేర్కొన్నారు. కార్పొరేట్ సంస్థల్లో విద్యార్థులకు ఆటపాటలు కూడా అందించాలని సూచించారు. జాతీయ ఆహార భద్రత సలహదారురాలు ప్రొఫెసర్ రమా మెల్కొటే మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆకాం క్షించారు. నంది అవార్డు గ్రహీత నందిని సిధారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులో దాగి ఉన్న నైపుణ్యా న్ని ప్రోత్సహించాలన్నారు. డాక్టర్ పాపయ్య మాట్లాడుతూ బాల ప్రతిభమేళా ఏటా సిద్దిపేటలో నిర్వహించి బాలలను ప్రోత్సహించడం అభినందనీయమని పేర్కొన్నారు. -
కోదండరాం ఉద్యోగ విరమణ
ఘనంగా సత్కరించిన సికింద్రాబాద్ పీజీ కళాశాల విద్యార్థులు సాక్షి, హైదరాబాద్ : ప్రొఫెసర్ కోదండరాం బుధవారం పదవీ విరమణ చేశారు. 34 ఏళ్లపాటు విద్యార్థులు, తరగతి గదితో ఆయనకు ఉన్న బంధానికి తెరపడింది. 1981లో లెక్చరర్‌గా మొదలైన ఆయన ప్రస్థానం... ప్రొఫెసర్‌గా ముగిసింది. పౌర హక్కుల నేతగా, ప్రొఫెసర్‌గా, తెలంగాణ ఉద్యమంలో దిశానిర్దేశకులుగా.. ఆయన పోషించిన పాత్ర ఉన్నతమైనది. తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌గా ఆయన కోట్లాది గుండెల్లో ఉద్యమ జ్వాలను రగిల్చారు. నిన్నటి వరకు సికింద్రాబాద్ పీజీ కాలేజ్‌లో బోధించిన ఆయన.. ఇకపై ప్రజల్లో తిరగనున్నారు. బుధవారం సికింద్రాబాద్ పీజీ కళాశాలలో పొలిటికల్ సైన్స్ విభాగం అధ్వర్యంలో కోదండరాం ఆత్మీయ పదవీ విరమణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు పూలు జల్లుతూ కోదండరాంను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పెరిగిన రైతు ఆత్మహత్యలు, నిరుద్యోగం తదితర సమస్యలపై దృష్టి సారించేందుకు తనకు పూర్తి సమయం లభించిందని.. సంపూర్ణ తెలంగాణ సాధన కోసం కృషి చేస్తానని అన్నారు. 34 సంవత్సరాల ప్రొఫెసర్ పదవి తనకు పూర్తిగా సంతృప్తినిచ్చిందని పద వీ విరమణ పొందడం బాధాకరంగా ఉందని అన్నారు. అనంతరం కళాశాల ప్రొఫెసర్లు, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు కొదండరాంను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ లాలయ్య. కళాశాల ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఉద్యమకారులను గెలిపించండి
టీజేఏసీ పిలుపు ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతివ్వకుండా తటస్థంగా ఉండాలని నిర్ణయం హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో త్యాగాలు చేసిన వారినే ఈ ఎన్నికల్లో గెలిపించాలని తెలంగాణ జేఏసీ పిలుపునిచ్చింది. ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన శుక్రవారం తెలంగాణ జేఏసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఉద్యమకారులకు మద్దతుగా నిలవాలని, తెలంగాణ వ్యతిరేక పార్టీలను ఓడించాలని ఈ సందర్భంగా తీర్మానించారు. ఇక తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వాలా లేక ఉద్యమ పార్టీ టీఆర్ఎస్కు మద్దతివ్వాలా? అన్న దానిపై జేఏసీలో తీవ్ర చర్చ జరిగింది. ఇప్పటిదాకా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న పార్టీలకు మద్దతివ్వకుండా.. తటస్థంగా వ్యవహరించడం సరికాదని కొందరు నేతలు అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌కు మద్దతిస్తామని ఏఐసీసీ ముఖ్యులతోనూ, రాష్ట్ర కాంగ్రెస్ నేతలతోనూ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ పార్టీకి తెలంగాణలో అండగా ఉండాల్సిన బాధ్యత జేఏసీపై ఉందని వాదించారు. అయితే మరికొందరు మాత్రం టీఆర్ఎస్తోనే తెలంగాణ ఉద్యమ గొంతుకు బలం చేకూరిందని వాదించారు. టీఆర్ఎస్ అండగా ఉండటం వల్లనే అనేక ఉద్యమ కార్యక్రమాల్లో ఉద్యోగ సంఘాలు, ఇతర సంఘాలు క్రియాశీలంగా వ్యవహరించాయని గుర్తుచేశారు. బీజేపీ, న్యూ డెమోక్రసీ, టీఆర్ఎస్లు మాత్రమే జేఏసీలో ఉన్నాయని, మిగిలిన పార్టీలకు మద్దతివ్వాలన్న చర్చ ఎలా వస్తుందని వారు ప్రశ్నించారు. టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోవడంతోనే పవిత్రతను కోల్పోయిందని అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్లో చేరిన కొండా సురేఖ, మహేందర్ రెడ్డి వంటివారి గురించే ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్‌లో సమైక్యవాదానికి అనుకూలంగా వ్యహరించిన పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్‌బాబు వంటి నేతల గురించి ఎందుకు చర్చించడం లేదన్న ప్రస్తావన కూడా వచ్చింది. ఏ పార్టీకి మద్దతివ్వాలన్న విషయంలో జేఏసీ నేతల మధ్య విభజన వచ్చే అవకాశాలున్నాయనే ఆందోళన కూడా ఒక దశలో వ్యక్తమైంది. చివరకు తటస్థంగా ఉంటేనే జేఏసీ మనుగడకు మంచిదనే అభిప్రాయానికి వచ్చారు. భేటీ అనంతరం కోదండరాం మీడియాతో మాట్లాడారు. ఉద్యమం ద్వారా తెలంగాణ ప్రజల్లో రాజకీయ చైతన్యం పెరిగిందని, ఉద్యమకారులెవరో, తెలంగాణకు వ్యతిరేకంగా ఎవరు పనిచేశారో కూడా ప్రజలకు అర్థమైందని కోదండరాం పేర్కొన్నారు. ఉద్యమంలో త్యాగాలు చేసినవారిని గెలిపించాలని పిలుపునిచ్చారు. తెలంగాణను అడ్డుకోవడానికి ప్రయత్నించిన టీడీపీ, వైఎస్సార్ సీపీలను తెలంగాణలో తిరస్కరించాలన్నారు. జేఏసీలో చేరడానికి వివిధ సంఘాలు ఆసక్తి చూపిస్తున్నాయని, అలాగే జేఏసీ నియమ నిబంధనలు తదితర అంశాలపై చర్చలు జరుగుతున్నాయన్నారు. నిర్మాణ కమిటీ ప్రతిపాదనలను బట్టి తగిన చర్యలు తీసుకుంటామని కోదండరాం వెల్లడించారు. ఈ సమావేశంలో జేఏసీ కన్వీనర్ దేవీప్రసాద్, కో చైర్మన్లు మల్లేపల్లి లక్ష్మయ్య, విఠల్, నేతలు రాజేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, రఘు, మణిపాల్ రెడ్డి, పిట్టల రవీందర్ పాల్గొన్నారు.