అభివృద్ధి జరగాలంటే పోరాటాలుండాల్సిందే
రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొ. కోదండరాం
మెదక్ టౌన్: రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పోరాటాలు జరగాల్సిందేనని రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ‘తెలంగాణ పునర్నిర్మాణం - ఉపాధ్యాయుల పాత్ర’ అనే అంశంపై ఆదివారం మెదక్ పట్టణంలోని క్రిస్టల్ గార్డెన్స్‌లో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సామాజిక న్యాయంతో కూడిన అభివృద్ధి జరగాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వివక్షకు, దోపిడీకి గురికావడం వల్లే తెలంగాణ ఉద్యమం జరిగిందన్నారు.
ప్రజాసంఘాల వేదికగానే ఉద్యమం జరిగిందని, తెలంగాణ పునర్నిర్మాణంలోనూ ప్రజా సంఘాల ఐక్యత అవసరమని పేర్కొన్నారు. సామాజిక బాధ్యతను తెలిపే సదస్సులను టీచర్లు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యా, వైద్య, వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రజలకు కనీస వసతులు అందేలా అందరూ కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడేందుకు చిన్న పరిశ్రమలు పెద్దఎత్తున రావాల్సిన అవసరం ఉందన్నారు. సదస్సులో టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కొండల్‌రెడ్డి, మనోహర్ రాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు తిరుపతిరెడ్డి, కార్యదర్శి అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.