కోదండరాం ఉద్యోగ విరమణ
ఘనంగా సత్కరించిన సికింద్రాబాద్ పీజీ కళాశాల విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్ : ప్రొఫెసర్ కోదండరాం బుధవారం పదవీ విరమణ చేశారు. 34 ఏళ్లపాటు విద్యార్థులు, తరగతి గదితో ఆయనకు ఉన్న బంధానికి తెరపడింది. 1981లో లెక్చరర్‌గా మొదలైన ఆయన ప్రస్థానం... ప్రొఫెసర్‌గా ముగిసింది. పౌర హక్కుల నేతగా, ప్రొఫెసర్‌గా, తెలంగాణ ఉద్యమంలో దిశానిర్దేశకులుగా.. ఆయన పోషించిన పాత్ర ఉన్నతమైనది. తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌గా ఆయన కోట్లాది గుండెల్లో ఉద్యమ జ్వాలను రగిల్చారు. నిన్నటి వరకు సికింద్రాబాద్ పీజీ కాలేజ్‌లో బోధించిన ఆయన.. ఇకపై ప్రజల్లో తిరగనున్నారు. బుధవారం సికింద్రాబాద్ పీజీ కళాశాలలో పొలిటికల్ సైన్స్ విభాగం అధ్వర్యంలో కోదండరాం ఆత్మీయ పదవీ విరమణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు పూలు జల్లుతూ కోదండరాంను ఘనంగా సన్మానించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పెరిగిన రైతు ఆత్మహత్యలు, నిరుద్యోగం తదితర సమస్యలపై దృష్టి సారించేందుకు తనకు పూర్తి సమయం లభించిందని.. సంపూర్ణ తెలంగాణ సాధన కోసం కృషి చేస్తానని అన్నారు. 34 సంవత్సరాల ప్రొఫెసర్ పదవి తనకు పూర్తిగా సంతృప్తినిచ్చిందని పద వీ విరమణ పొందడం బాధాకరంగా ఉందని అన్నారు. అనంతరం కళాశాల ప్రొఫెసర్లు, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు కొదండరాంను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ లాలయ్య. కళాశాల ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.