మానవ మృగం
బాలికలపై తండ్రికాని తండ్రి అఘాయిత్యం
తాజాగా వెలుగులోకి వచ్చిన దారుణం
భయంతో వణికిపోతున్న బాధితులు
ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో వైద్యపరీక్షలు
పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
అతడో మానవ మృగం... తండ్రిలా నటించే మేకవన్నె పులి. పగలు ప్రేమ ఒలకబోస్తూ అదును కోసం ఆరాటపడే పచ్చి దుర్మార్గుడు. కూతురు వరుసైన ఆడపిల్లలపై విరుచుకు పడి కోర్కెలు తీర్చుకున్న కీచకుడు. వావి వరుసలు విస్మరించి సభ్య సమాజం తలదించుకునేలా అత్యాచారానికి పాల్పడిన ఓ తండ్రి కాని తండ్రి వికృత చేష్టలివి. జరిగిన దారుణాన్ని తల్లికి చెప్పలేక భయంతో బిక్కుబిక్కుమంటోన్న బాలికలు రెండ్రోజుల కిందటే ధైర్యాన్ని కూడదీసుకుని అసలు సంగతి బయట పెట్టారు. దీంతో బిడ్డలతో తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఎక్కడో జరిగిన దారుణం కాదిది. తిరుపతి శివారు ప్రాంతంలోనే ఈ సంఘటన చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం...
తిరుపతి : తమిళనాడుకు చెందిన లక్ష్మి అనే మహిళ పదిహేనేళ్ల కిందట భర్తతో కలిసి తిరుపతి చేరుకుంది. ఈ దంపతులకు అప్పటికే ముగ్గురు సంతానం. పదేళ్ల కిందట గుండె జబ్బుతో భర్త కన్నుమూశాడు. దీంతో కుటుంబం ఆలనా పాలనా కష్టమైంది. ఆడపిల్లలను పెంచడం పూర్తిగా భారమైంది. ఈ నేపథ్యంలో నగరానికి చెందిన వంశీ అనే వ్యక్తితో పరిచయమైంది. పరిచయం కాస్తా చనువుగా మారడంతో ఇద్దరూ కలిసి ఏడేళ్ల నుంచి సహజీవనం సాగిస్తున్నారు. వీరికిద్దరు పిల్లలు. అయితే అడ్డమైన ఆలోచనలు కలిగిన వంశీ చూపులు మొదటి భర్తకు పుట్టిన ఆడపిల్లలపై పడింది. ఇటీవల తల్లి ఊరెళ్లిన సమయంలో పెద్దమ్మాయి(13)పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మూడు రోజుల పాటు మృగాడు కీచకుడిగా మారాడు. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజుల అనంతరం చిన్నమ్మాయి పైనా ఇదేవిధంగా పైశాచికం ప్రదర్శించాడు. దీంతో తండ్రి కాని తండ్రి కనిపిస్తే ఆడపిల్లలు చిగురుటాకులా వణికిపోవడం మొదలైంది.
ఇదేమీ తెలియని తల్లి ఈ మధ్య పిల్లలందరినీ వెంటబెట్టుకుని చంద్రగిరి మండలంలోని తన సొంతూరు వెళ్లింది. రెండు రోజుల తరువాత తిరుపతికి తిరుగు ప్రయాణమయ్యే క్రమంలో ఆడపిల్లలు మొండికేశారు. తిరుపతి రామని తేల్చి చెప్పారు. ఎందుకు రారని తల్లి నిలదీస్తే అసలు విషయాన్ని బయట పెట్టారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన తల్లి పిల్ల లను వెంటబెట్టుకుని మంగళవారం సాయంత్రం ఎమ్మార్‌పల్లి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు వంశీపై కేసు నమోదు చేసి వైద్య పరీక్షల కోసం బాలికలను ప్రభుత్వ మెటర్నిటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆస్పత్రిలో బాలికలకు వైద్యం అందుతోంది. వైద్యులిచ్చే రిపోర్టుల ఆధారంగా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.