ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయం
-
నేడు ఖమ్మం కార్పొరేషన్ పాలక మండలి సమావేశం
-
గతంలో రెండుసార్లు ప్రజా సమస్యలపై జరగని చర్చ
– ఖమ్మం –
నగర అభివృద్ధిపై చర్చ జరగాలని, ప్రజా సమస్యలపై మాట్లాడాలని, నిధుల కేటాయింపుపై గళం విప్పాలని నగర వాసులు కోరుకుంటున్నా..పాలకమండలి సమావేశాలు నిరుత్సాహ పరుస్తున్నాయి. కార్పొరేటర్లు ఏమీ మాట్లాడకుండానే రెండుసార్లు ముగిశాయి. ముచ్చటగా మూడోసారి..జరగబోతున్న ఈ సభలోనైనా ప్రజా ఉపయోగ అంశాలపై మాట్లాడతారా..? లేదా..? అనే మీమాంస నెలకొంది.
తొలి సమావేశం ప్రమాణ స్వీకారానికి, మలి సమావేశం కోఆప్షన్ సభ్యుల ఎన్నికకే పరిమిత చేయాల్సి వచ్చింది. ఒకసారి పాలేరు ఉప ఎన్నికల కోడ్, మరోసారి మరో కారణంతో ఈ సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చ జరగలేదు. కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి బదిలీ కావడంతో..జాప్యమైంది. ఈ క్రమంలో మంగళవారం కౌన్సిల్æసమావేశం కానుంది. ప్రతిపక్ష కౌన్సిలర్లు ప్రజా సమస్యలపై తీవ్రంగానే మాట్లాడతారనే అంచనా ఉంది.
నగరం నడిబొడ్డు నుంచి వెళ్లే గోళ్లపాడు చానల్ అధ్వానంగా మారి..మురుగు సమస్య పీడిస్తోంది. ఖమ్మం రూరల్ మండలం గోళ్లపాడు నుంచి వచ్చే కాల్వ ఖమ్మం సారధినగర్, జూబ్లీక్లబ్, కాల్వొడ్డు, గాంధీచౌక్ మీదుగా సుందరయ్యనగర్, శ్రీనివాస నగర్ వరకు దాదాపు నాలుగు కిలో మీటర్ల దూరం వరకు ఉన్న ఈ కాల్వ చుట్టు ప్రాంతాలు మురికి కూపంగా మారాయి. నిరుపేదలు, కార్మికులు ఈ కాల్వ చుట్టూ జీవిస్తున్నారు. అపరిశుభ్రత..దోమల సమస్యతో స్థానికులు అవస్థ పడుతున్నారు.
-
విలీన గ్రామాలు..తీరని కష్టాలు
ఖమ్మం రూరల్, ఖమ్మం అర్బన్ మండలాల నుంచి కార్పొరేషన్‌లో విలీనమైన గ్రామాల్లో అభివృద్ధి జరగడం లేదు. కైకొండాయిగూడెం, బల్లేపల్లి, ఖానాపురం, పుట్టకోట, గొల్లగూడెం, కొత్తగూడెం, అల్లీపురం, ధంసలాపురం గ్రామాల్లో అంతర్గత రోడ్ల నిర్మాణాలు చేపట్టలేదు. తాగునీటి ఇబ్బందులు వీడలేదు. డ్రెయినేజీ వ్యవస్థ తీవ్రంగా ఉంది. నగరంలోని బీసీ కాలనీ, వైఎస్సార్ కాలనీ, రమణగుట్ట, వికలాంగుల కాలనీ, శ్రీనివాసనగర్ ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు సక్రమంగా లేవు.
-
డ్రెయిన్లు అధ్వానం..పట్టింపు శూన్యం
కార్పొరేషన్ పరిధిలో చాలా చోట్ల డ్రెయినేజీ సమస్యలు పీడిస్తున్నాయి. మొత్తం 345 కిలోమీటర్ల మేరకు సైడ్ కాల్వలు ఉండగా 100 కిలోమీటర్ల డ్రెయిన్లు దెబ్బతిని శిథిలావస్థకు చేరాయి. పెద్ద కాల్వల్లో అసలు పూడికనే తీయడం లేదు. పిచ్చిచెట్లు పెరిగాయి. పారిశుద్ధ్య కార్మికులు 580 మంది ఉండగా..వంద మందికి పైగా అధికారులు, నాయకులు, కార్పొరేటర్లు ఇళ్లల్లోనే పనిచేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మిగిలిన వారిలో అటెన్‌డెన్స్ వేయించుకుని వెళ్లేవారు పోగా..పనిచేసేవారు తక్కువవుతున్నారు.