kmm
-
పంచ‘బడి’ంది
పాఠశాలలు, ఉపాధ్యాయుల విభజన మూడు జిల్లాల్లోకి పాఠశాలలు కసరత్తు ప్రారంభించిన అధికారులు ఖమ్మం: జిల్లాల పునర్విభజనలో భాగంగా ప్రభుత్వ, ఎయిడెడ్, జిల్లా పరిషత్ పాఠశాలలు, ఆయా స్కూల్స్‌లో పనిచేసే ఉపాధ్యాయుల పంపకాలపై జిల్లా విద్యాశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఏ జిల్లాకు ఎన్ని పాఠశాలలు, ఎంతమంది ఉపాధ్యాయులను కేటాయించాలనే దానిపై అధికారులు లెక్కలు వేస్తున్నారు. కొత్తగూడెం జిల్లాలోకి 18 మండలాలు, 22 మండలాలతో ఖమ్మం, గార్ల, బయ్యారం మండలాలు మహబూబాబాద్ జిల్లాలోకి వెళ్తున్నాయి. జిల్లాలో ప్రస్తుతం 2,319 ప్రాథమిక పాఠశాలలు, 627 ప్రాథమికోన్నత, 625 ఉన్నత పాఠశాలలు, 15 హయ్యర్ సెకండరీ స్కూల్స్ (హెచ్ఎస్ఎస్), జూనియర్ కళాశాలలు (జేసీ) 141 మొత్తం 3,797 ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్నాయి. ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఆశ్రమ పాఠశాలల్లో 11,352 మంది ఉపాధ్యాయులు వివిధ కేటగిరీల్లో పనిచేస్తున్నారు. పాఠశాలల విభజన ఇలా.. –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– జిల్లా పీఎస్ యూపీఎస్ హెచ్ఎస్ హెచ్ఎస్ఎస్ జేసీ మొత్తం ––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– ఖమ్మం 954 313 381 09 71 1,728 కొత్తగూడెం 1239 288 280 6 60 1,873 మహ–బాద్ 126 26 34 0 10 196 –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– మొత్తం 2,319 627 695 15 141 3,797 ––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– ఉపాధ్యాయుల విభజన ఇలా.. –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– జిల్లా ఉపాధ్యాయులు ఖమ్మం 5,573 కొత్తగూడెం 5,355 మహబూబాబాద్ 424 ––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– ఎలా పంచాలి? జిల్లాలోని పాఠశాలలు ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్ పరిధిలోకి వెళ్లడంతో అక్కడి ఉపాధ్యాయులను ఏవిధంగా కేటాయించాలి అనేదానిపై అధికారులు ఉన్నతాధికారుల ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. ‘స్థానికత ఆధారంగా ఏ మండలం వాసిని అక్కడికే పంపిస్తే బాగుంటుంది’ అని పలువురు అధికారులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘ఏనాడో ఊరు విడిచి వచ్చి ఖమ్మం, కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాం.. ఇప్పుడు తిరిగి సొంత మండలాలకు వెళ్లాలి’ అని అనడం సరికాదని పలువురు ఉపాధ్యాయులు వాదిస్తున్నారు. ‘ఉద్యోగరీత్యా జిల్లా ఉమ్మడిగా ఉన్నప్పుడు వచ్చాం..ఇప్పుడు విభజనైతే మా పిల్లల స్థానికత మారుతుంది. కాబట్టి స్థానికతను మార్చొద్దు..’ అని పలువురు ఉపాధ్యాయులంటున్నారు. అత్యధిక మంది ఉపాధ్యాయులు ఖమ్మం, కొత్తగూడెం ప్రాంతాల్లోనే ఉంటున్న దృష్ట్యా వారు ఆయా ప్రదేశాల్లోనే తమను ఉంచాలని కోరుతున్నారు. బోధనేతర సిబ్బందికీ గండం ఉపాధ్యాయులే కాదు విద్యాశాఖలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికీ విభజన గండం తప్పడం లేదు. జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం, రాజీవ్ మాధ్యమిక విద్యామిషన్, సర్వశిక్ష అభియాన్, మోడల్ స్కూల్స్, డిప్యూటీ డీఈఓ కార్యాలయం, పలు పాఠశాలల్లో సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు మొత్తం 200 మందికి పైగా ఉన్నారు. వీరిని సీనియార్టీ ప్రాతిపదికన జిల్లాలకు కేటాయిస్తారనే వార్త రావడంతో ఉద్యోగ సంఘాల నాయకులు జిల్లా విద్యాశాఖ అధికారికి వినతిపత్రం అందచేశారు. ఉద్యోగులకు ఆప్షన్ ఇచ్చి జిల్లాల కేటాయింపులు జరపాలని కోరుతున్నారు. ఆప్షన్ ఇస్తే అత్యధిక మంది ఖమ్మం జిల్లానే కోరుకుంటే కొత్తగూడెం, మహబూబాద్ జిల్లాలకు ఎవరిని పంపాలని అధికారులు అంటున్నారు. తమను వేరే ప్రాంతాలకు పంపిస్తే వచ్చే కొద్దిపాటి వేతనాలతో ఎలా కుటుంబాలను పోషించాలని ఔట్సోర్సింగ్ ఉద్యోగులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో విభజన నిబంధనలు ఎలా ఉండబోతున్నాయి? ఎవరు ఎటువెళ్లాల్సి వస్తుందనే విషయంలో ఆందోళన నెలకొంది. -
డైట్లో అధ్యాపకుల కుదింపు
డిప్యూటేషన్ ఉపాధ్యాయులు తిరిగి పాఠశాలలకు.. రిటైర్డ్ ఉపాధ్యాయులతో ఖాళీల భర్తీ ప్రమాణాలపై విద్యార్థుల ఆందోళన ఖమ్మం : జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ సంస్థ(డైట్)లో అధ్యాపకుల సంఖ్యను కుదించారు. డైట్ విద్యార్థులకు బోధ న జరుపుతూనే, ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ ఇవ్వ డం, ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానాలు, ఇత ర అంశాలపై ప్రచారం చేసే డైట్ అధ్యాపకుల సంఖ్య మూడో వంతుకు తగ్గించారు. 25 మంది నుంచి 8 మందికి కుదించా రు. డిప్యూటేషన్‌పై డైట్ కళాశాలలో పనిచేస్తున్న ముగ్గు రు ఉపాధ్యాయులను వారి వారి పాఠశాలలకు పంపించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఖాళీ లను రిటైర్డ్ ఉపాధ్యాయులతో భర్తీ చేయాలని ఉత్తర్వుల్లో పే ర్కొన్నారు. ఇప్పటికే ఖాళీలతో నెట్టుకొస్తున్న డైట్ బోధన, ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విద్యాప్రమాణా లు, ఛాత్రోపాధ్యాయుల భవిష్యత్‌పై ప్రభావం చూపనుంది. 25 నుంచి 8కి.. 200 మంది విద్యార్థులు చదివే జిల్లా డైట్ కళాశాలలో 24 మంది అధ్యాపకులు, ఒక ప్రిన్సిపాల్‌తో కలిపి మొత్తం25 మంది ఉండేవారు. వీరిలో 17 మంది అధ్యాపకులు, ఏడుగురు సీనియర్ అధ్యాపకులు, ఒక ప్రిన్సిపాల్ ఉండేవారు. పలువురు అధ్యాపకులు ఇతర జిల్లాల్లోని డైట్ కళాశాలలకు బదిలీ కావడం, మరికొందరు పదవీ విరమణ పొందడంలో రోజు రోజుకు అధ్యాపకుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లిష్ అధ్యాపకులు, ప్రిన్సిపాల్ మాత్రమే రెగ్యులర్ ఉద్యోగులు. మిగిలిన పోస్టుల్లో పీజీ ఎంఈడీ చేసిన ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై రప్పించి పనిచేయిస్తున్నారు. తెలుగు, సోషల్, ఫౌండేషన్ కోర్సు( సైకాలజీ, ఫిలాసఫీ), ఆర్డ్ ఎడ్యుకేషన్, పీఈటీ అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీల్లో రిటైర్డ్ ఉపాధ్యాయులను కాంట్రాక్ట్ పద్ధతిన నియమించి రూ. 18 వేల వేతనం, ఆర్ట్ టీచర్, పీఈటీలకు రూ. 7 వేల మేరకు వేతనాలు చెల్లించనున్నారు. ప్రమాణాలపై ప్రభావం.. అధ్యాపకుల కుదింపుతో ప్రమాణాలు పడిపోయే ప్రమాదం ఉందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రథమ సంవత్సరంలో 100, ద్వితీయ సంవత్సరంలో 100 మొత్తం 200 మంది విద్యార్థులు చదివే కళాశాలలో కేవలం 8 మంది అధ్యాపకులను నియమిస్తే ఎలా..? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థుల స్కూల్ అబ్జర్వేషన్, టీచింగ్ ప్రాక్టీస్ పర్యవేక్షణ, ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారనేది ప్రశ్నార్థకంగా మారిం ది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ప్రభు త్వ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించి డైట్ లెక్చరర్స్‌గా నియమించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. -
ఆటల వేడుక
ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం స్వర్గీయ ధ్యాన్‌చంద్‌కు నివాళి స్ఫూర్తి ప్రదాత: డీఎస్డీఓ కబీర్దాస్ ఖమ్మం స్పోర్ట్స్: హాకీ మాంత్రికుడు స్వర్గీయ ధ్యాన్‌చంద్ జయంతి ఉత్సవాలను ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఘనంగా జరిపారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించారు. అథ్లెటిక్స్, వాలీబాల్, జిమ్నాస్టిక్స్, ఫుట్‌బాల్ తదితర క్రీడాంశాల్లో ఈ పోటీలు జరిగాయి. దాదాపు ఐదు ఒలింపిక్స్ క్రీడల్లో తనకు సాటి మరెవరూ లేరని ధ్యాన్‌చంద్ నిరూపించారని డీఎస్డీఓ కబీర్దాస్ పేర్కొన్నారు. హాకీ క్రీడకు ఎనలేని ప్రాధాన్యం తీసుకొచ్చిన క్రీడాకారుడిగా ధ్యాన్‌చంద్ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తారని పేర్కొన్నారు. ప్రతి ఒక క్రీడాకారుడికి స్ఫూర్తి ప్రదాన అన్నారు. ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. క్రీడా పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో క్రీడా ప్రాధికార సంస్థ శిక్షకులు ఎండీ గౌస్, ఎండీ గౌస్‌పాషా, ఎండీ అక్బర్అలీ, పీడీలు గంగాప్రసాద్, ఎల్లారెడ్డి, షఫీ, అహ్మద్, ఆదర్శకుమార్, భాగ్యలక్ష్మి, గోవింద్‌రెడ్డి పాల్గొన్నారు. -
చౌకగా కూరగాయలు
రైతు బజార్లలో వినియోగదారుల రద్దీ ఖమ్మం వ్యవసాయం : కూరగాయల ధరలు బాగా తగ్గిపోయాయి. ఖరీఫ్‌లో సాగు చేసిన కూరగాయల పంటల ఉత్పత్తులు వస్తున్నాయి. రైతులు, వ్యాపారులు కూరగాయలను, ఆకు కూరలను విరివిగా అమ్ముతున్నారు. రైతు బజార్లలో, కూరగాయల మార్కెట్లలో లభించని కూరగాయలు లేవు. దాదాపు అన్ని కూరగాయలు కూడా తాజాగా, నాణ్యతగా ఉంటున్నాయి. రైతులు ఆటోల్లో, ద్విచక్రవాహనాల్లో పండించిన కూరగాయలను రైతు బజార్లకు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. బెండ, బీర, కాకర, వంకాయ, టమాట, దొండ, దోస, సొర, పొట్ల వంటి కూరగాయలతో పాటు ఆలుగడ్డ, చేమగడ్డ, కంద, క్యారెట్, బీట్రూట్ వంటి దుంపలు కూడా విక్రయిస్తున్నారు. బచ్చల కూర, తోటకూర, పాలకూర, మెంతు కూర, గోంగూర, చుక్కకూర, ఉల్లాకు, కొత్తిమీర, పుదీన వంటి ఆకుకూరలు కూడా విక్రయిస్తున్నారు. వీటి ధరలు కూడా చాలా తక్కువగా ఉంటున్నాయి. బెండకాయ, టమాట, దోస, సొర, దొండ కూరగాయల ధరలు కిలో ఒక్కంటికి రూ.10లు కాగా, కాకర కిలో రూ.20, బీర రూ.15, వంకాయ రూ.25, పొట్లకాయ రూ.15, ఆలుగడ్డ రూ.24, చేమగడ్డ రూ.30, క్యాబేజీ రూ.22, కాలిఫ్లవర్ రూ.26 చొప్పున విక్రయిస్తున్నారు. పచ్చిమిర్చిని కిలో రూ.30ల చొప్పున విక్రయిస్తున్నారు. 4 నుంచి 5 ఆకు కూరల కట్టలు రూ.10లకు విక్రయిస్తున్నారు. కూరగాయలు, ఆకు కూరల ధరలు తగ్గటంతో సాయింత్రం వేళల్లో వివిధ ప్రాంతాల నుంచి వివిధ వర్గాల ప్రజలు రైతు బజార్లకు వచ్చి కూరగాయలు, ఆకు కూరలు కొనుగోలు చేసుకొని వెళుతున్నారు. రూ.100లు ఖర్చు చేస్తే దాదాపు వారానికి సరిపడా కూరగాయలు లభించే రోజులు మళ్లీ వచ్చాయని వినియోగదారులు ఆనందంగా కొంటున్నారు. ఖమ్మం బస్‌స్టాండ్ దగ్గరలోని రైతుబజార్, ఇల్లెందు క్రాస్ రోడ్‌లోని రైతు బజార్, బైపాస్ రోడ్‌లోని కూరగాయల మార్కెట్‌తోపాటు పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కూరగాయల బజార్లు సాయంత్రం వేళల్లో విక్రయాలతో, వినియోగదారులతో కళకళలాడుతున్నాయి. -
కొత్త పెసలు వచ్చాయోచ్..
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కళకళ రైతు పంట వచ్చేసరికి ధరలు బేజారు క్వింటాల్ రూ.4,600 పలికిన రేటు కనీస మద్దతు ధర కరువు ఖమ్మం వ్యవసాయం : ఖరీఫ్‌లో సాగు చేసిన పెసర దిగుబడులతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కళకళలాడుతోంది. మార్కెట్‌కు పెద్ద ఎత్తున పెసలు అమ్మకానికి వస్తున్నాయి. రైతులు సరుకు తీసుకొస్తున్న సమయంలో ఎప్పటిలాగే ధరలు తగ్గుతున్నాయి. నిన్న మొన్నటి వరకు క్వింటాల్ పెసలు రూ.7,800 వరకు పలికాయి. శనివారం క్వింటాల్ పెసలు రూ.4,600 మాత్రమే పలకడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం గతేడాది క్వింటాల్ పెసల ధరను రూ.4,850గా నిర్ణయించింది. ఈ ఏడాది ఆ ధరను సవరించలేదు. పెరిగిన సేద్యం.. జిల్లాలో పెసర సాధారణ సాగు విస్తీర్ణం 5,962 హెక్టార్లు కాగా ఈ ఏడాది దాదాపు ఐదు రెట్లు అంటే 25,624 హెక్టార్లలో ఈ పంటను సాగు చేశారు. మెట్ట, వరి పండించే మాగాణి భూముల్లోనూ దీన్ని సేద్యం చేశారు. గత ఏడాది రబీ సీజన్ నుంచి పెసర, కంది పంట ఉత్పత్తులకు బాగా డిమాండ్ పెరిగింది. రబీ సీజన్లో ధర ఆశాజనకంగా ఉండటం, ప్రభుత్వం కూడా పప్పు దినుసుల సాగును ప్రోత్సహించడంతో రైతులు ఎక్కువ మొత్తంలో పెసర సాగు చేశారు. ఈ ఏడాది వర్షాలు ఆశాజనకంగా లేకపోవడంతో ఈ పంట దిగుబడులు కూడా సరిగాలేవు. ఎకరాకు ఆరు నుంచి ఏడు క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని రైతులు భావించినా.. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మూడు క్వింటాళ్లకు మించడం లేదు. రైతు చేతికి పంట వచ్చేసరికి.. రైతు చేతికి పంట వచ్చేసరికి ఎప్పటిలాగే ధరలు పడిపోయాయి. వ్యాపారులు సిండికేటై ధర తగ్గించారు. పెట్టుబడుల దృష్ట్యా రైతులు ఈ పంటను వెంటనే అమ్ముకుంటారని భావించి వ్యాపారులు వెంటనే ఈ సరుకు ధరను తగ్గించారనే ఆరోపణలున్నాయి. పంటకు దేశీయంగా మంచి డిమాండ్ ఉన్నా వ్యాపారులు వ్యూహాత్మకంగా ధరలు తగ్గిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కనీస ధర కరువు పెసరకు గత ఏడాది కేంద్ర ప్రభుత్వం క్వింటాలు రూ.4,850గా ప్రకటించింది. ఇంకా ఈ ఏడాది ఈ ధరను సవరించలేదు. సెప్టెంబర్ నెలలో నూతన పంటలకు నూతన ధరలను ప్రకటిస్తారు. 2016–17 సంవత్సరానికి ఎంతో కొంత ధర పెరిగే అవకాశం ఉంది. కానీ వ్యాపారులు గత ఏడాది ప్రకటించిన ధరలకు కూడా పంట ఉత్పత్తిని కొనుగోలు చేయడం లేదు. శనివారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గరిష్టంగా రూ.4,600 ధర వరకు కొనుగోలు చేయగా, కనిష్టంగా రూ4,500లకు మించి ధర పెట్టలేదు. మద్దతు ధరతో పోలిస్తే క్వింటాలకు రూ.350 వరకు తక్కువ ధరతో వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఉత్తమ ధర కోసం ఉన్నతాధికారులతో చర్చిస్తాం : పాలకుర్తి ప్రసాద్‌రావు, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి పెసల కొనుగోలులో నాణ్యత, గ్రేడింగ్ ప్రామాణికం. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రావటం లేదనేది వాస్తవం. ఈ విషయం జేసీ దివ్య, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ మహేష్ దృష్టికి తీసుకెళ్తా. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మద్దతు ధర వచ్చే వి«దంగా ప్రయత్నిస్తా. ప్రభుత్వమే పెసలు కొనాలని అభ్యర్థిస్తాం. -
చిత్ర విన్యాసం
-
మూడో ‘సారీ’ కావొద్దు..
నేడు ఖమ్మం కార్పొరేషన్ పాలక మండలి సమావేశం గతంలో రెండుసార్లు ప్రజా సమస్యలపై జరగని చర్చ – ఖమ్మం – నగర అభివృద్ధిపై చర్చ జరగాలని, ప్రజా సమస్యలపై మాట్లాడాలని, నిధుల కేటాయింపుపై గళం విప్పాలని నగర వాసులు కోరుకుంటున్నా..పాలకమండలి సమావేశాలు నిరుత్సాహ పరుస్తున్నాయి. కార్పొరేటర్లు ఏమీ మాట్లాడకుండానే రెండుసార్లు ముగిశాయి. ముచ్చటగా మూడోసారి..జరగబోతున్న ఈ సభలోనైనా ప్రజా ఉపయోగ అంశాలపై మాట్లాడతారా..? లేదా..? అనే మీమాంస నెలకొంది. అప్పుడలా..ఆపేశారిలా తొలి సమావేశం ప్రమాణ స్వీకారానికి, మలి సమావేశం కోఆప్షన్ సభ్యుల ఎన్నికకే పరిమిత చేయాల్సి వచ్చింది. ఒకసారి పాలేరు ఉప ఎన్నికల కోడ్, మరోసారి మరో కారణంతో ఈ సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చ జరగలేదు. కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి బదిలీ కావడంతో..జాప్యమైంది. ఈ క్రమంలో మంగళవారం కౌన్సిల్æసమావేశం కానుంది. ప్రతిపక్ష కౌన్సిలర్లు ప్రజా సమస్యలపై తీవ్రంగానే మాట్లాడతారనే అంచనా ఉంది. గోళ్లపాడు..తీరని గోడు నగరం నడిబొడ్డు నుంచి వెళ్లే గోళ్లపాడు చానల్ అధ్వానంగా మారి..మురుగు సమస్య పీడిస్తోంది. ఖమ్మం రూరల్ మండలం గోళ్లపాడు నుంచి వచ్చే కాల్వ ఖమ్మం సారధినగర్, జూబ్లీక్లబ్, కాల్వొడ్డు, గాంధీచౌక్ మీదుగా సుందరయ్యనగర్, శ్రీనివాస నగర్ వరకు దాదాపు నాలుగు కిలో మీటర్ల దూరం వరకు ఉన్న ఈ కాల్వ చుట్టు ప్రాంతాలు మురికి కూపంగా మారాయి. నిరుపేదలు, కార్మికులు ఈ కాల్వ చుట్టూ జీవిస్తున్నారు. అపరిశుభ్రత..దోమల సమస్యతో స్థానికులు అవస్థ పడుతున్నారు. విలీన గ్రామాలు..తీరని కష్టాలు ఖమ్మం రూరల్, ఖమ్మం అర్బన్ మండలాల నుంచి కార్పొరేషన్లో విలీనమైన గ్రామాల్లో అభివృద్ధి జరగడం లేదు. కైకొండాయిగూడెం, బల్లేపల్లి, ఖానాపురం, పుట్టకోట, గొల్లగూడెం, కొత్తగూడెం, అల్లీపురం, ధంసలాపురం గ్రామాల్లో అంతర్గత రోడ్ల నిర్మాణాలు చేపట్టలేదు. తాగునీటి ఇబ్బందులు వీడలేదు. డ్రెయినేజీ వ్యవస్థ తీవ్రంగా ఉంది. నగరంలోని బీసీ కాలనీ, వైఎస్సార్ కాలనీ, రమణగుట్ట, వికలాంగుల కాలనీ, శ్రీనివాసనగర్ ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు సక్రమంగా లేవు. డ్రెయిన్లు అధ్వానం..పట్టింపు శూన్యం కార్పొరేషన్ పరిధిలో చాలా చోట్ల డ్రెయినేజీ సమస్యలు పీడిస్తున్నాయి. మొత్తం 345 కిలోమీటర్ల మేరకు సైడ్ కాల్వలు ఉండగా 100 కిలోమీటర్ల డ్రెయిన్లు దెబ్బతిని శిథిలావస్థకు చేరాయి. పెద్ద కాల్వల్లో అసలు పూడికనే తీయడం లేదు. పిచ్చిచెట్లు పెరిగాయి. పారిశుద్ధ్య కార్మికులు 580 మంది ఉండగా..వంద మందికి పైగా అధికారులు, నాయకులు, కార్పొరేటర్లు ఇళ్లల్లోనే పనిచేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మిగిలిన వారిలో అటెన్డెన్స్ వేయించుకుని వెళ్లేవారు పోగా..పనిచేసేవారు తక్కువవుతున్నారు. -
ఉద్యమాన్ని ఉధృతంగా నిర్వహిస్తాం
ఖమ్మం మార్కెట్ పరిరక్షణ కమిటీ నిర్ణయం నేడు ఖమ్మంలో భారీ ప్రదర్శన.. 2 లక్షల సంతకాల సేకరణ హైకోర్టులో పిటిషన్ వేయనున్న కమిటీ ఖమ్మం వ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తరలింపును అడ్డుకోవడానికి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మార్కెట్ పరిరక్షణ కమిటీ నిర్ణయించింది. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మార్కెట్ పరిరక్షణ కమిటీ నాయకులు ఉద్యమ పంథాను వెల్లడించారు. శనివారం త్రీటౌన్‌లోని కార్మిక, వ్యాపార,వాణిజ్య వర్గాలతో పాటు, పరిసర గ్రామాలకు చెందిన రైతులు, త్రీటౌన్‌కు అనుసంధానంగా ఉన్న నగరంలోని వన్‌టౌన్ కార్మికులు, వ్యాపారులతో నగరంలో భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటలకు త్రీటౌన్‌లోని చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయం నుంచి ప్రదర్శన ప్రారంభమై గాంధీచౌక్‌లోని గాంధీ విగ్రహానికి, అక్కడ నుంచి కాల్వొడ్డు మీదుగా బస్ స్టాండ్, వైరా రోడ్ గుండా జెడ్పీసెంటర్‌లోని అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రాలు అందజేయనున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వ్యాపారులు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు. అనంతరం 2 లక్షల సంతకాలను సేకరించి ప్రభుత్వానికి అందించాలని తీర్మానం చేశారు. 2013లోనే మార్కెట్‌ను తరలించడానికి జీఓ విడుదలైందని దానిని ప్రస్తుతం రద్దు చేసినా.. మార్కెట్ తరలింపు అంశం తిరిగి తెరపైకి రావటంతో మళ్లీ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నట్లు వివరించారు. దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామన్నారు. మార్కెట్ పరిరక్షణ కమిటీ గౌరవ అధ్యక్షుడు మేళ్లచెరువు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మార్కెట్‌పై ఆధారపడి నివసించే ప్రజల అభిప్రాయాలు సేకరించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అన్నారు. మార్కెట్‌పై ఆధారపడి జీవించే ప్రజలను, కార్మికులను, వ్యాపారులను, రైతులను ఇబ్బంది పెట్టవద్దని కోరారు. సమావేశంలో మార్కెట్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ సన్నే ఉదయ్‌ప్రతాప్, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రధాన కార్యదర్శి చిన్ని కృష్ణారావు, పరిరక్షణ కమిటీ కోకన్వీనర్లు ఎర్రా శ్రీకాంత్, కల్వకుంట్ల గోపాల్ రావు, ఎర్రా శ్రీను పాల్గొన్నారు. -
ప్రజాదివస్‌లో ఫిర్యాదుల స్వీకరణ
ఖమ్మం క్రైం: ప్రజా సమస్యలపై సోమవారం అదనపు ఏఎస్పీ సాయికృష్ణ అధ్వర్యంలో నిర్వహించిన ప్రజాదివస్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలకు పరిష్కారం కోరుతూ ఫిర్యాదులు అందజేశారు. కుటుంబ, వ్యక్తిగత సమస్యలు, ఆస్తి వివాదాలు, భూ తగాదాలకు సంబంధించిన 20మంది బాధితులు ఏఎస్పీని కలిసి విన్నవించారు. విన్నపాలను క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి..పరిష్కార మార్గం చూపాలని ఏఎస్పీ ఆదేశించారు. ఫిర్యాదుదారుల గ్రామానికి నేరుగా వెళ్లి స్థానికులతో మాట్లాడి, వాస్తవ పరిస్థితిని కూడా తెలుసుకోవాలన్నారు. అప్పుడే నిజమైన బాధితులకు న్యాయం జరుగుతుందని సూచించారు. -
పత్రికా విలేఖరిపై కేసు నమోదు
ఖమ్మం క్రైం: వార్తలు రాస్తానని బెదిరించి ఓ వ్యక్తి నుంచి బలవంతంగా డబ్బులు గుంజుకున్న విలేకరిపై టూటౌన్ పోలీసులు గురువారం సాయంత్రం కేసు నమోదు చేశారు. సీఐ మడత రమేష్ తెలిపిన ప్రకారం.. నగరంలో ఒక దినపత్రిక విలేకరిగా పనిచేస్తున్న మురళీకృష్ణ, నెహ్రూనగర్‌కు చెందిన గోనా గోపాల్‌రావు అనే వ్యక్తిపై వార్త రాశాడు. గోపాల్ రావుకు ఆ విలేకరి ఫోన్ చేసి, ‘‘లక్షన్నర రూపాయలు ఇవ్వకపోతే మళ్లీ వార్త రాస్తా’’నని బెదిరించాడు. తాను ఓ మెస్ వద్ద ఉన్నానని, అక్కడికి రావాలని చెప్పాడు. దీంతో గోపాల్‌రావు, తన స్నేహితుడైన నరేష్‌తో కలిసి అక్కడకు వెళ్లాడు. ఆయన జేబులోగల 60వేల రూపాయలను మురళీకృష్ణ లాక్కుని, శుక్రవారంలోగా మరో 90వేల రూపాయలు ఇవ్వాలని బెదిరించాడు. బాధితుడు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదుతో మురళీకృష్ణపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.