వినియోగదారులతో రద్దీగా ఉన్న రైతు బజార్
- రైతు బజార్లలో వినియోగదారుల రద్దీ
ఖమ్మం వ్యవసాయం : కూరగాయల ధరలు బాగా తగ్గిపోయాయి. ఖరీఫ్‌లో సాగు చేసిన కూరగాయల పంటల ఉత్పత్తులు వస్తున్నాయి. రైతులు, వ్యాపారులు కూరగాయలను, ఆకు కూరలను విరివిగా అమ్ముతున్నారు. రైతు బజార్లలో, కూరగాయల మార్కెట్లలో లభించని కూరగాయలు లేవు. దాదాపు అన్ని కూరగాయలు కూడా తాజాగా, నాణ్యతగా ఉంటున్నాయి. రైతులు ఆటోల్లో, ద్విచక్రవాహనాల్లో పండించిన కూరగాయలను రైతు బజార్లకు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. బెండ, బీర, కాకర, వంకాయ, టమాట, దొండ, దోస, సొర, పొట్ల వంటి కూరగాయలతో పాటు ఆలుగడ్డ, చేమగడ్డ, కంద, క్యారెట్, బీట్‌రూట్ వంటి దుంపలు కూడా విక్రయిస్తున్నారు. బచ్చల కూర, తోటకూర, పాలకూర, మెంతు కూర, గోంగూర, చుక్కకూర, ఉల్లాకు, కొత్తిమీర, పుదీన వంటి ఆకుకూరలు కూడా విక్రయిస్తున్నారు. వీటి ధరలు కూడా చాలా తక్కువగా ఉంటున్నాయి. బెండకాయ, టమాట, దోస, సొర, దొండ కూరగాయల ధరలు కిలో ఒక్కంటికి రూ.10లు కాగా, కాకర కిలో రూ.20, బీర రూ.15, వంకాయ రూ.25, పొట్లకాయ రూ.15, ఆలుగడ్డ రూ.24, చేమగడ్డ రూ.30, క్యాబేజీ రూ.22, కాలిఫ్లవర్ రూ.26 చొప్పున విక్రయిస్తున్నారు. పచ్చిమిర్చిని కిలో రూ.30ల చొప్పున విక్రయిస్తున్నారు. 4 నుంచి 5 ఆకు కూరల కట్టలు రూ.10లకు విక్రయిస్తున్నారు. కూరగాయలు, ఆకు కూరల ధరలు తగ్గటంతో సాయింత్రం వేళల్లో వివిధ ప్రాంతాల నుంచి వివిధ వర్గాల ప్రజలు రైతు బజార్లకు వచ్చి కూరగాయలు, ఆకు కూరలు కొనుగోలు చేసుకొని వెళుతున్నారు. రూ.100లు ఖర్చు చేస్తే దాదాపు వారానికి సరిపడా కూరగాయలు లభించే రోజులు మళ్లీ వచ్చాయని వినియోగదారులు ఆనందంగా కొంటున్నారు. ఖమ్మం బస్‌స్టాండ్ దగ్గరలోని రైతుబజార్, ఇల్లెందు క్రాస్ రోడ్‌లోని రైతు బజార్, బైపాస్ రోడ్‌లోని కూరగాయల మార్కెట్‌తోపాటు పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కూరగాయల బజార్లు సాయంత్రం వేళల్లో విక్రయాలతో, వినియోగదారులతో కళకళలాడుతున్నాయి.