సాక్షి, హైదరాబాద్: పాడైపోయిన కూరగాయలు.. వ్యవసాయ వ్యర్థాలకూ... సౌరశక్తికీ మధ్య సంబంధం ఏమిటి? మామూలుగా ఆలోచిస్తే అసలేం కనిపించదు. కానీ... కార్వే మైగుయి అనే 27 ఏళ్ల ఫిలిప్పీన్స్ ఇంజనీర్ మాత్రం... ఈ రెండింటి సాయంతో కొత్త రకం సోలార్ ప్యానెల్స్ తయారు చేశాడు! ఫలితం... ఇంటి కిటికీలు మొదలుకొని భవనాలకు బిగించే అద్దాల వరకూ..అన్నీ సౌరశక్తి ఘటకాలే.. విద్యుదుత్పత్తి కేంద్రాలే! వ్యవసాయ వ్యర్థాలను, కుళ్లిపోయిన కూరగాయలను బయోగ్యాస్ ప్లాంట్‌లో వేస్తే వంటకు వాడుకోగల బయోగ్యాస్ ఉత్పత్తి అవుతుందని మనకు తెలుసు. కానీ ఈ వ్యర్థాల్లోంచి వేరు చేసిన ఓ వినూత్న పదార్థం.. సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలను పీల్చేసుకొని విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలవని కార్వే మైగుయికి మాత్రమే తట్టింది. సాధారణ సోలార్ ప్యానెల్స్ కేవలం కంటికి కనిపించే దృశ్యకాంతిని మాత్రమే ఒడిసిపడతాయన్నది తెలిసిందే. మైగుయి తయారు చేసిన పదార్థపు పొరను గాజు కిటికీలకు బిగిస్తే చాలు.. ఎక్కడ కావాలంటే అక్కడ ఎంచక్కా విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవచ్చునన్నమాట. నీడ ఉన్నా సరే.. భవనాల గోడను తాకి ప్రతిఫలించే అతినీలలోహిత కిరణాలను ఈ పదార్థం ఉపయోగించుకుంటుంది. అద్భుతమైన ఈ ఆలోచనకు ఈ ఏడాది అంతర్జాతీయ స్థాయి పోటీ జేమ్స్ డైసన్ అవార్డు దక్కింది.
వెలుగునిచ్చే పదార్థం...
భూమి అయస్కాంత ధ్రువ ప్రాంతాల్లో రాత్రివేళ చిత్ర విచిత్రమైన రంగులు కొన్ని కనిపిస్తుంటాయి. అరోరా అని పిలిచే ఈ దృగ్విషయమే అతినీలలోహిత కిరణాలను ఒడిసిపట్టే వ్యవస్థ తయారీకి స్ఫూర్తి అని కార్వే మైగుయి తెలిపారు. సేంద్రియ పదార్థాల్లో ఉండే వెలుగునిచ్చే పదార్థం (బయోల్యూమినిసెన్స్)ను వేరు చేయడం ద్వారా తాను అరోరా రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ యూవీ సీక్వెస్ట్రేషన్ (ఔరియస్)ను తయారు చేశానని డైసన్ అవార్డు అందుకున్న సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్వే వివరించారు. మిణుగురు పురుగులు కూడా ఈ బయో ల్యూమినిసెన్స్ కారణంగానే చీకట్లో వెలుగులు చిమ్ముతాయి. వ్యవసాయ వ్యర్థాలు, పాడైపోయిన కాయగూరల్లోంచి ఈ బయోల్యూమినిసెన్స్ పదార్థపు పొర అతినీలలోహిత కిరణాల శక్తిని మాత్రమే శోషించుకుంటాయి. ఆ శక్తిని దృశ్యకాంతిగా మార్చి విడుదల చేస్తాయి. పొర లోపల ఈ కాంతి వెనక్కు, ముందుకు ప్రతిఫలిస్తూ.. ఒక చివరకు చేరతాయి. ఆ ప్రాంతంలో సోలార్ సెల్స్ ఏర్పాటు చేస్తే ఆ కాంతి డీసీ విద్యుత్‌గా మారుతుంది. రెగ్యులేటరీ సర్క్యూట్ల సాయంతో వోల్టేజిని నియంత్రించుకుంటూ ఈ విద్యుత్‌ను బ్యాటరీల్లో నిల్వ చేసుకోవచ్చు లేదా నేరుగా వాడుకోవచ్చు.
ఎన్నో లాభాలు...
నగరాల్లో అతినీలలోహిత కిరణాల తాకిడి కాస్త ఎక్కువగా ఉంటుంది. చర్మ సంబంధిత సమస్యలకూ కారణమైన ఈ కిరణాలను సద్వినియోగం చేసుకొనేందుకు ఈ ఔరియస్ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుంది. వ్యవసాయ వ్యర్థాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా రైతులకు ఎంతో కొంత అదనపు ఆదాయం లభించేలా చేయవచ్చు. సాధారణ సోలార్ ప్యానెల్స్‌ను ఎప్పుడూ సూర్యుడికి అభిముఖంగా ఉంచాల్సి ఉండగా.. ఈ కొత్త వ్యవస్థలో ఆ అవసరం ఉండదు. కాంక్రీట్ గోడలు, ఫుట్‌పాత్‌లపై పడ్డ సూర్యరశ్మి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలను కూడా ఔరియస్ వాడుకోగలగడం దీనికి కారణం. దాదాపు తొమ్మిది రకాల పంటల నుంచి బయోల్యూమినిసెన్స్ పదార్థాన్ని వేరు చేయవచ్చని కార్వే గుర్తించారు. ఉపయోగించే పదార్థాలన్నీ చౌకగానే లభ్యమవుతున్న కారణంగా ఔరియస్ కూడా తక్కువ ధరకే అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం తాము ఎరుపు, నారింజ, పసుపు, పచ్చ, నీలి రంగులతో కూడిన పదార్థాన్ని వెలికితీస్తున్నామని, నీలి రంగుకు ప్రత్యామ్నాయాన్ని కనుక్కోగలిగితే మరింత ప్రయోజనం ఉంటుందని కార్వే మైగుయి వివరించారు. వాహనాలపై కూడా ఔరియస్‌ను వాడుకోవచ్చని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment