ఖమ్మం వ్యవసాయం : ఖరీఫ్‌లో సాగు చేసిన పెసర దిగుబడులతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కళకళలాడుతోంది. మార్కెట్‌కు పెద్ద ఎత్తున పెసలు అమ్మకానికి వస్తున్నాయి. రైతులు సరుకు తీసుకొస్తున్న సమయంలో ఎప్పటిలాగే ధరలు తగ్గుతున్నాయి. నిన్న మొన్నటి వరకు క్వింటాల్ పెసలు రూ.7,800 వరకు పలికాయి. శనివారం క్వింటాల్ పెసలు రూ.4,600 మాత్రమే పలకడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం గతేడాది క్వింటాల్ పెసల ధరను రూ.4,850గా నిర్ణయించింది. ఈ ఏడాది ఆ ధరను సవరించలేదు.
పెరిగిన సేద్యం..
జిల్లాలో పెసర సాధారణ సాగు విస్తీర్ణం 5,962 హెక్టార్లు కాగా ఈ ఏడాది దాదాపు ఐదు రెట్లు అంటే 25,624 హెక్టార్లలో ఈ పంటను సాగు చేశారు. మెట్ట, వరి పండించే మాగాణి భూముల్లోనూ దీన్ని సేద్యం చేశారు. గత ఏడాది రబీ సీజన్ నుంచి పెసర, కంది పంట ఉత్పత్తులకు బాగా డిమాండ్ పెరిగింది. రబీ సీజన్‌లో ధర ఆశాజనకంగా ఉండటం, ప్రభుత్వం కూడా పప్పు దినుసుల సాగును ప్రోత్సహించడంతో రైతులు ఎక్కువ మొత్తంలో పెసర సాగు చేశారు. ఈ ఏడాది వర్షాలు ఆశాజనకంగా లేకపోవడంతో ఈ పంట దిగుబడులు కూడా సరిగాలేవు. ఎకరాకు ఆరు నుంచి ఏడు క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని రైతులు భావించినా.. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మూడు క్వింటాళ్లకు మించడం లేదు.
రైతు చేతికి పంట వచ్చేసరికి..
రైతు చేతికి పంట వచ్చేసరికి ఎప్పటిలాగే ధరలు పడిపోయాయి. వ్యాపారులు సిండికేటై ధర తగ్గించారు. పెట్టుబడుల దృష్ట్యా రైతులు ఈ పంటను వెంటనే అమ్ముకుంటారని భావించి వ్యాపారులు వెంటనే ఈ సరుకు ధరను తగ్గించారనే ఆరోపణలున్నాయి. పంటకు దేశీయంగా మంచి డిమాండ్ ఉన్నా వ్యాపారులు వ్యూహాత్మకంగా ధరలు తగ్గిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
కనీస ధర కరువు
పెసరకు గత ఏడాది కేంద్ర ప్రభుత్వం క్వింటాలు రూ.4,850గా ప్రకటించింది. ఇంకా ఈ ఏడాది ఈ ధరను సవరించలేదు. సెప్టెంబర్ నెలలో నూతన పంటలకు నూతన ధరలను ప్రకటిస్తారు. 2016–17 సంవత్సరానికి ఎంతో కొంత ధర పెరిగే అవకాశం ఉంది. కానీ వ్యాపారులు గత ఏడాది ప్రకటించిన ధరలకు కూడా పంట ఉత్పత్తిని కొనుగోలు చేయడం లేదు. శనివారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో గరిష్టంగా రూ.4,600 ధర వరకు కొనుగోలు చేయగా, కనిష్టంగా రూ4,500లకు మించి ధర పెట్టలేదు. మద్దతు ధరతో పోలిస్తే క్వింటాలకు రూ.350 వరకు తక్కువ ధరతో వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు.
ఉత్తమ ధర కోసం ఉన్నతాధికారులతో చర్చిస్తాం : పాలకుర్తి ప్రసాద్‌రావు, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి
పెసల కొనుగోలులో నాణ్యత, గ్రేడింగ్ ప్రామాణికం. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రావటం లేదనేది వాస్తవం. ఈ విషయం జేసీ దివ్య, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ మహేష్ దృష్టికి తీసుకెళ్తా. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మద్దతు ధర వచ్చే వి«దంగా ప్రయత్నిస్తా. ప్రభుత్వమే పెసలు కొనాలని అభ్యర్థిస్తాం.