మాట్లాడుతున్న మార్కెట్ పరిరక్షణ కమిటీ సభ్యులు
-
ఖమ్మం మార్కెట్ పరిరక్షణ కమిటీ నిర్ణయం
-
నేడు ఖమ్మంలో భారీ ప్రదర్శన.. 2 లక్షల సంతకాల సేకరణ
-
హైకోర్టులో పిటిషన్ వేయనున్న కమిటీ
ఖమ్మం వ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తరలింపును అడ్డుకోవడానికి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మార్కెట్ పరిరక్షణ కమిటీ నిర్ణయించింది. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మార్కెట్ పరిరక్షణ కమిటీ నాయకులు ఉద్యమ పంథాను వెల్లడించారు. శనివారం త్రీటౌన్‌లోని కార్మిక, వ్యాపార,వాణిజ్య వర్గాలతో పాటు, పరిసర గ్రామాలకు చెందిన రైతులు, త్రీటౌన్‌కు అనుసంధానంగా ఉన్న నగరంలోని వన్‌టౌన్ కార్మికులు, వ్యాపారులతో నగరంలో భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటలకు త్రీటౌన్‌లోని చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయం నుంచి ప్రదర్శన ప్రారంభమై గాంధీచౌక్‌లోని గాంధీ విగ్రహానికి, అక్కడ నుంచి కాల్వొడ్డు మీదుగా బస్ స్టాండ్, వైరా రోడ్ గుండా జెడ్పీసెంటర్‌లోని అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రాలు అందజేయనున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వ్యాపారులు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు. అనంతరం 2 లక్షల సంతకాలను సేకరించి ప్రభుత్వానికి అందించాలని తీర్మానం చేశారు. 2013లోనే మార్కెట్‌ను తరలించడానికి జీఓ విడుదలైందని దానిని ప్రస్తుతం రద్దు చేసినా.. మార్కెట్ తరలింపు అంశం తిరిగి తెరపైకి రావటంతో మళ్లీ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నట్లు వివరించారు. దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామన్నారు. మార్కెట్ పరిరక్షణ కమిటీ గౌరవ అధ్యక్షుడు మేళ్లచెరువు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మార్కెట్‌పై ఆధారపడి నివసించే ప్రజల అభిప్రాయాలు సేకరించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అన్నారు. మార్కెట్‌పై ఆధారపడి జీవించే ప్రజలను, కార్మికులను, వ్యాపారులను, రైతులను ఇబ్బంది పెట్టవద్దని కోరారు. సమావేశంలో మార్కెట్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ సన్నే ఉదయ్‌ప్రతాప్, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రధాన కార్యదర్శి చిన్ని కృష్ణారావు, పరిరక్షణ కమిటీ కోకన్వీనర్‌లు ఎర్రా శ్రీకాంత్, కల్వకుంట్ల గోపాల్ రావు, ఎర్రా శ్రీను పాల్గొన్నారు.