- బీఆర్‌జీఎఫ్ ప్రణాళికపై ప్రత్యేక సర్వసభ్య సమావేశం
- అసంపూర్తి పనులను పక్కనపెట్టి కొత్తవాటికి ప్రతిపాదనలు
- కలెక్టర్ సూచనలనూ పట్టించుకోని సభ్యులు
జిల్లా పరిషత్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బీఆర్‌జీఎఫ్ పథకం కింద జిల్లాలో రూ.32.47కోట్లతో 1986 పనులు చేపట్టేందుకు రూపొందించిన ప్రణాళికలు జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆమోదించా రు. ఇందులో గ్రామ పంచాయతీ సెక్టార్ కింద 1025 పనులు చేపట్టేందుకు రూ.1140.86లక్షలు, మండల పరిషత్ సెక్టార్ కింద 668 పనులకు రూ.684.51లక్ష లు, జెడ్పీ సెక్టార్ కింద 228 పనులకు రూ.456.34లక్షలు, అర్బన్ పరిధిలోని మునిసిపాలి టీలు, నగర పంచాయతీలు, వరంగల్ కార్పొరేషన్‌లలో 65పనులకు రూ.965.29లక్షలు కేటాయిం చారు. బీఆర్‌జీఎఫ్ ప్రణాళిక అమోదం కోసం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ అధ్యక్షతన బుధవారం ప్రత్యేక సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు.
ఈసందర్భంగా జెడ్పీ చైర్‌పర్సన్ మాట్లాడుతూ 2014-15 ఆర్థిక సంవత్సరంలో బీఆర్‌జీఎఫ్ పథకం కింద చేపట్టనున్న పనుల ప్రతిపాదనలను ఆమోదం కోసం సమావేశంలో ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. జెడ్పీ ఇన్‌చార్జ్ సీఈఓ వాసం వెంకటేశ్వర్లు మాట్లాడు తూ బీఆర్‌జీఎఫ్ పథకం కింద జిల్లాకు రూ.32.47కోట్లు కేటాయించారని, ఇందులో రూరల్ లో పంచాయతీ, మండల, జెడ్పీ సెక్టార్లకు రూ.22.81కోట్లు, అర్బన్‌లో మున్సిపాలిటీ, నగర పంచాయతీలతో పాటు వరంగల్ కార్పొరేషన్‌కు రూ.965.29లక్షలు కేటాయించినట్లు తెలిపారు.
ఇందులో అసంపూర్తిగా ఉన్న పనులు కాకుండా కొత్తగా సీసీరోడ్లు, సైడ్ డ్రెయిన్లు ప్రతిపాదించినందున రాష్ట్ర స్థాయి కమిటీలో తిరస్కరణకు గురయ్యే అవకాశాలున్నాయని కలెక్టర్ తెలిపినట్లు సభ్యుల దృష్టికి తీసుకొచ్చారు. దీనిని వ్యతిరేకించిన సభ్యులు జెడ్పీటీసీలుగా ఎన్నికై క్యాంపుల్లో ఉన్నప్పుడు ప్రతిపాదనలు తీసుకున్నారని, ఇప్పుడు మళ్లీ మార్చాలనడం సరికాదన్నారు. అసలు గ్రామాల్లో అభివృద్థి పనులంటేనే సీసీ రోడ్లు, సైడ్ కాల్వలని, ప్రతిపాదనలను మార్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశా రు.
ఈ క్రమంలో ప్రస్తుతం రూపొందించిన ప్రణాళికలకు యథావిధిగా ఆమోదం తెలుపుతున్నట్లు జెడ్పీ వైస్ చైర్మన్ చెట్టుపల్లి మురళి, టీఆర్‌ఎస్, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల ఫ్లోర్ లీడ ర్లు సకినాల శోభన్, మూలగుండ్ల వెంకన్న, శివశంకర్ తెలిపారు. దీంతో ప్రణాళికలను జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆమోదించినట్లు చైర్‌పర్సన్ పద్మ ప్రకటించారు. ముఖ్యమైన ఈ సర్వసభ్య సమావేశానికి ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. ఈ పనులకు డీపీసీలో ఆమోదం లభించాల్సి ఉంది.