BRGF scheme
-
తెలంగాణకు మొండిచేయి
విభజన హామీలు తప్ప కొత్త కేటాయింపులేమీ లేవు సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ తెలంగాణను నిరాశపరిచింది. ‘పునర్విభజన సందర్భంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చట్టపరంగా ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కేంద్రం కట్టుబడి ఉంది...’ అన్న మాటమాత్ర ప్రస్తావన తప్ప తెలంగాణకు ప్రత్యేక హోదా గానీ, నిధులు గానీ ఈ బడ్జెట్లో ఏమీ దక్కలేదు. రాబోయే ఐదేళ్లలో స్థాపించే కొత్త పరిశ్రమలకు 15 శాతం అదనపు పన్ను రాయితీ, పన్ను తరుగుదలలో 15 శాతం రాయితీ ఇస్తున్నట్లు మాత్రం ప్రకటించారు. 2015 ఏప్రిల్ నుంచి 2020 మార్చి 31 వరకు స్థాపించే యూనిట్లకు ఈ సదుపాయం వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ పేర్కొనడం పరిశ్రమలకు ఊరటనిచ్చే పరిణామమే. అయినా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆశించిన విధంగా కేంద్రం నుంచి ప్రోత్సాహకాలు అందకపోవటం నూతన పారిశ్రామిక విధానాన్ని ఎంచుకున్న తెలంగాణ పురోగతికి కళ్లెం వేసినట్లయింది. గత బడ్జెట్లో ప్రస్తావించిన ఉద్యానవన వర్సిటీకి రూ.75 కోట్లు కేటాయించటం కొంత ఊరటనిచ్చింది. వారసత్వ సంపద పరిరక్షణ చర్యల్లో భాగంగా హైదరాబాద్‌లోని కుతుబ్‌షాహీ టూంబ్స్కు చోటు దక్కడంతో పర్యాటకాభివృద్ధికి కొత్త బాటలు వేసినట్లయింది. హైదరాబాద్ ఐఐటీకి రూ.55 కోట్ల కేటాయింపులు, గిరిజన వర్సిటీకి రూ.కోటి మాత్రం ఈ బడ్జెట్లో తెలంగాణకు సంబంధించిన పద్దులుగా కనిపించాయి. వాటర్ గ్రిడ్, మిషన్ కాకతీయ తదితర పథకాలకు ఆర్థిక సాయం చేయాలని సీఎం పలుమార్లు ఢిల్లీకి వెళ్లి చేసిన అభ్యర్థనలను కేంద్రం పట్టించుకోలేదు. వాటా పెరిగినా అంతే.. కేంద్ర పన్నుల వాటాల్లో రాష్ట్రాలకు 42 శాతం కేటాయించాలన్న నిర్ణయంతో భారీ మొత్తంలో నిధులు వస్తాయని ఆశపడ్డ తెలంగాణకు, పంపిణీ వాటా తగ్గటంతో నష్టం వాటిల్లింది. పైగా రాష్ట్రాల్లో అమలవుతున్న కేంద్ర ప్రాయోజిత పథకాల వాటాను ఈ బడ్జెట్లో దాదాపు 27 శాతం మేరకు తగ్గించారు. దాంతో పది శాతం పన్నుల వాటా పెరిగినా మొత్తంమీద ఏటా కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులేమీ పెరగకపోవచ్చని ఆర్థిక శాఖ వర్గాలంటున్నాయి. కొత్త సాయం అందకపోగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి (బీఆర్జీఎఫ్) పథకాన్ని రద్దు చేయటంతో తెలంగాణకు అన్యాయం జరిగింది. రాష్ట్రంలో 9 జిల్లాలు వెనుకబడిన ప్రాంతాల జాబితాలోనే ఉన్నాయి. ఏటేటా ఈ ప్రాంతాల్లో రోడ్డు, మౌలిక వసతుల కల్పనకు కేంద్రం బీఆర్జీఎఫ్ కింద రూ.255 కోట్లు విడుదల చేసేది. దీనికి తోడు గ్రామపంచాయతీల అభివృద్ధికి రాజీవ్‌గాంధి శశక్తీకరణ్ పథకంలో భాగంగా ఏటా రూ.150 కోట్లు కేంద్రం నుంచి విడుదలవుతున్నాయి. ఈ పథకాలను ఉపసంహరించుకోవటంతో ఏటా రూ.400 కోట్ల మేరకు లోటు ఏర్పడనుంది. సాగునీటి ప్రాజెక్టులకు ఇచ్చే ఏఐబీపీ ఈ బడ్జెట్టులో కనుమరుగైంది. -
బీఆర్జీఎఫ్ ప్రణాళికలకు డీపీసీ ఆమోదం
జిల్లాపరిషత్: వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి(బీఆర్జీఎఫ్) పథకంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.32.47కోట్లతో రూపొందించిన ప్రణాళికలను జిల్లా ప్రణాళిక కమిటీ ఆమోదించింది. కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం కమిటీ చైర్మన్, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ అధ్యక్షతన సమన్వయ కార్యదర్శి, కలెక్టర్ జి.కిషన్ నేతృత్వంలో డీపీసీ సమావేశం జరిగింది. ఈసందర్భంగా కలెక్టర్ కిషన్ మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన బీఆర్జీఎఫ్ నిధులు మంజూరయ్యాయని, ఇందుకనుగుణంగా ప్రణాళికలను రూపొందించినట్లు తెలిపారు. నిధుల్లో 50శాతం పంచాయతీలకు, 30శాతం మండల పరిషత్‌లకు, 20శాతం జిల్లా పరిషత్‌కు కేటాయిం చామని, ఆయా స్థానిక సంస్థల సర్వసభ్య సమావేశాల్లో సభ్యులు ప్రతిపాదించిన పనులను చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఎంపీ కడియం శ్రీహరి మాట్లాడుతూ జిల్లా ప్రణాళిక కమిటీ సమావేశం హడావుడిగా నిర్వహించడం సరికాదన్నారు. డీపీసీకి చట్టబద్ధమైన కమిటీ ఉన్నదన్నారు. స్థానిక సంస్థల నుంచి డీపీసీ సభ్యులు లేకున్నా, ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉన్నప్పటికీ... ప్రణాళికల రూపొందించిన సమయంలో ఎందుకు సంప్రదించలేదని ప్రశ్నించారు, ముఖ్యంగా వరంగల్ కార్పొరేషన్ నుంచి ఎంపీలుగా సభ్యులమైన తమకు ప్రతి పాదనల విషయం ఎందుకు చెప్పలేదని కలెక్టర్‌ను అడిగారు. సమయాభావం వల్ల ఇలా చేయాల్సి వచ్చిందని కలెక్టర్ కిషన్ సమాధానమిచ్చారు. నిధులు మురిగిపోతాయన్న కారణంగా ఈ ప్రతిపాదనలను ఆమోదించాల్సి వస్తోందని శ్రీహరి అసహనం వ్యక్తం చేశారు. ఎంపీ సీతారాంనాయక్ మా ట్లాడుతూ డీపీసీ సమావేశాలను నిర్వహించేందుకు నిర్ణీత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రణాళికలన్నీ తయారు చేసి ఆమోదించాలని డీపీసీ ముందు పెట్టడం సరైన పద్ధతి కాదన్నారు. ఎమ్మెల్సీ బోడకుంట్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈనెల 30వ తేదీన డీపీసీ సమావేశమని సమాచారం ఇచ్చారని, ఆ తర్వాత 24, మళ్లీ 29న నిర్వహిస్తున్నట్లు చెప్పా రు. పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం సమావేశాలను వాయిదా వే సేందుకు వీలు లేదని, దీనికి పద్ధతి ఉంటుందన్నారు. వరంగల్ కౌన్సిల్లో ఏం పనులు ప్రతిపాదించారో తెలియదు. మండల పరిషత్‌లలో అధికారులకు, ప్రజాప్రతినిధులకు గొడవలు జరుగుతున్నాయి. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకోవాలి. తప్పనిసరి అనడంతో డీపీసీలో ప్రణాళికలకు ఆమోదిస్తున్నామన్నారు. సమావేశంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాదవరెడ్డి, డీపీసీ సభ్యులు బూర ముత్తిలింగం, రావుల రవిచందర్‌రెడ్డి, జెడ్పీ ఇన్చార్జ్ సీఈఓ వాసం వెంకటేశ్వర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. డీపీసీ నిర్వహణ తేదీపై తగిన సమయంలో సమాచారం ఇవ్వకపోవడం వల్ల తాము హాజరు కాలేక ోయామని, ఇలా ఎందుకు చేశారంటూ ఎంపీ గుండు సుధారాణీ, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు జెడ్పీ సర్వసభ్య సమావేశంలో కలెక్టర్‌ను ప్రశ్నించారు. -
రూ.32.47కోట్ల పనులకు జెడ్పీ ఆమోదం
బీఆర్జీఎఫ్ ప్రణాళికపై ప్రత్యేక సర్వసభ్య సమావేశం అసంపూర్తి పనులను పక్కనపెట్టి కొత్తవాటికి ప్రతిపాదనలు కలెక్టర్ సూచనలనూ పట్టించుకోని సభ్యులు జిల్లా పరిషత్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బీఆర్జీఎఫ్ పథకం కింద జిల్లాలో రూ.32.47కోట్లతో 1986 పనులు చేపట్టేందుకు రూపొందించిన ప్రణాళికలు జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆమోదించా రు. ఇందులో గ్రామ పంచాయతీ సెక్టార్ కింద 1025 పనులు చేపట్టేందుకు రూ.1140.86లక్షలు, మండల పరిషత్ సెక్టార్ కింద 668 పనులకు రూ.684.51లక్ష లు, జెడ్పీ సెక్టార్ కింద 228 పనులకు రూ.456.34లక్షలు, అర్బన్ పరిధిలోని మునిసిపాలి టీలు, నగర పంచాయతీలు, వరంగల్ కార్పొరేషన్లలో 65పనులకు రూ.965.29లక్షలు కేటాయిం చారు. బీఆర్జీఎఫ్ ప్రణాళిక అమోదం కోసం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ అధ్యక్షతన బుధవారం ప్రత్యేక సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ 2014-15 ఆర్థిక సంవత్సరంలో బీఆర్జీఎఫ్ పథకం కింద చేపట్టనున్న పనుల ప్రతిపాదనలను ఆమోదం కోసం సమావేశంలో ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. జెడ్పీ ఇన్చార్జ్ సీఈఓ వాసం వెంకటేశ్వర్లు మాట్లాడు తూ బీఆర్జీఎఫ్ పథకం కింద జిల్లాకు రూ.32.47కోట్లు కేటాయించారని, ఇందులో రూరల్ లో పంచాయతీ, మండల, జెడ్పీ సెక్టార్లకు రూ.22.81కోట్లు, అర్బన్‌లో మున్సిపాలిటీ, నగర పంచాయతీలతో పాటు వరంగల్ కార్పొరేషన్‌కు రూ.965.29లక్షలు కేటాయించినట్లు తెలిపారు. ఇందులో అసంపూర్తిగా ఉన్న పనులు కాకుండా కొత్తగా సీసీరోడ్లు, సైడ్ డ్రెయిన్లు ప్రతిపాదించినందున రాష్ట్ర స్థాయి కమిటీలో తిరస్కరణకు గురయ్యే అవకాశాలున్నాయని కలెక్టర్ తెలిపినట్లు సభ్యుల దృష్టికి తీసుకొచ్చారు. దీనిని వ్యతిరేకించిన సభ్యులు జెడ్పీటీసీలుగా ఎన్నికై క్యాంపుల్లో ఉన్నప్పుడు ప్రతిపాదనలు తీసుకున్నారని, ఇప్పుడు మళ్లీ మార్చాలనడం సరికాదన్నారు. అసలు గ్రామాల్లో అభివృద్థి పనులంటేనే సీసీ రోడ్లు, సైడ్ కాల్వలని, ప్రతిపాదనలను మార్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశా రు. ఈ క్రమంలో ప్రస్తుతం రూపొందించిన ప్రణాళికలకు యథావిధిగా ఆమోదం తెలుపుతున్నట్లు జెడ్పీ వైస్ చైర్మన్ చెట్టుపల్లి మురళి, టీఆర్ఎస్, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల ఫ్లోర్ లీడ ర్లు సకినాల శోభన్, మూలగుండ్ల వెంకన్న, శివశంకర్ తెలిపారు. దీంతో ప్రణాళికలను జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆమోదించినట్లు చైర్పర్సన్ పద్మ ప్రకటించారు. ముఖ్యమైన ఈ సర్వసభ్య సమావేశానికి ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. ఈ పనులకు డీపీసీలో ఆమోదం లభించాల్సి ఉంది.