డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి వినతి
ములుగు : ములుగును జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ తుడుందెబ్బ, జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో బుధవారం ఐటీడీఏ పాలకమండలి సమావేశానికి హాజరైన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు వట్టం ఉపేందర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోలో అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న ఏజెన్సీ గిరిజన నియోజకవర్గ ప్రాంతాలకు జిల్లా కేంద్రాలుగా ఏర్పాటు చేయడానికి మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారన్నారు. నూతన జిల్లా పేరుతో ఏజెన్సీని మూడు ముక్కలుగా విభజించాలని చూస్తే అన్యాయం జరుగుతుందన్నారు. మంథని, మహదేవపూర్, కాటారం, ఖమ్మం జిల్లాలోని వాజేడు, వెంకటాపురం మండలాలను కలుపుకొని ములుగు కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తే గిరిజనుల అభివృద్ధికి బాటలు వేసినట్లు అవుతుందని చెప్పారు. డిప్యూటీ సీఎం విషయాన్ని పరిశీలిస్తామని అన్నట్లు కొమురం ప్రభాకర్ తెలిపారు. జిల్లా సాధన సమితి అధ్యక్షుడు ముంజాల భిక్షపతిగౌడ్, తుడుందెబ్బ జిల్లా అడ్వయిజర్ పోదెం రత్నం, ప్రధాన కార్యదర్శి నారాయణ, డివిజన్ అధ్యక్షుడు కబ్బాక శ్రావణ్, భూపోరాట నాయకులు ముద్దెబోయిన రవి, రామారావు పాల్గొన్నారు.
వికలాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ
ఏటూరునాగారం : ఐకేపీ ఆధ్వర్యంలో 10 మంది వికలాంగులకు ట్రైసైకిళ్లను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, గిరిజన సంక్షేమమంత్రి చందూలాల్, ఎంపీలు సీతారాంనాయక్, పసునూరి దయాకర్, జెడ్పీ చైర్‌పర్సన్ పద్మ పంపిణీ చేశారు. బుధవారం ఐటీడీఏ ఆవరణలో వికలాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేసి వారితో ముచ్చటించారు. ఒక్కో సైకిల్ రూ. 7500ల విలువ చేస్తోందని ఐకేపీ ఐబీ డీపీఎం శ్రీనివాస్ డిప్యూటీ సీఎంకు వివరించారు. సైకిళ్లను కాపాడుకోవాలని కడియం సూచించారు. ఐటీడీఏ పీఓ అమయ్‌కుమార్, ఏపీఓ వసంతరావు, ఏఓ రఘు పాల్గొన్నారు.