పేదలను ఆదుకోండి
పేదలను ఆదుకోండి
Published Sun, Sep 4 2016 10:10 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
అర్వపల్లి
నిలువ నీడ లేక అవస్థలు పడుతున్న పేదకుటుంబాన్ని ఆదుకునేందుకు సత్వరమే చర్యలు ప్రారంభించాలని కలెక్టర్ సత్యనారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. గోడ దాపున రేకుకింద దుర్భర జీవితం అనుభవిస్తున్న నీరజ కుటుంబంపై ‘అభాగ్యులను ఆదుకోరు’ అనే శీర్షికన ఆదివారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికార యంత్రాంగం స్పందించింది. కథనాన్ని చూసిన కలెక్టర్ సత్యనారాయణరెడ్డి చలించిపోయి వెంటనే సూర్యాపేట ఆర్డీఓ నారాయణరెడ్డి, స్థానిక తహసీల్దార్ పులి సైదులులకు ఫోన్‌చేసి వారిని ఆదుకోవడానికి ఏం చేయాలో చూడాలని ఆదేశించారు. అలాగే తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ కూడా గ్రామాన్ని సందర్శించి కష్టాలో కొట్టుమిట్టాడుతున్న సట్టు నీరజ కుటుంబ సభ్యులను పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. నిలువ నీడలేక రేకుల సందులో తలదాచుకుంటున్న ముగ్గురు కుటుంబ సభ్యులను చూసి చలించిపోయారు. ఇల్లు నిర్మించుకోవడానికి ఆర్థికసాయం చేస్తానని ప్రకటించారు. ఆనారోగ్యం పాలైన నీరజకు తగిన వైద్యం అందించాలని తుంగతుర్తి క్లస్టర్ వైద్యాధికారి డాక్టర్ కోటా చలం, నాగారం వైద్యాధికారి శివప్రసాద్‌ను ఆదేశించారు. వారం రోజుల్లో రెండు గదుల ఇంటిని నిర్మిస్తామని తహసీల్దార్ పులి సైదులు తెలిపారు. అలాగే అంత్యోదయ కార్డును మంజూరు చేస్తున్నట్లు తహసీల్దార్ చెప్పారు. ఇంటి నిర్మాణం కోసం 20బస్తాల సిమెంట్‌ను అందజేస్తున్నట్లు తిరుమలగిరి చెందిన కాంట్రాక్టర్ బర్ల వెంకన్న చెప్పారు. తాత్కాలికంగా కుటుంబ ఖర్చుల కోసం తహసీల్దార్ పులి సైదులు, రూ. 1000, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గుండగాని అంబయ్య, రూ. 1000నగదును నీరజ కూతురు హరిచందనసిరికి అందజేశారు. వీరితో పాటు పలువురు దాతలు ఆకుటుంబాన్ని ఆదుకోవడానికి సాయంచేస్తామని ప్రకటించారు. అమెరికా, ఆస్ట్రేలియా, హైదరాబాద్‌లకు చెందిన పలువురు దయగల మారాజులు సాయం చేస్తామని ఫోన్‌లో తెలియజేశారు. ఇదిలా ఉంటే నీరజ కుటుంబానికి ఇంటి నిర్మాణ పనులను ఒకటి, రెండు రోజుల్లో ప్రారంభించాలని కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, ఆర్‌డీఓ నారాయణరెడ్డి తహసీల్దార్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్‌పర్సన్ పాశం విజయ, ఎంపీపీ దావుల మనీషా, ఎంపీడీఓ బి.శిరీష, సర్పంచ్ శీల స్వరూప, గుండగాని అంబయ్య, కళ్లెట్లపల్లి శోభన్‌బాబు, ఉప్పలయ్య, ఎమ్మారై సంద శ్రీరాములు, వీఆర్‌ఓ బాలసైదులు, పంచాయతీ కార్యదర్శి రవీందర్‌రెడ్డి, హెల్త్ అసిస్టెంట్ యల్లమ్మ, ఉమ్మల్‌రెడ్డి సుధాకర్‌రెడ్డి, ఎంపీటీసీ మంగమ్మ, పాష, చింతల వీరయ్య, శీల కృష్ణమూర్తి పాల్గొన్నారు.
Advertisement
Advertisement