arvapalli
-
హత్య కేసులో ఎనిమిది మంది రిమాండ్
అర్వపల్లి :చేతబడి నెపంతో పలువుర గ్రామస్తులు ఏకమై ఓ ఇంటిపై దాడికి పాల్పడి ఒకరిని హత్య చేసి, మరికొందరిని గాయపర్చిన కేసులో ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపిన ఘటన శనివారం అర్వపల్లి మండల పరిధిలో చోటుచేసుకుంది. తుంగతుర్తి సీఐ దండి లక్ష్మణ్, అర్వపల్లి ఎస్సై మోహన్‌రెడ్డిలు విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని జాజిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ ఆవాసం తుంగగూడెంలో ఈ నెల 6న రాత్రి కొంతమంది గ్రామస్తులు అదే గ్రా మానికి చెందిన చిలుకూరి సోమయ్య ఇంటిపై దాడి చేసి సోమయ్యను హత్య చేసి ఆయన భార్య భారతమ్మ, కుమారుడు రమేష్‌లను తీవ్రంగా గాయపర్చారు. కేసుకు సంబంధించి ఎనిమిది మంది నింది తులను శుక్రవారం కోదాడ కోర్టులో హజరుపరిచారు. చేతబడి చేస్తూ తమ ను ప్రశాంతంగా బతకనివ్వడం లేద ని, ప్రతి ఇంట్లో ఏదో ఓ సమస్య, తర చూ అనారోగ్యం చోటుచేసుకోవడాని కి సోమయ్య చేతబడి చేయడమే కారణమని నిందితులు నర్సింగ సుమన్, తుంగ వెంకన్న, సైదుల లక్ష్మణ్, సైదుల నగేష్, డేగల శ్రవణ్, సైదుల సైదులు, దుబ్బాక నాగరాజు, వెన్నమళ్ల యాకయ్యలు తెలిపారు. ఈ కేసులో మరికొంత మందిపై కేసు నమోదు చేశామని, త్వరలోనే అందరినీ అరెస్టు చేస్తామని చెప్పారు. అలాగే నిందితుల వద్ద నుంచి రెండు బైక్‌లు, రెండు సెల్ఫోన్లు, ఏడు కర్రలు, ఒక ఇనుప రాడ్‌ను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ సమావేశంలో హెడ్‌కానిస్టేబుళ్లు వెంకట్రాములు, వీరన్న, వెంకన్న, రవీందర్, రత్నం, సిబ్బంది రాజు, సైదులు, సుధాకర్, అఖిల్, పురుషోత్తం, నాగరాజు, సైదులు పాల్గొన్నారు. -
వనరుల దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించాలి
అర్వపల్లి : పాలకుల వనరుల దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క పిలుపునిచ్చారు. బహుజన బతుకమ్మలో భాగంగా శుక్రవారం రాత్రి తిమ్మాపురంలో మన భూములు మనవే–మన వనరులు మనవే అనే నినాదంతో బతుకమ్మ ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన వనరులను బహుళజాతి కంపెనీలకు పాలకులు అమ్ముకుంటున్నారని విమర్శించారు. వనరులను కాపాడుకోవడానికి అంతా కలిసి పోరాడాలన్నారు. బతుకమ్మ పండుగతో బహుజనులు ఏకం కావాలన్నారు. ఆడపిల్లలను ఎదగనివ్వాలని, మద్యాన్ని తరిమికొట్టాలని కోరారు. ఈసందర్భంగా ఆమె బతుకమ్మ పేర్చి ఆతర్వాత ఎత్తుకొని గ్రామంలో ఊరేగింపు జరిపారు. అనంతరం గ్రామ చావడి వద్ద మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈకార్యక్రమంలో సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోహన్ బైరాగి, తెలంగాణ రైతుకూలి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణదాసు, రాష్ట్ర నాయకులు మల్సూరు, బొమ్మకంటి కొమురయ్య, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు ఆవుల నాగరాజు, తీగల పూలన్, పటేల్ మధుసూధన్‌రెడ్డి, సైదులు, మిడసనమెట్ల వెంకన్న, బైరబోయిన జానయ్య, బండి యాదయ్య, అంబటి సైదులు, రవి, కిరణ్ పాల్గొన్నారు. -
తాత్కాలికంగా గోదావరి జలాల నిలిపివేత
అర్వపల్లి: శ్రీరాంసాగర్ రెండోదశ (ఎస్సారెస్పీ)కు గోదావరి జలాలను తాత్కాలికంగా నిలిపివేశారు. వరంగల్ జిల్లాలో పెద్దమ్మగడ్డ వద్ద కాకతీయ కాలువకు గండిపడిన చోట మరమ్మతు పనులు జరుగుతుండటంతో నీటిని నిలిపివేశారు. అయితే వరంగల్ జిల్లాలోని మైలారం రిజర్వాయర్, బయ్యన్న వాగులలో ఉన్న నీటిని ఇప్పటివరకు నల్లగొండ జిల్లాలోని 69, 71 డిస్ట్రిబ్యూటర్లకు విడుదల చేశారు. అయితే వాటిలో నీళ్లు తగ్గడం, పైనుంచి రాకపోవడంతో తాత్కాలికంగా నిలిపివేశారు. కాకతీయ కాలువకు పడిన గండిని పూడ్చిన తర్వాత కరీంనగర్ జిల్లాలోని ఎల్ఎండి (లోయరు మానేరు డ్యాం) నుంచి వరంగల్ జిల్లాకు వదిలి మైలారం రిజర్వాయర్, బయ్యన్న వాగులను నింపి ఆ తర్వాత జిల్లాకు గోదావరి జలాలను విడుదల చేస్తామని ఎస్సారెస్పీ ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. -
టిప్పర్ నుంచి డీజిల్ చోరీ
అర్వపల్లి: అర్వపల్లి మండల కేంద్రంలోని భారత్ పెట్రోలియం బంక్ పక్కన నిలిపి ఉన్న టిప్పర్ నుంచి గుర్తుతెలియని వ్యక్తులు డీజిల్ చోరీ చేశారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం....జాజిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన నర్సింగ శ్రీనివాస్‌గౌడ్ తన టిప్పిర్ వాహనాన్ని సోమవారం రాత్రి పెట్రోలియం బంక్ పక్కన పెట్టి వెళ్లాడు. మంగళవారం ఉదయం వచ్చి వాహనాన్ని తీయబోగా స్టార్ట్ కావడం లేదు. అనుమానం వచ్చి టిప్పర్ ట్యాంక్‌ను చూడగా తాళం పగులగొట్టి ఉంది. గుర్తుతెలియని వ్యక్తులు ట్యాంక్ తాళం తీసి అందులోని 85 లీటర్ల డీజిల్‌ను చోరీ చేశారు. ఎస్ఐ ఎ.మోహన్‌రెడ్డి సంఘటన స్థలిని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. -
ఎస్సారెస్పీ 71 డీబీఎం కాల్వకు నీటి విడుదల
అర్వపల్లి : ఎస్సారెస్పీ రెండో దశ పరిధిలోని 71 డీబీఎం కాల్వకు ఎట్టకేలకు అధికారులు నీటిని విడుదల చేశారు. సోమవారం రాత్రి నుంచి నీటిని వదిలారు. వరంగల్ జిల్లా బయ్యన్న వాగు నుంచి కొడకండ్లలోని అవుట్ ఫ్లో గేటు ద్వారా 69 డీబీఎంకు 500 క్యూసెక్కులు, 71 డీబీఎంకు 700 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. 69 డీబీఎం ద్వారా నీళ్లు తుంగతుర్తి, నూతనకల్ మండలాలకు, 71 డీబీఎం ద్వారా సూర్యాపేట నియోజకవర్గానికి నీటిని ఇస్తున్నారు. 15 రోజుల పాటు ఈ కాల్వలకు నీటిని వదలాలని మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ ఎస్సారెస్పీ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా, కాల్వలను ఈఈ సుధీర్, డీఈలు సునీల్, ప్రసాద్, సలీంబేగ్, ప్రవీణ్, ఏఈఈ హరికృష్ణ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. -
అధికారికంగా నిర్వహించాలి
అర్వపల్లి : సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థాన విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్రావు డిమాండ్ చేశారు. గురువారం ఆయనిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో నాటి రజాకార్ల వారసులుగా ఉన్న ఎంఐఎం పార్టీకి భయపడి ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడానికి భయపడుతుందన్నారు. 17న వరంగల్‌లో తిరంగయాత్ర ముగింపు సభ జరుగుతుందని ఈసభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశంలో ఆ పార్టీ జిల్లా నాయకుడు జీడి భిక్షం, మండల అధ్యక్షుడు కూర శంకర్, బి.నాగయ్య, పి.వీరేష్‌యాదవ్, రాములు, మల్లయ్య, వెంకటేశ్వర్లు, భిక్షంరెడ్డి, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. -
పేద కుటుంబానికి ఇంటి నిర్మాణం
అర్వపల్లి : నిలువ నీడలేక అవస్థలు పడుతున్న పేద పేదకుటుంబపై ‘అభ్యాగులను ఆదుకోరూ’ అనే శీర్షికతో ‘సాక్షి’ దిన పత్రిలో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ స్పందించారు. మండలంలోని మాచిరెడ్డిపల్లిలో గోడ దాపున రేకు కింద దుర్భర జీవితం అనుభవిస్తున్న సట్టు నీరజ కుటుంబ పరిస్థితి ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన విషయం విధితమే.. ఇందుకు స్పందించిన కలెక్టర్, ఎమ్మెల్యే వారికి వెంటనే ఇంటి నిర్మాణం చేపట్టాలని తహసీల్దార్ పులి సైదులుకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో శుక్రవారం తహసీల్దార్ గ్రామానికి చేరుకుని వీఆర్వో, వీఆర్ఏ సహకారంతో రెండు గదుల ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వారం, పది రోజుల్లో ఇంటి పనులు పూర్తి చేయిస్తామని తహసీల్దార్ తెలిపారు. ఆయన వెంట ఎంఆర్ఐ సంద శ్రీరాములు, వీఆర్ఏలు కొడగంటి వెంకన్న, ఎల్లయ్య, కంచుగట్ల సరిత, పరుశరాములు, రామనర్సు, అశోక్, వెంకన్న, చింతల వీరయ్య ఉన్నారు. అదేవిధంగా ఇంటి నిర్మాణ పనులపై సూర్యాపేట ఆర్డీఓ నారాయణరెడ్డి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. కాగా, సాయం చేసే దాతలు 9849249936 సెల్ నెంబర్‌కు ఫోన్ చేసి సంప్రదించాలని కుటుంబ సభ్యులు కోరారు. -
పేదలను ఆదుకోండి
అర్వపల్లి నిలువ నీడ లేక అవస్థలు పడుతున్న పేదకుటుంబాన్ని ఆదుకునేందుకు సత్వరమే చర్యలు ప్రారంభించాలని కలెక్టర్ సత్యనారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. గోడ దాపున రేకుకింద దుర్భర జీవితం అనుభవిస్తున్న నీరజ కుటుంబంపై ‘అభాగ్యులను ఆదుకోరు’ అనే శీర్షికన ఆదివారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికార యంత్రాంగం స్పందించింది. కథనాన్ని చూసిన కలెక్టర్ సత్యనారాయణరెడ్డి చలించిపోయి వెంటనే సూర్యాపేట ఆర్డీఓ నారాయణరెడ్డి, స్థానిక తహసీల్దార్ పులి సైదులులకు ఫోన్‌చేసి వారిని ఆదుకోవడానికి ఏం చేయాలో చూడాలని ఆదేశించారు. అలాగే తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ కూడా గ్రామాన్ని సందర్శించి కష్టాలో కొట్టుమిట్టాడుతున్న సట్టు నీరజ కుటుంబ సభ్యులను పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. నిలువ నీడలేక రేకుల సందులో తలదాచుకుంటున్న ముగ్గురు కుటుంబ సభ్యులను చూసి చలించిపోయారు. ఇల్లు నిర్మించుకోవడానికి ఆర్థికసాయం చేస్తానని ప్రకటించారు. ఆనారోగ్యం పాలైన నీరజకు తగిన వైద్యం అందించాలని తుంగతుర్తి క్లస్టర్ వైద్యాధికారి డాక్టర్ కోటా చలం, నాగారం వైద్యాధికారి శివప్రసాద్‌ను ఆదేశించారు. వారం రోజుల్లో రెండు గదుల ఇంటిని నిర్మిస్తామని తహసీల్దార్ పులి సైదులు తెలిపారు. అలాగే అంత్యోదయ కార్డును మంజూరు చేస్తున్నట్లు తహసీల్దార్ చెప్పారు. ఇంటి నిర్మాణం కోసం 20బస్తాల సిమెంట్‌ను అందజేస్తున్నట్లు తిరుమలగిరి చెందిన కాంట్రాక్టర్ బర్ల వెంకన్న చెప్పారు. తాత్కాలికంగా కుటుంబ ఖర్చుల కోసం తహసీల్దార్ పులి సైదులు, రూ. 1000, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుండగాని అంబయ్య, రూ. 1000నగదును నీరజ కూతురు హరిచందనసిరికి అందజేశారు. వీరితో పాటు పలువురు దాతలు ఆకుటుంబాన్ని ఆదుకోవడానికి సాయంచేస్తామని ప్రకటించారు. అమెరికా, ఆస్ట్రేలియా, హైదరాబాద్‌లకు చెందిన పలువురు దయగల మారాజులు సాయం చేస్తామని ఫోన్లో తెలియజేశారు. ఇదిలా ఉంటే నీరజ కుటుంబానికి ఇంటి నిర్మాణ పనులను ఒకటి, రెండు రోజుల్లో ప్రారంభించాలని కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, ఆర్డీఓ నారాయణరెడ్డి తహసీల్దార్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్పర్సన్ పాశం విజయ, ఎంపీపీ దావుల మనీషా, ఎంపీడీఓ బి.శిరీష, సర్పంచ్ శీల స్వరూప, గుండగాని అంబయ్య, కళ్లెట్లపల్లి శోభన్‌బాబు, ఉప్పలయ్య, ఎమ్మారై సంద శ్రీరాములు, వీఆర్ఓ బాలసైదులు, పంచాయతీ కార్యదర్శి రవీందర్‌రెడ్డి, హెల్త్ అసిస్టెంట్ యల్లమ్మ, ఉమ్మల్రెడ్డి సుధాకర్‌రెడ్డి, ఎంపీటీసీ మంగమ్మ, పాష, చింతల వీరయ్య, శీల కృష్ణమూర్తి పాల్గొన్నారు. -
మాదిగ ఉపకులాల అభివృద్ధికే పాదయాత్ర
అర్వపల్లి : మాదిగ ఉపకులాల సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించనున్నట్లు టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు యాతాకుల భాస్కర్ తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలో జరిగిన టీఎమ్మార్పీఎస్ జిల్లా విస్త్రత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వచ్చే నెల 10న ఆలేరు మండలం కొలనుపాకలో టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. చెప్పులుకుట్టె చర్మకారులు, డప్పులుకొట్టే కళాకారులకు నెలకు రూ. 2వేలు పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించుటకు నెల రోజుల పాటు టీఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాడామని చెప్పారు. వర్గీకరణకు వెంటనే చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈసమావేశంలో జిల్లా ఇన్చార్జి చింత బాలు, జిల్లా పర్యవేక్షకులు బాకి పాపయ్య, తప్పెట్ల శ్రీరాములు, కందూకూరి ప్రవీణ్‌మాదిగ, భాషపంగు భాస్కర్, బొర్ర ఈదయ్య, పంది ధనుంజయ్, యాతాకుల సునిల్, ఈదుల అర్వపల్లి, బుషిపాక ఉదయ్, తలారి సునిల్, సీహెచ్. గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
అర్వపల్లిలో మూడిళ్లలో చోరీ
అర్వపల్లి: నల్లగొండ జిల్లా అర్వపల్లి మండలం నర్సింహులపేటలో సోమవారం రాత్రి మూడిళ్లలో దొంగతనం జరిగింది. గ్రామానికి చెందిన మెరుగు రాములు, కమ్మాల అయిలయ్య, బుర్ర వీరయ్య ఇళ్లలో గుర్తు తెలియని ముగ్గురు దుండగులు ప్రవేశించి సుమారు నాలుగు తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ.30వేల నగదుతో ఉడాయించారు. దొంగల అలికిడికి మేల్కొన్న గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే స్పందించి గ్రామానికి వస్తుండగా దారిలోనే బైక్‌లపై దొంగలు తారసపడ్డారు. పోలీసులను పసిగట్టిన దొంగలు ఒక పల్సర్ బైక్‌ను అక్కడే వదిలేసి మరో బైక్‌పై పరారయ్యారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దొంగలు వదిలి వెళ్లిన బైక్ ఖమ్మం జిల్లా కొత్తగూడెం పట్టణానికి చెందిన జకీర్ పేరిట నమోదై ఉంది. నల్లగొండ నుంచి క్లూస్‌టీంను రప్పించి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
కాంట్రిబ్యూటరీ పింఛన్ విధానాన్ని రద్దు చేయాలి
అర్వపల్లి ఉపాధ్యాయుల కాంట్రిబ్యూటరీ పింఛన్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని కొనసాగించాలని టీఎస్ పీఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి చిప్పలపల్లి ధర్మయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం కాసర్లపహడ్, కొమ్మాల, తిమ్మాపురం, కోడూరు, లోయపల్లి, పేరబోయినగూడెం, అర్వపల్లిలోని కేజీబీవీ, ప్రా«థమిక పాఠశాలల్లో పీఆర్టీయూ సభ్యత్వ నమోదును నిర్వహించారు. ఈ సందర్బంగా వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు బి. వేమారెడ్డి, కుర్రె శ్రీనివాస్, ఎస్. రామకృష్ణ, పీఆర్టీయూలో చేరారు. పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించాలని, పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులలో విద్యావాలంటీర్లను నియమించాలని కోరారు. కార్యక్రమంలో మండల అధ్యక్ష, కార్యదర్శులు డి. మహేష్, డి. యల్లయ్య, వీరేష్, నాగరాజు, రాము, మామిడి శ్రీను, లక్ష్మయ్య, సుధాకర్‌రెడ్డి, భద్రం, అశోక్ తదితరులు పాల్గొనారు. -
హరితహారాన్ని అంతా మెచ్చుకుంటున్నారు..
అర్వపల్లి : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని విదేశీయులు కూడా ప్రశంసిస్తున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. గురువారం అర్వపల్లిలోని ఎంపీడీఓ కార్యాలయంలో అమెరికా దేశస్తులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 5 కోట్ల మొక్కలు నాటుతున్నట్లు చెప్పారు. అమెరికాలోని ఎల్డీఎస్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డార్లా న్యూటన్, లారెన్స్ న్యూటన్ మనోహర్ బేకరా, ట్రస్ట్ కోర్డినేటర్ శేఖర్ అలమూరి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న హరితహారం కార్యక్రమం ఎంతో బాగుందని కొనియాడారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాశం విజయయాదవరెడ్డి, ఎంపీపీ దావుల మనీషావీరప్రసాద్, వైస్ చైర్మన్ గుజ్జ యుగేందర్‌రావు, జడ్పీటీసీ సంద అమల, వైస్ ఎంపీపీ బొడ్డు వెంకన్న, గుండగాని అంబయ్య, తహసీల్దార్ పులి సైదులు, ఎంపీడీఓ శిరీష తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
అర్వపల్లి : ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీఎస్ పీఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి చిప్పలపల్లి ధర్మయ్య కోరారు. గురువారం అర్వపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌తోపాటు మండలంలోని వివిధ గ్రామాల పాఠశాలల్లో పీఆర్ టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో మండల అధ్యక్ష, కార్యదర్శులు డి.మహేష్, డి.యల్లయ్య, ఎన్.వెంకటేశ్వర్లు, పురుషోత్తం, నాగరాజు, సైదులు, జెల్లా ప్రసాద్, శ్రీధర్‌రెడ్డి, ప్రతాప్‌కుమార్, అంజద్, పాష, సాయిలు, శేఖర్, అబ్బయ్య, భాస్కర్, ప్రభాకర్, మంజుల, రమణకుమారి, కవిత, సురేందర్ పాల్గొన్నారు. -
ఎన్నికల హామీల అమలులో విఫలం
అర్వపల్లి ఎన్నికల హామీల అమలులో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీడీపీ రాష్ట్ర అధికారప్రతినిధి, నియోజకవర్గ ఇన్చార్జ్ పాల్వాయి రజినీకుమారి విమర్శించారు. ఆదివారం తిమ్మాపురం గ్రామంలో నిర్వహించిన ఆ పార్టీ నియోజకవర్గ సమావేశంలో ఆమె మాట్లాడారు. టీఆర్ఎస్ ఎన్నికల ప్రధాన హామీలైన పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం, కేజీ టు పీజీ విద్య, దళితులకు 3ఎకరాల భూమి పంపిణీ, ఇంటికో ఉద్యోగం ఏ ఒక్కటి అమలు కాలేదన్నారు. హరితహారం కార్యక్రమం మంచిదైనా ఎక్కడా ఒక్క మొక్క బతకడం లేదని చెప్పారు. దీని ప్రచారానికి ఖర్చుపెట్టే డబ్బును ప్రాజెక్టుల నిర్మాణానికి ఉపయోగించాలని సూచించారు. ఈ సందర్భంగా ఇటీవల టీఆర్ఎస్లో చేరిన టీడీపీ మండల అధ్యక్షుడు దండ వీరారెడ్డి తిరిగి టీడీపీలోనే కొనసాగుతానని ప్రకటించారు. సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి మొరిశెట్టి ఉపేందర్, మీలా కిష్టయ్య, మాజీ ఎంపీపీ మీలా చంద్రకళ, పీఏసీఎస్ చైర్మన్ ఇందుర్తి వెంకట్‌రెడ్డి, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు దండ వీరారెడ్డి, కె. ప్రభాకర్‌రెడ్డి, జె. శోభారాణి, చాడ హతీష్‌రెడ్డి, సీహెచ్. సుధీర్, ఆకారపు రమేష్, జేరిపోతుల యాదగిరి, చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
ఎంతందంగా ఉన్నానో..
అర్వపల్లిలోని శ్రీయోగానంద లక్ష్మీనర్సింహస్వామి దేవాలయానికి శుక్రవారం ఓ భక్తుడు బైక్‌పై వచ్చాడు. తన బైక్‌ను ఆలయం ఎదుట నిలిపి స్వామి దర్శనానికి వెళ్లాడు. అక్కడే చెట్టుపై ఆడుతున్న కోతుల్లో రెండింటికి బైక్ అద్దంపై దృష్టి పడింది. వెంటనే అవి బైక్ వద్దకు వచ్చారుు. అద్దంలో చూసుకుంటూ ముద్దు పెట్టుకుంటూ తెగ సంబరపడిపోతుండగా ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది. - అర్వపల్లి -
దారుణహత్యకు గురైన తండ్రీకొడుకులు
దేవరనేని కొత్తపల్లిలో ఇద్దరి హత్య * తండ్రీకుమారుడిని మట్టుబెట్టిన ప్రత్యర్థులు * వ్యవసాయ బోరు వద్ద నిద్రిస్తుండగా దాడి * పోలీసుల అదుపులో అనుమానితులు..? అర్వపల్లి: అర్వపల్లి మండలం దేవరనేని కొత్తపల్లి గ్రామానికి చెందిన గైగుళ్ల శ్రీను(40) ఆయన దాయాదులు గైగుళ్ల వెంకట్‌నారాయణ,అవిలయ్యల మధ్య ఏడేళ్లుగా తగాదాలు జరుగుతున్నాయి. గతంలో భూమి తగాదాలుండగా రెండేళ్ల నుంచి బోరు తగాదా జరుగుతోంది. శ్రీను-వెంకట్నారాయణల భూములు పక్కపక్కనే ఉండటం ఈ క్రమంలోనే బోర్లను కూడా ఒకరి పక్క ఒకరు వేసుకోవడంతో సమస్య తీవ్రమైంది. అయితే కొన్ని నెలల నుంచి శ్రీను బోరు ఆన్ చేస్తే వెంకట్‌నారాయణ, అవిలయ్యల బోరులో నీళ్లు రాకపోవడం, వీరి బోరు ఆన్‌చేస్తే శ్రీను బోరు పనిచేయకపోవడం(నీళ్లు రాకపోవడం)తో ఘర్షణలు జరుగుతున్నాయి. అయితే గురువారం రాత్రి శ్రీను తన బోరు నీళ్లు పొలానికి పారించడానికి కుమారుడు వినయ్(15)తో కలిసి పొలం వద్దకు వెళ్లాడు. కరెంట్ లేకపోవడంతో జనరేటర్ అద్దెకు తెచ్చుకుని అర్ధరాత్రి వరకు నడిపించుకున్నాడు. పథకం ప్రకారమే.. వ్యవసాయ బోరు వద్ద నిద్రిస్తున్న తండ్రీకుమారుడిని ప్రత్యర్థులు పథకం ప్రకారమే హత్య చేసినట్టు తెలుస్తోంది. దుండగులు తొలుత ఆదమరచి నిద్రిస్తున్న శ్రీనుపై గొడ్డలి, గడ్డపారతో దాడి చేసి హతమార్చి అనంతరం ఆయన కుమారుడిని మట్టుబెట్టినట్టు సంఘటన స్థలాన్ని బట్టి అవగతమవుతోంది. ప్రత్యర్థులు తండ్రిపై దాడిచేస్తున్న సమయంలో వినయ్ గమనించి పత్తిచేల వైపు పరుగుతీసినట్టు తెలుస్తోంది. అయినా దుండగులు అతడిని వెంటాడి వేటాడినట్టు స్పష్టమవుతోంది. ఈ హత్యకు నిందితులు గొడ్డలి, గడ్డపార, కర్రలను వాడారు. గ్రామ రైతులు, కూలీలు ఉదయం వ్యవసాయ బావి వద్దకు తండ్రీకుమారుడి హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న మృతుల కుటంబ సభ్యులు రోదించిన తీరు పలువురిని కలచివేసింది. దాయాదులపైనే అనుమానాలు పోలీసులు న ల్లగొండ నుంచి డాగ్ స్క్వాడ్‌ను రప్పించి నిందులకోసం వెతికించారు. నిందితులుగా అనుమానిస్తున్న వెంకట్‌నారాయణ, అవిలయ్యల ఇళ్ల వద్దకు జాగిలం వెళ్లి అగిపోయింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను తుంగతుర్తి ఆస్పత్రికి తరలించారు. భూతగాదాల నేపథ్యంలో వెంకట్‌నారాయణ,అవిలయ్యలే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు అనుమానిస్తు మృతుల కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, పోలీసులు ఇప్పటికే అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. ఏడేళ్ల కిందట .. గైగుళ్ల శ్రీను భూతగాదాల నేపథ్యంలో ఏడేళ్ల కిందట దాయాదులు వెంకట్‌నారాయణ, అవిల య్యలపై దాడిచేసి గాయపర్చా డు. అప్పట్లో శ్రీనుపై కూడా కేసు నమోైదె ంది. అయితే ఆ తర్వాత పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టి సమస్యను పరిష్కరించుకున్నా రు. కాగా ఈ మధ్య వర్షాభావ పరిస్థితులతో పక్కపక్కనే ఉన్న ఇద్దరి బోర్లలో నీళ్లు అడుగంటడం, ఉన్న కొద్ది నీరును వాడుకోవాలంటే ఒకరు బోరు వేస్తే మరొకరిది పనిచేయకపోవడంతో గొడవలు మళ్లీ మొదలయ్యాయి. సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ... సూర్యాపేట డీఎస్పీ ఎంఏ. రషీద్, తుంగతుర్తి సీఐ దండి లక్ష్మణ్‌లు సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. అవాంఛనీ య ఘటనలు జరుగకుండా అర్వపల్లి,నూతనకల్ ఎస్సైలు మోహన్‌రెడ్డి, అభిలాష్ గ్రా మం లో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సంఘటన స్థలాన్ని సర్పంచ్ బెల్లి సైదులు, ఎంపీటీసి వంగూరి రజితశ్రీనివాస్లు సందర్శించి మృ తుల కుటుంబాన్ని పరామర్శించారు. శ్రీనివాస్‌కు భార్య రాధ, కూతురు లిఖిత ఉన్నారు. -
వడదెబ్బతో ఆరుగురి మృతి
అర్వపల్లి : వడదెబ్బతో ఆరుగురు వ్యక్తులు మృతిచెందారు. జిల్లాలోని ఆయా మండలాల పరిధిలో చోటు చేసుకున్న ఘటనల వివరాలు.. మండలంలోని కోడూరు గ్రామానికి చెందిన దేశగాని మల్లయ్య(75) ఎండతీవ్రతకు అస్వస్థతకు గురయ్యాడు. ఇంటి వద్దనే చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతిడికి ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. వేణుగోపాలపురం(నడిగూడెం): మండలంలోని వేణుగోపాలపురానికి చెందిన సంపతి పెద వెంకన్న(45) వారం రోజుల కిందట వడదెబ్బకు గురయ్యాడు.ఇంటివద్దనే చికిత్స పొందుతూ శుక్రవా రం మృతిచెందాడు. కోదాడఅర్బన్: మండల పరిధిలోని గుడిబండ గ్రామానికి చెందిన ఎస్కె.ఖాసీంసాబ్(70) ఎండవేడిమికి అస్వస్థతకు గురయ్యాడు. రెండు రోజు లుగా ఇంటి వద్దనే చికిత్స పొందుతున్న ఆయన గురువారం రాత్రి మరణి ంచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శుక్రవారం ఆయన కుటుం బాన్ని టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు వాచేపల్లి వెంకటేశ్వరరెడ్డి పరామర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. మిర్యాలగూడ : మండలంలోని దొండవారిగూడెం గ్రామ పంచాయతీ పరిధి పచ్చారిగడ్డ గ్రామానికి చెందిన చిరుమళ్ల వెంకయ్య(70) ఎండ వేడిమికి అస్వస్థతకు గురయ్యాడు. ఇంటి వద్దనే చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందినట్టు మృతుడి బంధువులు పేర్కొన్నారు. గరిడేపల్లి: మండల కేంద్రానికి చెందిన పెండెం భిక్షం (55) గీతకార్మికుడిగా జీవనం సాగిస్తున్నాడు. ఎండలో తాళ్లు ఎక్కడంతో అస్వస్థతకు గురయ్యాడు. ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. చిలుకూరు : మండలంలోని చెన్నారిగూడెం గ్రామానికి చెందిన కమతం రామయ్య (68) ఎండలకు అస్వస్థతకు గురయ్యాడు. స్థానికంగా చిక్సిత పొందుతూ శుక్రవారం మృతిచెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. -
ఎజాజుద్దీన్ మృతదేహం అప్పగింత
భోపాల్ నుంచి వచ్చిన తండ్రి, బంధువులు {పత్యేక అంబులెన్స్‌లో స్వస్థలానికి తరలింపు అర్వపల్లి గుట్టల్లో కొనసాగిన కూంబింగ్ నల్లగొండ, నార్కట్‌పల్లి, అర్వపల్లి, మోత్కూరు: సిమి ఉగ్రవాది ఎజాజుద్దీన్ మృతదేహాన్ని నల్లగొండ పోలీసులు సోమవారం అతని కుటుంబసభ్యులకు అప్పగించారు. మధ్యప్రదేశ్ పోలీసులతో కలిసి వచ్చిన ఎజాజుద్దీన్ తండ్రి అజీజుద్దీన్, ఇతర బంధువులు మృతదేహాన్ని తమ స్వస్థలానికి తీసుకెళ్లారు. ఈ నెల 4న నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురం వద్ద జరిగిన ఎన్కౌంటర్లో హతమైన ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలను నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రి మార్చురీలో ఉంచిన సంగతి తెలిసిందే. ఎన్కౌంటర్ విషయం మధ్యప్రదేశ్ ఏటీఎస్ బృందానికి తెలపడంతో వారు 5న రాష్ట్రానికి వచ్చి ఆసుపత్రిలోని మృతదేహాలను పరిశీలించారు. ఫొటోలు, వేలిముద్రల ఆధారంగా వారు గతంలో ఖాండ్వా జైలు నుంచి తప్పించుకున్న ఎజాజుద్దీన్, అస్లంలేనని ధ్రువీకరించుకున్నారు. ఈ నేపథ్యంలో భోపాల్ నుంచి ఎజాజుద్దీన్ తండ్రి అజీజుద్దీన్, సోదరుడు అజారుద్దీన్, సమీప బంధువు అమ్జద్ సోమవారం నల్లగొండకు వచ్చారు. ఈ సందర్భంగా ఎజాజుద్దీన్ మృతదేహాన్ని అజీజుద్దీన్ గుర్తుపట్టారు. మృతదేహాన్ని అంబులెన్స్‌లో స్వగ్రామానికి తీసుకెళ్లారు. కాగా, అజీజుద్దీన్ పెద్దకుమారుడు ఎజాజుద్దీన్ అని డీఎస్పీ రాములునాయక్ తెలిపారు. ఆయన టైలర్‌గా జీవనం సాగిస్తున్నాడని పేర్కొన్నారు. కాగా, ఎజాజుద్దీన్ ఆది నుంచీ ఆకతాయి పనులే చేసేవాడని మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా పోలీసు అధికారి తెలిపారు.ఎజాజుద్దీన్ గురించి స్థానిక పోలీసులకు నివేదిక ఇచ్చామన్నారు. మూడో రోజూ కూంబింగ్: ఇక జిల్లాలో ఉగ్రవాదుల కోసం కూంబింగ్ కొనసాగుతోంది. దుండగులతో మరో వ్యక్తి ఉన్నాడన్న సమాచారంతో అర్వపల్లి దర్గా, పెద్దగుట్ట, మోత్కూరు పరిధిలోని గుట్టలను స్పెషల్ పార్టీ పోలీసులు జల్లెడ పడుతున్నారు. మోత్కూరు మండలంలోని జానకిపురంలో జరిగిన ఎన్కౌంటర్ స్థలాన్ని సోమవారం మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బెంగళూర్ యాంటీ టైస్టు బృందాలతోపాటు కేంద్ర ఇంటెలిజెన్స్ బృందం సందర్శించింది. అలాగే సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌ను మహారాష్ట్ర ఏటీఎస్ సందర్శించింది.కాగా, అర్వపల్లి దర్గాలో షెల్టర్ తీసుకున్న ఎజాజుద్దీన్, అస్లాంల దగ్గరికి మరో వ్యక్తి వచ్చినట్లు గుర్తించారు. అతను వచ్చి డబ్బులు ఇచ్చినట్లు సమాచారం. కాగా, అర్వపల్లి దర్గా వద్ద దొరికిన సిమ్‌కార్డుల కాల్‌డేటా ఆధారంగా కర్నూల్‌కు చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించినట్లు సమాచారం. -
దీపారాధనతో ముగిసిన ఉర్సు
అర్వపల్లి, న్యూస్‌లైన్ అర్వపల్లిలోని హజ్రత్ ఖాజా నసీరుద్దీన్ బాబా దర్గా ఉర్సు ఉత్సవాలు శనివారం ముగిశాయి. శనివారం దర్గాలో దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉత్సవాలకు హాజరైన భక్తులు కూడా దీపాలు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన డబుల్ పార్టీ నిర్వహించిన ఖావాలి ఆకట్టుకుంది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తుంగతుర్తి సీఐ కె. పార్ధసారథి, అర్వపల్లి ఎస్ఐ కె.కొండల్‌రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే అర్వపల్లి పీహెచ్సీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్గా చైర్మన్ సాయిని ఉమ్మయ్య, ముజావరి నసీరుద్దీన్, సభ్యులు మల్లేష్, హబీబ్, శ్రీను, జహంగీర్, సత్తయ్య, ఖాజాపాష, గోరేబాయి, మున్నా, రవూఫ్, అఖీల్ తదితరులు పాల్గొన్నారు. -
ఆంధ్రప్రదేశ్‌లోనే కేజీబీవీలు అధికం
అర్వపల్లి, న్యూస్‌లైన్: అన్ని రాష్ట్రాల్లో కన్న ఆంధ్రప్రదేశ్‌లోనే కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు ఎక్కువగా ఉన్నాయని ఆర్వీఎం రాష్ట్ర కమ్యూనిటీ మొబలైజేషన్ అధికారి (సీఎంఓ) డాక్టర్ బండి సాయన్న చెప్పారు. అర్వపల్లి కేజీబీవీని మంగళవారం తనిఖీ చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 743 కేజీబీవీలు పని చేస్తున్నాయని తెలిపారు. బాలికలకు కేజీబీవీలలో ఉన్న వసతులు మరే వసతి గృహాల్లో ఉండవన్నారు. ఆర్వీఎం ఎక్కడా రాజీ పడకుండా కేజీబీవీలకు సౌకర్యా లు కల్పిస్తుందని చెప్పారు. అన్ని కేజీబీవీలకు పూర్తి కాలపు ఎస్ఓలను నియమించామన్నారు. ఇక నుంచి కేజీబీవీల్లో ప్రతి ఆదివారం మాంసాహార భోజనం అందించనున్నట్లు తెలిపారు. ఆర్వీఎం ఎస్పీడీ ఉషారాణి కేజీబీవీల అభివృద్ధికి అనేక చర్యలు చేపడుతుందన్నారు. ప్రతి రోజు భోజనంలో కోడిగుడ్లు పెట్టాలని ఎస్ఓలను ఆదేశించారు. కేజీబీవీలకు బెడ్షీట్లు 15 రోజుల్లో రానున్నాయని తెలిపారు. కొత్తగా నిర్మించిన కేజీబీవీ భవనాలలో ఎక్కడైనా సమస్యలు ఉంటె వెంటనే గుత్తేదార్లతో మరమ్మతులు చేయిస్తామని చెప్పారు. ఏ సమస్యలు ఉన్నా ఇక నుంచి బాలికలు 1800425, 3525 టోల్‌ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో సీఎంఓ లింగయ్య, ఎమ్మార్జీ పగిళ్ల సైదులు, విజయలక్ష్మి, పాల్గొన్నారు. కస్తూరిబా పాఠశాల తనిఖీ తుంగతుర్తి : మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ పాఠశాలను ఆర్వీఎం అధికారి డాక్టర్ బండి సాయన్న మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం పాఠశాల అద్దె భవనంలో కొనసాగుతుడడంతో విద్యార్థులకు సరైనా బాత్రూంలు, టాయిలెట్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మెనూ ప్రకారం భోజనం అందించడం లేదన్నారు. అనంతరం మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న కస్తూరిబా పాఠశాలను పరిశీలించారు. పాఠశాల భవనాన్ని త్వరగా పూర్తి చేసి జనవరి 1వ తేదీ వరకు ప్రారంభించాలని, లేని పక్షంలో సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్య తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట కో ఆర్డినేటర్ జి. లింగయ్య తదితరులు ఉన్నారు.