భోపాల్ నుంచి వచ్చిన తండ్రి, బంధువులు
{పత్యేక అంబులెన్స్‌లో స్వస్థలానికి తరలింపు
అర్వపల్లి గుట్టల్లో కొనసాగిన కూంబింగ్
నల్లగొండ, నార్కట్‌పల్లి, అర్వపల్లి, మోత్కూరు: సిమి ఉగ్రవాది ఎజాజుద్దీన్ మృతదేహాన్ని నల్లగొండ పోలీసులు సోమవారం అతని కుటుంబసభ్యులకు అప్పగించారు. మధ్యప్రదేశ్ పోలీసులతో కలిసి వచ్చిన ఎజాజుద్దీన్ తండ్రి అజీజుద్దీన్, ఇతర బంధువులు మృతదేహాన్ని తమ స్వస్థలానికి తీసుకెళ్లారు. ఈ నెల 4న నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురం వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమైన ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలను నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రి మార్చురీలో ఉంచిన సంగతి తెలిసిందే. ఎన్‌కౌంటర్ విషయం మధ్యప్రదేశ్ ఏటీఎస్ బృందానికి తెలపడంతో వారు 5న రాష్ట్రానికి వచ్చి ఆసుపత్రిలోని మృతదేహాలను పరిశీలించారు.
ఫొటోలు, వేలిముద్రల ఆధారంగా వారు గతంలో ఖాండ్వా జైలు నుంచి తప్పించుకున్న ఎజాజుద్దీన్, అస్లంలేనని ధ్రువీకరించుకున్నారు. ఈ నేపథ్యంలో భోపాల్ నుంచి ఎజాజుద్దీన్ తండ్రి అజీజుద్దీన్, సోదరుడు అజారుద్దీన్, సమీప బంధువు అమ్జద్ సోమవారం నల్లగొండకు వచ్చారు. ఈ సందర్భంగా ఎజాజుద్దీన్ మృతదేహాన్ని అజీజుద్దీన్ గుర్తుపట్టారు. మృతదేహాన్ని అంబులెన్స్‌లో స్వగ్రామానికి తీసుకెళ్లారు. కాగా, అజీజుద్దీన్ పెద్దకుమారుడు ఎజాజుద్దీన్ అని డీఎస్పీ రాములునాయక్ తెలిపారు. ఆయన టైలర్‌గా జీవనం సాగిస్తున్నాడని పేర్కొన్నారు. కాగా, ఎజాజుద్దీన్ ఆది నుంచీ ఆకతాయి పనులే చేసేవాడని మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా పోలీసు అధికారి తెలిపారు.ఎజాజుద్దీన్ గురించి స్థానిక పోలీసులకు నివేదిక ఇచ్చామన్నారు.
మూడో రోజూ కూంబింగ్: ఇక జిల్లాలో ఉగ్రవాదుల కోసం కూంబింగ్ కొనసాగుతోంది. దుండగులతో మరో వ్యక్తి ఉన్నాడన్న సమాచారంతో అర్వపల్లి దర్గా, పెద్దగుట్ట, మోత్కూరు పరిధిలోని గుట్టలను స్పెషల్ పార్టీ పోలీసులు జల్లెడ పడుతున్నారు. మోత్కూరు మండలంలోని జానకిపురంలో జరిగిన ఎన్‌కౌంటర్ స్థలాన్ని సోమవారం మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బెంగళూర్ యాంటీ టైస్టు బృందాలతోపాటు కేంద్ర ఇంటెలిజెన్స్ బృందం సందర్శించింది. అలాగే సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌ను మహారాష్ట్ర ఏటీఎస్ సందర్శించింది.కాగా, అర్వపల్లి దర్గాలో షెల్టర్ తీసుకున్న ఎజాజుద్దీన్, అస్లాంల దగ్గరికి మరో వ్యక్తి వచ్చినట్లు గుర్తించారు. అతను వచ్చి డబ్బులు ఇచ్చినట్లు సమాచారం. కాగా, అర్వపల్లి దర్గా వద్ద దొరికిన సిమ్‌కార్డుల కాల్‌డేటా ఆధారంగా కర్నూల్‌కు చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించినట్లు సమాచారం.
ఎజాజుద్దీన్ మృతదేహం అప్పగింత
Published Tue, Apr 7 2015 1:45 AM | Last Updated on Wed, Apr 3 2019 5:32 PM
Advertisement
Advertisement