Published
Thu, Jul 28 2016 8:00 PM
| Last Updated on Mon, Sep 4 2017 6:46 AM
‘బస్వాపురం’ సామర్థ్యాన్ని తగ్గించాలి : జూలకంటి
భువనగిరి : బస్వాపురం రిజర్వాయర్ సామర్థ్యాన్ని 11.38 టీఎంసీలను తగ్గించి, గ్రామాలు మునిగిపోకుండా నిర్మించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం భువనగిరి ఆర్డీఓ కార్యాలయం ఎదుట భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని, రిజర్వాయర్ సామర్థ్యం తగ్గించాలని కోరుతూ రైతులు, నాయకులు చేపట్టిన రిలే నిరాహర దీక్షలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా నిర్మించతలపెట్టిన బస్వాపురం రిజర్వాయర్ కింద భూములు కోల్పోతున్న రైతులకు, భూమికి భూమి ఇవ్వాలని, ఇళ్లు కోల్పోతున్న వారికి ఇళ్లు ఇవ్వాలన్నారు. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయకుండా 123 జీఓను భూసేకరణకు ఉపయోగించడం వల్ల రైతులు రోడ్డున పడుతున్నారన్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, సీపీఎం డివిజన్ కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి, వేముల మహేందర్, మాటూరు బాలరాజు, దాసరి పాండు, కన్వీనర్ దయ్యాల నర్సింహ, రాజయ్య, సురేందర్, అంజయ్య, రాజరాం, వెంకటేశ్, రమేష్, రామ్‌జీ, లక్‌పతి, సత్యనారాయణ వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.