తొర్రూరు : రాష్ట్రంలో కరువును పారద్రోలాలంటే చెట్ల పెంపకం చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని సోమారం, గుర్తూరు, కంఠాయపాలెం, తొర్రూరు పట్టణంలో చేపట్టిన హరితహారం లో ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ పసునూరి దయాకర్‌తో కలిసి ఆయన శనివారం పాల్గొన్నారు. పలు ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటారు. తొర్రూరు, సోమారంలో జరిగిన సభల్లో కడియం శ్రీహరి మాట్లాడుతూ తెలంగాణను పచ్చగా మార్చేందుకు సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. ఈ ఏడాది 46వేల కోట్ల మొక్కలు నాటేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసి మొక్కలు నాటుతున్నట్లు చెప్పారు. పాలకుర్తి నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రూ.22కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎంపీ పసునూరి దయాకర్ హరి తహారంలో అందరూ భాగస్వాములు కావాల న్నారు. కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్ రావు కలయికతో జిల్లా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఏర్పడిందన్నారు. ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ ఈరోజు ఒక్కరోజే నియోజకవర్గ వ్యాప్తంగా నాలుగు లక్షల మొక్కలు నాటి జిల్లాలో రికార్డు సృష్టించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్.సుధాకర్‌రావు, ఎంపీపీ కర్నె సోమయ్య, జెడ్పీటీసీ సభ్యుడు జాటోతు కమలాకర్, సర్పంచ్‌లు రాజేశ్‌నాయక్, చందులాల్, తారా గంగారం,ఎంపీటీసీలు రమేశ్, సాహితీ, భాస్కర్, రాధ, సుభద్ర, నాగేశ్వర్, అరుణ, ఉప సర్పంచ్ రేవతి పాల్గొన్నారు.
దూరదృష్టితో పనిచేస్తున్న కేసీఆర్
రాయపర్తి : తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు సీఎం కేసీఆర్ దూరదృష్టితో పనిచేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. మండలకేంద్రంలోని మార్కెట్‌యార్డు, మండలంలోని పెర్కవేడు శివాలయం, కొండాపురం గ్రామాల్లో శనివారం హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ పథకాలతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధిలో ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుకు తన సహకారం ఉంటుందని చెప్పారు. ఎంపీ పసునూరి దయాకర్ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి భారీ నిధులు తెస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి ఎక్కువ నిధులు కేటాయించాలని ఉప ముఖ్యమంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌రావు, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, ఎంపీపి గుగులోతు విజయ, జెడ్పీటీసీ సభ్యురాలు వంగాల యాకమ్మ, వైస్ ఎంపీపీ యాక నారాయణ, సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు ఎండీ.ఉస్మాన్, గారె అనిత, వీరమ్మ, నూనావత్ రాధ, ఆర్డీవో వెంకటమాధవరావు, మామునూర్ ఏసీపీ మహేందర్, తహసీల్దార్ వాసం రామ్మూర్తి, ఎంపీడీఓ శంకరి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు నూనావత్ నర్సింహానాయక్, జినుగు అనిమిరెడ్డి, సురేందర్‌రావు పాల్గొన్నారు.