Harita Haram
-
హరితహారంపై జీహెచ్ఎంసీ కమిషనర్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: హరితహారం అమలుపై జీహెచ్ఎమ్సీ జోనల్, డిప్యూటీ కమిషనర్లతో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘హరితహారం అమలుకు వార్డు, లొకేషన్ వారీగా ప్రణాళిక చేస్తున్నాం. కార్పొరేటర్లతో చర్చించి వార్డు ప్రణాళిక రూపొందించాలని డిప్యూటి కమిషనర్లను ఆదేశించాం. మొక్కలు నాటి, సంరక్షించుటలో జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న 30 వేల మంది ఉద్యోగులు భాగస్వాములు కావాలి. కాలని సంక్షేమ సంఘాలను మొక్కలు నాటడంలో భాగస్వామ్యం చేయాలి. ప్రభుత్వం నిర్దేశించిన 50 లక్షల మొక్కలు నాటి, సంరక్షించాలి. గుంతలు తీయించి, మొక్కలు నాటడంతో పాటు, వాటి సంరక్షణ కోసం ప్రతి లొకేషన్లో ఒకరిని ఇంచార్జిగా నియమించాలి. నాటిన ప్రతి మొక్కను రక్షించుటకు ఫెన్సింగ్ వేయడం, నీరు పోయడం, కలుపుతీత పనులను పరిశీలించాల్సిన బాధ్యత ఇంచార్జి అధికారిదే. ఎవెన్యూ ప్లాంటేషన్ కింద జీహెచ్ఎంసీ పరిధిలో అన్ని రోడ్లకు ఇరువైపులా మొక్కలు కనిపించాలి. రోడ్డు పక్కన స్థలం తక్కువగా ఉంటే సంబంధిత ఇంటి యజమానితో మాట్లాడి, ప్రహరీ గోడకు లోపల మొక్కలు నాటించాలి. స్మశాన వాటికల ప్రహరీ గోడలు గ్రీన్ కర్టెన్స్‌ను తలపించేలా ప్రత్యేకమైన మొక్కలు నాటాలి. మూసీకి రెండు పక్కల వెదురు రకాల మొక్కలు నాటాలి. చెరువు కట్టలకు ఇరువైపులతో పాటు, నీరు నిలవని ప్రాంతాల్లో కూడా మొక్కలు నాటాలి’ అని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ పేర్కొన్నారు. (సాక్షాత్తు గవర్నరే వెళ్తుంటే కేసీఆర్ ఎక్కడున్నాడు..?) -
హరితంలో 'ఆ' మొక్కలకే అధిక ప్రాధాన్యం
సాక్షి, సిద్దిపేట: జిల్లాలో నాలుగు విడతలుగా జరిగిన హరితహారంలో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో మొక్కలు నాటారు. ఈ ఉత్సాహాన్ని మరింత ప్రొత్సహించేందుకు అధికారులు వినూత్న విధానానికి శ్రీకారం చుట్టారు. మొక్కల పెంపకంలో కుల వృత్తులకు భాగస్వామ్యం కల్పిస్తున్నారు. గీత కార్మికులకు తాటి, ఈత, ఖర్జూర, గిరకతాడు మొక్కలు, ముదిరాజులకు సీతాఫలం,అల్ల నేరేడు వంటి పండ్ల మొక్కలు అందజేస్తున్నారు. వీటితోపాటు తుమ్మలను పరిరక్షించి గొర్రెలు, జీవాలను మేపేందుకు కంచెలు, చెరువు శిఖాల్లో నల్లతుమ్మ మొక్కలను పెంచేందుకు గొల్ల కురుమలను భాగస్వామ్యులను చేస్తున్నారు. హుస్నాబాద్ మండలం పోతారం(జే)లో ఖర్జూర మొక్కలు నాటేందుకు సిద్ధమైన స్థానికులు(ఫైల్) కాలనుగుణంగా కొన్ని, రియలెస్టేట్ పుణ్యమా అని కొన్ని, భూమిని చదును చేయడం, కాల్వలు తవ్వడంతో గ్రామాల్లో ఉన్న తాటి, ఈత చెట్లు కనుమరుగవుతున్నాయి. దీంతో గీత కార్మికులకు ఉపాధి కోల్పోతున్నారు. దీన్ని గమనించిన అధికారులు ప్రభుత్వం నుంచి గీతకార్మికుల సొసైటీలకు అందచేసిన ఐదెకరాల భూమితోపాటు, చెరువులు, కాల్వల గట్లపై ఈత, తాటి, గిరకతాడు, ఖర్జూర మొక్కలు నాటిస్తున్నారు. జిల్లాలో 66,987 మంది గీతా కార్మికులు, ఈడిగ మొదలైనవారు ఉండగా ఇప్పటి వరకు 5 లక్షల ఈత, 8 వేల గిరకతాటి మొక్కలను నాటారు. ఇందులో కొన్ని రెండు, మూడు సంవత్సరాల వయస్సుకు రావడంతో మరుసటి సంవత్సరం కోతకు వస్తాయని చెబుతున్నారు. అదేవిధంగా జిల్లాలో ముదిరాజులు, గంగపుత్రులు, బెస్త కులాల వారు 1,84,429 మంది ఉన్నారు. చెరువుల్లో చేపలు పెంచడం, వాటిని పట్టి అమ్మడమే ప్రధాన వృత్తి, మిగితా కాలంలో సీతాఫలం, అల్లనేరేడు, తునికి పండ్లతోపాటు కందమూలాలు కూడా తీసుకవచ్చి అమ్ముతారు. అయితే కాలం కలిసి రాకపోవడం వర్షాలు కురువకపోవడంతో వీరి వృత్తి ప్రమాదంలో పడింది. ఇటువంటి పరిస్థితిలో గ్రామాల్లో ఉన్న గుట్టలు, ఏనెలు, పొరంబోకు భూముల్లో పండ్ల మొక్కలను పెంచేందుకు ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 16 లక్షల సీతాఫలం మొక్కలను నాటారు. అదేవిధంగా గొల్లకురుమలకు ప్రభుత్వం సబ్సిడీపై గొర్రెలు పంపిణీ చేసింది. అయితే అవి మేసేందుకు తావు లేకుండా పోయింది. ప్రభుత్వం ఇచ్చిన భూమితోపాటు, చెరువు శిఖం మొదలైన ప్రాంతాల్లో నల్లతుమ్మల పెంపకానికి శ్రీకారం చుట్టరు. ఇలా కుల వృత్తులకు ఉపాధి కల్పించే మార్గంతో పాటు, ప్రభుత్వ లక్ష్యం హరితహారం విజయవంతం చేసేందుకు ముందుకు వెళ్తున్నారు. జిల్లాలో నాటిన మొక్కలు ఈత 4.30లక్షలు సీతాఫలం 16లక్షలు గిరకతాడు 8వేలు -
‘పట్నం’లో నేడు హరిత పండుగ
సాక్షి, ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నారు. గురువారం నియోజకవర్గంలోని మంచాల, యాచారం, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాలతో పాటు పెద్దఅంబర్‌పేట్, ఇబ్రహీంపట్నం, తుర్కయంజాల్, ఆదిబట్ల మున్సిపాలిటీలలో మొక్కలు నాటనున్నారు. ఇందుకోసం అటవీశాఖ, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా నర్సరీల్లో పెంచిన మొక్కలను ఆయా గ్రామాలకు సరఫరా చేశారు. గ్రామాలకు తరలించేందుకు మొక్కలను వాహనంలో ఎక్కిస్తున్న దృశ్యం హరితహారంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిపేందుకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఒకే రోజు ఆరు లక్షలు మొక్కలు నాటాలనే లక్ష్యం పెట్టుకున్నారు. ఇందుకోసం ఇప్పటికే అధికారులను అప్రమత్తం చేసి కార్యక్రమం విజయవంతం చేయడానికి అడుగులు వేశారు. డ్వాక్రా మహిళలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువకులు, సంక్షేమ పథకాల లబ్ధిదారులు సైతం ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఇంటింటికీ ఆరు మొక్కలు నాటాలని, ప్రభుత్వ, ప్రైౖవేటు స్థలాల్లో, రోడ్ల వెంట, పార్కు స్థలాల్లో మొక్కలు నాటడానికి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే నర్సరీల నుంచి మొక్కలను ఆయా గ్రామాలకు తరలించారు. కొన్ని గ్రామాల్లో మొక్కలు ఇంటింటికీ తిరిగి పంపిణీ చేయడం కూడా పూర్తయ్యింది. ఈ కార్యక్రమానికి గ్రామస్థాయిలో నోడల్ అధికారులను నియమించారు. నాగన్‌పల్లి వద్ద గుంతలు తవ్వుతున్న కూలీలు హాజరుకానున్న ప్రియాంక వర్గీస్ స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మన్నెగూడ సెంట్రల్ రోడ్డు డివైడర్ మధ్యలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ముందుగా ప్రారంభించి, అనంతరం రాయపోల్ అటవీశాఖ భూముల్లో మొక్కలు నాటుతారు. గున్గల్ ఫారెస్టులో మొక్కలు నాటే కార్యక్రమంలో ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్డీ ప్రియాంక వర్గీ‹స్ పాల్గొంటారు. అదేవిధంగా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కవాడిపల్లిలో పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మంచాల మండలంలో జిల్లా పంచాయతీ అధికారిణిæ పద్మజారాణి, లోయపల్లిలో గీత కార్మికులు మొక్కలు నాటే కార్యక్రమానికి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ రఘురాం, తుర్కగూడ రైతుల ఆధ్వర్యంలో నిర్వహించే హరితహారం కార్యక్రమానికి జిల్లా వ్యవసాయాధికారిణి గీతారెడ్డి, ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలో ట్రాన్స్‌కో డీఈ సురేందర్‌రెడ్డి, ఆర్డీఓ అమరేందర్, చర్లపటేల్‌గూడలో స్థానిక ఏసీపీ యాదగిరిరెడ్డి, మంగళ్‌పల్లి అటవీ భూముల్లో జిల్లా ఫారెస్టు అధికారి తదితరులు పాల్గొని మొక్కలు నాటనున్నారు. హరిత పండుగలో అందరూ పాల్గొనండి రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా ఇబ్రహీంపట్నంలో జరగబోయే హరితపండగను జయప్రదం చేయాలి. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు తప్పకుండా హాజరుకావాలి. డ్వామా, ఈజీఎస్, అటవీశాఖల అధికారులు ఆరు లక్షల మొక్కలు నాటడానికి కావాల్సిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తిచేశారు. ఎక్కడా ఇబ్బందులు లేకుండా గోతులు తవ్వించి సిద్ధంగా పెట్టారు. హరితహారం విజయవంతం చేయడానికి వరణుడు కూడా సహకరిస్తున్నాడు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం రాష్ట్రంలో ఆదర్శంగా నిలవాలి. ముఖ్యమంత్రి మెచ్చుకునేలా మన హరితహారం పండగ జరగాలి. ఉదయం పది గంటలకే కార్యక్రమం ప్రారంభం కావాలి. – మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే, ఇబ్రహీంపట్నం -
హరితహారాన్ని యజ్ఞంలా నిర్వహించాలి
సాక్షి, హైదరాబాద్: హరితహారం కార్యక్రమా న్ని ప్రహసనంలా కాకుండా ఓ బాధ్యతలా, ఓ యజ్ఞంలా భావించి పట్టుదల, కార్యదీక్షతతో పనిచేయాలని అధికారులకు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సూచించారు. మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షించడంపై దృష్టి పెట్టాలని అన్నారు. బుధ వారం అరణ్యభవన్‌లో త్వరలో ప్రారంభించనున్న ఐదో విడత హరితహారం కార్యక్రమంపై అటవీ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్–విజయవాడ జాతీ య రహదారి మాదిరిగానే నాగార్జున సాగర్, శ్రీశైలం రోడ్ల వెంట అవెన్యూ ప్లాంటేషన్ పూర్తి చేయాలన్నారు. హరితహారంలో కలెక్టర్ మొదలుకొని అధికారులు, సిబ్బంది, కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు సైతం తప్పనిసరిగా పాల్గొనాలని చెప్పారు. అన్ని జిల్లాల్లో పర్యటించి, హరితహారం అమలు తీరును తానే స్వయంగా పర్యవేక్షిస్తానని మంత్రి తెలిపారు. అటవీ శాఖ అధికారులు గ్రామాల్లో పర్యటించి అక్కడ ఏ మేరకు మొక్కలు నాటవచ్చునో గుర్తించి, ఆ విషయాలను గ్రామ సర్పం చ్, వార్డ్ మెంబర్లు, కార్యదర్శికి తగు సూచ నలు ఇవ్వాలన్నారు. హరితహారంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సమావేశంలో అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, పీసీసీఎఫ్ పీకే ఝా పాల్గొన్నారు. -
మొక్కలైతే నాటారు కానీ సంరక్షణ మరిచారు
-
మెుక్కల సంరక్షణకు జియోటాగింగ్
అధికారులకు కలెక్టర్ కరుణ ఆదేశం హన్మకొండ అర్బన్ : జిల్లాలో హరితహారం కార్యక్రమం కింద నాటిన ప్రతి మొక్కను సంరక్షించేందుకు, మొక్క స్థితిగతులు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు జియోటాగింగ్ విధానం అమలు చేయాలని కలెక్టర్ వాకాటి కరుణ అధికారులను ఆదేశించారు. సోమవారం రంగారెడ్డి కలెక్టరేట్ నుంచి అటవీశాఖ సాంకేతిక నిపుణుడు బాలకృష్ణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జియోటాగింగ్‌పై అవగాహన కల్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. హరితహారంలో నాటిన మొక్కలను ప్రదేశాల వారీగా మూడు రోజుల్లో జియోటాగింగ్ చేయాలని అధికారులకు సూచించారు. ఇందుకోసం ప్రతి శాఖకు కేటాయించిన యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో మొక్కల వివరాలు ఆన్లైన్లో మొబైల్ అప్లికేషన్లో నమోదు చేయాలన్నారు. అనంతరం సాగునీటి పారుదల, విద్యాశాఖ, ఎక్సైజ్, ఉద్యాన వన శాఖ, ఇంజనీరింగ్ శాఖల వారీగా లక్ష్యాలను సమీక్షించారు. జిల్లాలో 4 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకోసం అన్ని శాఖల అధికారులు కృషి చేయాలన్నారు. సమావేశంలో జేసీ ప్రశాంత్ జీవన్‌పాటిల్, సీపీఓ బీఆర్‌రావు, డీఎఫ్ఓ శ్రీనివాస్, డ్వామా పీడీ శేఖర్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఉద్యమస్ఫూర్తితో మెుక్కలు నాటాలి
రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యం అభివృద్ధిని ఓర్వలేకనే విపక్షాల విమర్శలు ఆర్అండ్బీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కోల్‌బెల్ట్ : హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటాలని రో డ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రా వు అన్నారు. భూపాలపల్లి నగర పంచాయతీ పరిధిలోని మంజూర్‌నగర్ సింగరేణి ఆసుపత్రి ఆవరణలో గురువారం ఆయన మెుక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండేం దుకే సీఎం కేసీఆర్ ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. మిషన్ కాకతీయ, భగీరథ పనులపై అవగాహన లేని నాయకులు అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని, అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు అవుతున్నారని, ఇది చూసి ఓర్వలేని ప్ర తిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు. స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ రాష్ట్రాన్ని కరువు రహిత ప్రాంతం గా మార్చేందుకే కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు. సింగరేణి సహకారంతో భూపాలపల్లి ప్రాంతంలో అత్యధికంగా మొక్కలను నాటామన్నారు. అనంతరం సింగరే ణి అధికారి కర్ణ అధికారులతో పర్యావరణ ప్రతి జ్ఞ చేయించారు. కార్యక్రమంలో భూపాలపల్లి ఏరియా జీఎం పాలకుర్తి సత్తయ్య, నగర పంచాయతి చైర్పర్సన్ బండారి సంపూర్ణరవి, టీబీజీ కేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు బడితెల సమ్మయ్య, పర్సనల్ మేనేజర్ రేవు సీతారాం, ఎస్ఓటుజీ ఎం సయ్యద్ హబీబ్ హుస్సేన్, ఏజంట్లు బళ్లా రి శ్రీనివాసరావు, మనోహర్, ఏజీఎం అప్పారావు, పర్సనల్ మేనేజర్లు శ్యాంసుందర్, తిరుపతి, నాయకులు కొక్కుల తిరుపతి, కటకం స్వామి, పైడిపల్లి రమేష్, ఐలయ్య పాల్గొన్నారు. హరితహారంపై నిర్వహించిన క్విజ్ పోటీల విజేతలకు ఆసుపత్రి సిబ్బంది స్వర్ణలత, సంజయ్ బహుమతులందజేశారు. -
కరువు నివారణకే హరితహారం
డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కోల్‌బెల్ట్ : రాష్ట్రంలో కరువు శాశ్వత నివారణ కోసం కొనసాగుతున్న హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. భూపాలపల్లి పట్టణంలోని మిలీనియం క్వార్టర్స్‌లో గురువారం సింగరేణి ఆధ్వర్యంలో చేపట్టిన హరితహారం కార్యక్రమానికి స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా డిప్యూటీ సీఎం హాజరై మెుక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెండేళ్లలో రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయనిన్నారు. దీనికి గత పాలకులు పర్యావరణ పరిరక్షణపై పట్టించుకోకపోవడమే కారణమన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ఐదేళ్లలో 230 కోట్లు మెుక్కలు నాటాలనే బృహత్తర కార్యక్రమం చేపట్టగా ఈ ఏడాది 46 కోట్ల మెుక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో వర్షాలు విస్తృతంగా కురుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సింగరేణి సంస్థ గనులు, ఓపెన్‌కాస్టులు, కార్మికకాలనీలు, స్వాధీన భూముల్లో మొక్కలు నాటడంతోపాటు సంరక్షించుకోవాలన్నారు. సింగరేణి ఇప్పటికే 75 లక్షల మొక్కలు నాటడం అభినందనీయమన్నారు. స్పీకర్ మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా స్పీకర్ హరితహారంపై ప్రతిజ్ఞ చేయించారు. సింగరేణి డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్టు మనోహర్‌రావు, భూపాలపల్లి ఏరియా జీఎం పాలకుర్తి సత్తయ్య, జడ్పీ చైర్మన్ గద్దల పద్మ, ములుగు ఆర్డీఓ మహేందర్‌జీ, స్పెషల్ ఆఫీసర్ చక్రధర్, భూపాలపల్లి నగర పంచాయతీ చైర్పర్సన్ బండారి సంపూర్ణ రవి, ఎంపీపీ కళ్లెపు రఘుపతిరావు, గుర్తింపు సంఘం బ్రాంచ్ ఉపాధ్యక్షులు బడితెల సమ్మయ్య, ఎస్‌ఓటూ జీఎం సయ్యద్ హబీబ్‌హుస్సేన్, పర్సనల్ మేనేజర్ రేవు సీతారాం, వైస్ చైర్మన్ గణపతి, కౌన్సిలర్లు సిరుప అనిల్, కంకటి రాజవీరు, గోనె భాస్కర్, టీఆర్ఎస్ నాయకులు మందల రవీందర్‌రెడ్డి, మేకల సంపత్‌కుమార్, కొక్కుల తిరుపతి, కటకం స్వామి, జోగుల సమ్మయ్య, బిబిచారి పాల్గొన్నారు. -
ప్రతి మండలంలో 6.30 లక్షల మెుక్కలు నాటాలి
జేసీ ప్రశాంత్ జీవన్ పాటిల్ నర్సంపేట : హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి మండలానికి 6.30లక్షల మొక్కలు నాటాలని జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ అన్నారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో గురువారం డివిజన్లోని అన్ని మండలాల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని మండలాల్లో కొత్త గా 6.30 లక్షల మెుక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యం విధించిందని చెప్పారు. ప్రభుత్వ స్థలా ల్లో ఎక్కువగా మొక్కలు నాటాలని, ఒక ఎకరంలో కనీసం వెయ్యి మొక్కలు ఉండాలని సూచించారు. రెవెన్యూ సిబ్బంది సహకారం తో గ్రామాల్లో ప్రభుత్వ భూములను ఎంపిక చేసి మెుక్కలు నాటేలా ప్రణాళిక సిద్ధం చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. వాటి సంరక్షణకు ఆయా గ్రామాల పరిధిలోని వ్యక్తులను నియమించాలని,వారికి ఈజీఎస్ కింద ఉపాధి కల్పించాలని సూచించారు. మొక్కల చుట్టూ ముళ్ల కంచె ఏర్పాటుచేయాలన్నారు. అంతకు ముందు స్థానిక రెవెన్యూ డివిజన్ కార్యాలయం లో మెుక్కలు నాటారు. కార్యక్రమం లో ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, డివిజన్ పరి« దిలోని అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు. -
చెట్ల పెంపకంతో కరువును పారదోలాలి
తొర్రూరు : రాష్ట్రంలో కరువును పారద్రోలాలంటే చెట్ల పెంపకం చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని సోమారం, గుర్తూరు, కంఠాయపాలెం, తొర్రూరు పట్టణంలో చేపట్టిన హరితహారం లో ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ పసునూరి దయాకర్‌తో కలిసి ఆయన శనివారం పాల్గొన్నారు. పలు ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటారు. తొర్రూరు, సోమారంలో జరిగిన సభల్లో కడియం శ్రీహరి మాట్లాడుతూ తెలంగాణను పచ్చగా మార్చేందుకు సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. ఈ ఏడాది 46వేల కోట్ల మొక్కలు నాటేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసి మొక్కలు నాటుతున్నట్లు చెప్పారు. పాలకుర్తి నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రూ.22కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎంపీ పసునూరి దయాకర్ హరి తహారంలో అందరూ భాగస్వాములు కావాల న్నారు. కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్ రావు కలయికతో జిల్లా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఏర్పడిందన్నారు. ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ ఈరోజు ఒక్కరోజే నియోజకవర్గ వ్యాప్తంగా నాలుగు లక్షల మొక్కలు నాటి జిల్లాలో రికార్డు సృష్టించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్.సుధాకర్‌రావు, ఎంపీపీ కర్నె సోమయ్య, జెడ్పీటీసీ సభ్యుడు జాటోతు కమలాకర్, సర్పంచ్‌లు రాజేశ్‌నాయక్, చందులాల్, తారా గంగారం,ఎంపీటీసీలు రమేశ్, సాహితీ, భాస్కర్, రాధ, సుభద్ర, నాగేశ్వర్, అరుణ, ఉప సర్పంచ్ రేవతి పాల్గొన్నారు. దూరదృష్టితో పనిచేస్తున్న కేసీఆర్ రాయపర్తి : తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు సీఎం కేసీఆర్ దూరదృష్టితో పనిచేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. మండలకేంద్రంలోని మార్కెట్‌యార్డు, మండలంలోని పెర్కవేడు శివాలయం, కొండాపురం గ్రామాల్లో శనివారం హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ పథకాలతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధిలో ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుకు తన సహకారం ఉంటుందని చెప్పారు. ఎంపీ పసునూరి దయాకర్ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి భారీ నిధులు తెస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి ఎక్కువ నిధులు కేటాయించాలని ఉప ముఖ్యమంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌రావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎంపీపి గుగులోతు విజయ, జెడ్పీటీసీ సభ్యురాలు వంగాల యాకమ్మ, వైస్ ఎంపీపీ యాక నారాయణ, సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు ఎండీ.ఉస్మాన్, గారె అనిత, వీరమ్మ, నూనావత్ రాధ, ఆర్డీవో వెంకటమాధవరావు, మామునూర్ ఏసీపీ మహేందర్, తహసీల్దార్ వాసం రామ్మూర్తి, ఎంపీడీఓ శంకరి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నూనావత్ నర్సింహానాయక్, జినుగు అనిమిరెడ్డి, సురేందర్‌రావు పాల్గొన్నారు. -
టీవీ ఆర్టిస్టుల బైక్ ర్యాలీ
పాల్గొన్న మేయర్ నన్నపునేని, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, కార్పొరేటర్లు హరితహారం గ్రీన్‌ఫండ్ కోసం రూ.3,78,116 విరాళాల సేకరణ హన్మకొండ : హరితహారంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు బుల్లితెర కళాకారులతో కలిసి కార్పొరేటర్లు, టీఆర్ఎస్ శ్రేణులు నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. 50వ డివిజన్ కార్పొరేటర్ దాస్యం విజయ్‌భాస్కర్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ర్యాలీని కాజీపేటలోని కడిపికొండ బ్రిడ్జి క్రాస్ రోడ్డు వద్ద గ్రేటర్ వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్, పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ ప్రారంభించారు. టీవీ ఆర్టిస్టులు విజయ్, లోహిత్, అభినవ్ సర్దార్, మున్నా ఫేం శ్రీధర్‌రావు, సై ఫేం షైన్ ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్నేహనగర్‌లోని వంద ఫీట్ల రోడ్డులో మొక్కలు నాటి, హరితహారం గ్రీన్‌ఫండ్ కోసం విరాళాలు సేకరించారు. అనంతరం కాలనీలో నిర్వహించిన సమావేశంలో మేయర్ నన్నపునేని నరేందర్, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అన్నారు. గ్రీన్‌ఫండ్ కోసం కళాకారుడు హైదరాబాద్ తల్వార్ రూ.51వేలు విరాళంగా ప్రకటించారు. కార్పొరేటర్ దాస్యం విజయ్‌భాస్కర్ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకొని తన పది నెలల జీతాన్ని గ్రీన్‌ఫండ్‌కు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. స్నేహనగర్ అభివృద్ధి కమిటీ రూ.లక్ష, తెలంగాణ జాగృతి మహిళా విభాగం అర్బన్ కన్వీనర్ అనితారెడ్డి రూ.లక్ష, రాజిరెడ్డి, బాలగౌడ్ కలిసి రూ.51 వేలు, రిటైర్డ్ టీచర్ వెంకటేశ్వర్లు రూ.11 వేలు, వెంకన్న రూ.5,116 విరాళాలుగా అందించారు. మెుత్తంగా రూ.3,78,116 విరాళాలు సేకరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ జోరిక రమేష్, నాయకులు నక్క లింగయ్య, ఆకుల మధుకర్, సతీష్, పులి సారంగపాణి, మనోహర్‌రావు, పాకనాటి మోహన్‌రెడ్డి, రాంప్రసాద్, కోగిల మహేష్, నర్సింగరావు, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ చౌర్యంపై విజిలెన్స్ తనిఖీలు
62 కేసులు నమోదు సబ్‌స్టేషన్‌లో మొక్కలు నాటిన అధికారులు కందుకూరు: మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో శనివారం చంపాపేట, రాజేంద్రనగర్ డివిజన్ల విజిలెన్స అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 19 బృందాలు పాల్గొని 62 కేసులు నమోదు చేశారు. అనంతరం హరితహారంలో భాగంగా కందుకూరు సబ్ స్టేషన్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విజిలెన్స డీఈలు సోమిరెడ్డి, కృష్ణారావు మాట్లాడారు. తమ పరిధిలో 2500 మొక్కలు నాటాలని నిర్ధేశించుకున్నట్లు తెలిపారు. ఇకపై తప్పనిసరిగా అన్ని జీపీల్లో పంచాయతీ భవనాలు, వీధి దీపాలకు విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. లేకపోతే సరఫరాను నిలిపివేయాల్సి వస్తుందని హెచ్చరించారు. విద్యుత్ చౌర్యానికి పాల్పడితే చర్యలు తప్పవన్నారు. పశువుల షెడ్లకు పది హెచ్‌పీకి మించకుండా ఉంటే క్యాటగిరి-4 కింద విద్యుత్ బిల్లులు వేస్తామన్నారు. వెరుు్య కోళ్లు పెంపకం ఉన్న షెడ్లకు ఈ విధానం వర్తిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మామిడిపల్లి, వనస్థలిపురం, చంపాపేట, గగన్‌పహాడ్ ఏడీఈలు హన్మంత్‌రెడ్డి, రాజేందర్, వినోద్‌రెడ్డి, దశరథ, స్థానిక ఏఈ చక్రపాణితో పాటు 27 మంది ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు. -
మూడేళ్లలో హరిత తెలంగాణ
-
మూడేళ్లలో హరిత తెలంగాణ
* ‘హరిత హారం’ కార్యక్ర మానికి శ్రీకారం చుట్టిన సర్కారు * రాష్ట్రాన్ని హరిత వనంగా మార్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయం * ప్రతి నెలలో ఒక వారం పచ్చదన వారోత్సవ కార్యక్రమాలు * తెలంగాణ వ్యాప్తంగా 210 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళిక * అటవీ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సాక్షి, హైదరాబాద్: మూడేళ్లలో రాష్ట్రాన్ని హరితవనంగా మార్చేందుకు తెలంగాణ సర్కారు చర్యలు చేపట్టింది. ‘హరిత హారం’ పేరిట రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కల పెంపకాన్ని చేపట్టాలని నిర్ణయించింది. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులను భాగస్వాములను చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంకల్పించింది. రాష్ట్రంలో 33 శాతం భూభాగాన్ని పచ్చదనంతో నింపేందుకు సుమారు 210 కోట్ల మొక్కలు నాటాల్సి ఉంటుందని అంచనా వేసిన ప్రభుత్వం.. దీన్ని అమల్లో పెట్టడం ద్వారా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను మరింత పెంచాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. దీనికి సంబంధించి ఉన్నతాధికారులతో శుక్రవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమీక్ష జరిపారు. రాష్ట్రం మొత్తంగా... హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ)తో పాటు అన్ని జిల్లాల్లోనూ మొక్కల పెంపకం, నర్సరీల ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణపై ఈ సందర్భంగా చర్చించారు. ప్రతీ నెలలో ఒక వారం పచ్చదన వారోత్సవం పాటించాలని కేసీఆర్ ఆదేశించారు. ఈ వారోత్సవంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులంతా పాల్గొనాలని సూచించారు. మూడేళ్లలో హెచ్ఎండీఏ పరిధిలో 10 కోట్ల మొక్కలను నాటాలని నిర్ధేశించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఏటా 40 లక్షల మొక్కలు నాటేలా, అవి బతికేలా అన్ని చర్యలు చేపట్టాలని కేసీఆర్ పేర్కొన్నారు. తరిగిపోతున్న అటవీ సంపదను కాపాడుకునేందుకు భారీ స్థాయిలో మొక్కలు నాటాల్సిన అవసరాన్ని ఆయన గుర్తుచేశారు. సింగపూర్ తరహాలో ప్రణాళికాబద్ధంగా పచ్చదనాన్ని పెంచాలని సూచించారు. రహదారుల పక్కనే మొక్కలు నాటడం పాత పద్ధతని, అలాకాకుండా అటవీ ప్రాంతంలో నడుస్తున్నామన్న భావన ప్రజల్లో కలిగేలా ఈ పెంపకం ఉండాలని చెప్పారు. అన్ని నదుల పరీవాహక ప్రాంతాలు, అన్ని చెరువుల గట్లపై, వివిధ విద్యా, పారిశ్రామిక సంస్థల, ప్రభుత్వ సంస్థల్లోని ఖాళీ ప్రదేశాల్లోనూ, యూనివర్సిటీ ఆవరణల్లోనూ మొక్కల పెంపకం చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో ఇంటి నిర్మాణ అనుమతికి ముందే మొక్కలు నాటడం తప్పనిసరి చేయాలన్నారు. రావి, మర్రి, వేప, అశోక చెట్టు, పూల మొక్కలను ఎంపిక చేసి నాటించాలని సూచించారు. వీటికి అవసరమైన నిధులను జాతీయ ఉపాధి హామీ పథకం, కంపా(కాంపెన్సేటరీ అఫాస్ట్రేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ) నుంచి తీసుకోవాలని మార్గనిర్దేశం చేశారు. సూక్ష్మ స్థాయి ప్రణాళికలు సిద్ధం చేసి పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. ప్రతి నాలుగైదు గ్రామాలకు ఓ నర్సరీని ఏర్పాటుచేసి మొక్కల పెంపకం చేపట్టాలని, అందుకు అవసరమైన స్థలాలను గుర్తించాలని కూడా ఆదేశించారు. ఈ కార్యక్రమం అమలును అన్ని స్థానిక సంస్థల సమావేశాల్లో విధిగా చర్చించేలా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా కలెక్టర్లు, ఆర్డీవోలు, జిల్లా అటవీ అధికారులు సంయుక్తంగా సమావేశాలు ఏర్పాటు చేసి కార్యక్రమ అమలును ఖరారు చేయాలని నిర్దేశించారు. ఈ సమావేశంలో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, హెచ్ఎండీఏ కమిషనర్ నీరజ్‌కుమార్ ప్రసాద్, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ ముఖ్య అధికారి మిశ్రా, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.